Supreme Court: అన్ని హద్దులూ దాటేశారు
ABN, Publish Date - May 23 , 2025 | 04:52 AM
తమిళనాడు టాస్మాక్‌పై ఈడీ చర్యలు రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నీట్ పీజీ సీట్ల బ్లాకింగ్ వల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, దానికి చెక్ పెట్టేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
తక్షణమే దర్యాప్తును నిలిపివేయండి
కొంతమంది చేసిన ఉల్లంఘనకు
సంస్థపై చర్యలెలా తీసుకుంటారు
తమిళనాడు మద్యం వివాదంలో
ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కక్ష సాధింపునకే ఈడీ ప్రయోగం
ఎన్నికల దృష్టితో వ్యవహరిస్తున్న కేంద్రం
పిటిషన్‌లో తమిళనాడు ఆరోపణ’
ప్రభుత్వ కార్పొరేషన్‌ను లక్ష్యంగా చేసుకునే క్రమంలో సమాఖ్య భావనను ఈడీ దెబ్బతీసింది. ఈడీ చర్యలు చట్ట విరుద్ధం. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
- సుప్రీం
చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. తమిళనాడు ప్రభుత్వ మద్యం క్రయవిక్రయాల సంస్థలో (తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్- టాస్మాక్) అక్రమాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘టాస్మాక్’ కేసు వ్యవహారంలో ఈడీ అన్ని హద్దులూ దాటేసిందని దుయ్యబట్టింది. కొంతమంది వ్యక్తులు చేసిన ఉల్లంఘనలకు ఒక సంస్థపై ఎలా చర్యలు తీసుకుంటారని నిలదీసింది. టాస్మాక్‌పై ఈడీ చేపట్టిన మనీలాండరింగ్ దర్యాప్తును నిలిపివేసింది. ఈ వివాదంలో తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టాస్మాక్ సంస్థలో రూ.వెయ్యి కోట్ల విలువైన మద్యం స్కామ్ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గత మార్చిలో ఈడీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మద్యం సరఫరా ఆర్డర్ల కోసం డిస్టిలరీలు ముడుపులు చెల్లించాయనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. దీనిని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈడీ చర్యలను హైకోర్టు సమర్థిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 23న తీర్పు ఇచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్‌లు సుప్రీంకోర్టు ఈ నెల 20న తలుపుతట్టాయి. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గి తదితరులు వాదనలు వినిపించారు.
టాస్మాక్‌లో 2014 నుంచి మద్యం వ్యవహారంలో కొంతమంది వ్యక్తులు డబ్బు అందుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 41 కేసులు నమోదుచేసిందన్నారు. కానీ ఈడీ ఇప్పుడీ వ్యవహారాన్ని ముందుకు తెచ్చి హడావుడిగా సోదాలు చేపట్టిందని ఆరోపించారు. టాస్మాక్ కార్యకలాపాలు స్తంభింపజేసేలా కార్యాలయంలోని కంప్యూటర్లు, పెన్ డ్రైవ్ సహా పలు పరికరాలను ఈడీ అఽధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అలాగే, టాస్మాక్ సంస్థలోని ఉద్యోగుల సెల్‌ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, మహిళా ఉద్యోగులను సైతం వేధింపులకు గురిచేస్తూ నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న టాస్మాక్‌పై ‘మీరెలా దాడి చేస్తారు’ అని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజును ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌ను లక్ష్యంగా చేసుకునే క్రమంలో సమాఖ్య భావనను ఈడీ దెబ్బతీసిందని ఆక్షేపించింది. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగానూ, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగానూ ఉన్నాయని తేల్చింది. ఈడీకి నోటీసులు జారీచేసింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు ఈడీకి చెంపపెట్టులాంటిదని అధికార డీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ భారతి వ్యాఖ్యానించారు.
నీట్ పీజీలో ‘సీట్ల బ్లాక్’ను నిరోధించండి!
నీట్ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో సీట్ల బ్లాకింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత మంది అభ్యర్థులు పాల్పడే ఈ చర్య వలన మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంది. సీట్ల బ్లాకింగ్ అనేది కేవలం తప్పు మాత్రమే కాదని, ఇది పాతుకుపోయిన లోతైన వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టేందుకు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నీట్ పీజీ కోసం అన్ని ప్రైవేటు/డీమ్డ్ వర్సిటీలు కౌన్సెలింగ్‌కు ముందుగానే ట్యూషన్, హాస్టల్, కాషన్ డిపాజిట్ తదితర ఫీజుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశించింది. సీట్ల బ్లాకింగ్‌కు పాల్పడితే సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు, భవిష్యత్తు నీట్ పీజీ పరీక్షకు అనర్హత, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే కాలేజీను బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆధార్ ఆధారిత సీట్ల ట్రాకింగ్‌ను అమలు చేయాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News
Updated Date - May 23 , 2025 | 04:52 AM