కాల్పుల విరమణ కోరింది మేమే
ABN, Publish Date - Jun 21 , 2025 | 06:28 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ చేద్దామని తామే భారత్‌ను అభ్యర్థించినట్టు పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు.
నూర్‌ఖాన్ తదితర ఎయిర్‌బేస్‌లపై దాడుల తర్వాత ఈ ప్రతిపాదన చేశాం
తొలిదెబ్బతీసి భారత్ విస్మయపరిచింది
దాడులను ఆపించడానికి సౌదీ చొరవ
పాక్ ఉపప్రధాని ఇషాక్‌దార్ ఒప్పుకోలు
న్యూఢిల్లీ, జూన్ 20 : ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ చేద్దామని తామే భారత్‌ను అభ్యర్థించినట్టు పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. నూర్ ఖాన్ తదితర ముఖ్య వైమానిక స్థావరాలపై దాడులు మొదలయ్యాక తాము భారత్‌కు ఈ ప్రతిపాదనను చేసినట్టు ఆయన తెలిపారు. 26మంది పౌరులను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను గత నెల ఏడో తేదీన ప్రారంభించి...నూర్‌ఖాన్, షోర్కోట్ ఏయిర్‌బే్‌సలపై దాడులు జరిపింది. ఎదురుదాడికి తాము సమాయత్తం అవుతుండగానే, మొదటిదెబ్బ తీయడంద్వారా భారత్ విస్మయపరిచిందన్నారు. భారత్‌కు చెప్పి దాడులు ఆపించడానికి సౌదీ అరేబియా చొరవ చేసి ముందుకొచ్చిందని, ఆ తర్వాత తాము అమెరికాను ఇదే విషయమై సంప్రదించామని ఆయన వివరించారు. ‘‘భారత్ నుంచి దాడులు మొదలైన 45 నిమిషాలకే సౌదీ అరేబియా యువరాజు ఫైజల్ బిన్ సల్మాన్ నాకు ఫోన్ చేశారు.
దాడులు ఆపేలా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడమంటారా అని అడిగారు.’’ అని తెలిపారు. ఆ తర్వాత తాము అమెరికా సాయం కోరామని దార్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఎంపిక చేసుకున్న లక్ష్యాలపై పరిమితస్థాయిలో భారత్ మిలిటరీ దాడులు జరిపింది. మే 7వ తేదీన మొదలైన ఈ దాడులు మూడు రోజులు కొనసాగాయి. అనంతరం ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, భారత్-పాక్ మధ్య ఒప్పందం తానే కుదిర్చానని, వాణిజ్య ప్రయోజనాలను ముందుపెట్టడంతో ట్రంప్ గొప్పకు పోయారు. అది వాస్తవం కాదని ఫోన్ సంభాషణలో ప్రధాని మోదీ స్పష్టం చేసిన తర్వాత ట్రంప్ కొంత తగ్గారు. తాజాగా దార్ ఒప్పుకోలును బట్టి, భారత్‌తో కాల్పుల విరమణ కోసం పాకిస్థానే తొందరపడిందని స్పష్టమైంది. భారత్‌కు చెప్పి దాడులు ఆపించడానికి తనకు సహకరించాలని అందరినీ దాయాదిదేశం అభ్యర్థించినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అయితే, భారత్‌ను దీటుగా ఎదుర్కొన్నామంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర అత్యున్నత అధికారులు చేసిన ప్రకటనతో దార్ ప్రకటన విబేధించడం గమనార్హం.
Updated Date - Jun 21 , 2025 | 06:28 AM