టోల్ చెల్లింపులు సులువుగా చౌకగా
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:57 AM
తక్కువ ఖర్చుతో ఏవిధమైన ఇబ్బందుల్లేకుండా దేశం మొత్తం ప్రయాణించేందుకు పాస్‌ను తీసుకొచ్చామన్నారు
టోల్ పాస్..
ఒకేసారి రూ.3 వేలు చెల్లిస్తే..
ఏడాది గడువు లేదా 200 ట్రిప్పులకు అనుమతి
కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్
సగటున ఒక్కో టోల్‌ప్లాజాకు రూ.15తో సరి!
ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి
వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకే..: గడ్కరీ
న్యూఢిల్లీ, జూన్ 18: జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టోల్ చార్జీల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాల కోసం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ వార్షిక పాస్ ధరను రూ. 3 వేలుగా నిర్ణయించింది. యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఏడాది కాలం లేదా 200 ట్రిప్పుల వరకు (ఏది ముందు పూర్తయితే అది) పాస్ చెల్లుబాటు అవుతుంది. పాస్టాగ్ ఆధారిత పాస్ వివరాలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇబ్బందుల్లేని జాతీయ రహదారి ప్రయాణం కోసం ఓ ముందడుగు వేశామని ఆయన చెప్పారు. ఈ పాస్‌ను వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలు.. అంటే కార్లు, జీపులు, వ్యాన్లు మొదలగు వాటి కోసమే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నామనితక్కువ ఖర్చుతో ఏవిధమైన ఇబ్బందుల్లేకుండా దేశం మొత్తం ప్రయాణించేందుకు పాస్‌ను తీసుకొచ్చామన్నారు. పాస్ యాక్టివేషన్, రెన్యువల్ కోసం రాజ్‌మార్గ్ యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ, మోర్త్ అధికారిక వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌ను త్వరలో అందుబాటులో ఉంచుతామన్నారు. కాగా, ప్రధానంగా 60 కి.మీ. లోపే టోల్‌ప్లాజాలు ఉండటంపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఒకేసారి చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల విషయంలో స్పష్టత తీసుకురావచ్చని ప్రభుత్వ చెప్పింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమల్లో ఉంది. అయితే కొత్త విధానంతో వాహనదారులకు సులువైన, చవకయిన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఫాస్టాగ్ పాస్‌లో విశేషాలు
రూ.3 వేలు ఫిక్స్‌డ్ పేమెంట్ ఉంటుంది. 200 ట్రిప్పులు లేదా ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా హైవేలన్నింటికి వర్తిస్తుంది.
ప్రత్యేకంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ ఫోర్ వీలర్స్‌కు మాత్రమే పాస్ ఇస్తారు.
ట్రిప్పుల పరిమితి లేదా గడువు పూర్తయ్యే వరకు ఫాస్టాగ్ నుంచి టోల్ మినహాయించరు.
ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్న వారు పాస్ కోసం కొత్తగా మరో ఫాస్టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్ కూడా తప్పనిసరి కాదు. పాస్ తీసుకోని వారు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఒక టోల్ ప్లాజాను దాటి వెళితే దానిని ఒక ట్రిప్పుగా, అదే టోల్ ప్లాజా నుంచి వెనక్కి వస్తే (రౌండ్ ట్రిప్) రెండు ట్రిప్పులుగా పరిగణిస్తారు. అంటే పాస్ తీసుకుంటే ఒక ట్రిప్పునకు రూ.15 చెల్లించినట్లు అవుతుంది.
ఏడాది గడువు తీరకుండా 200 ట్రిప్పుల పరిమితి పూర్తయిన వారు మళ్లీ పాస్‌ను కొనుక్కోవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా పర్చేజ్ చేయవచ్చు.
Updated Date - Jun 19 , 2025 | 04:15 AM