Madras High Court: ప్రజల విశ్వాసం కోల్పోతున్న సీబీఐ
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:18 AM
సీబీఐ దర్యాప్తు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, డైరెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేయాలని సూచించింది.
ఆ సంస్థపై అవినీతి ఫిర్యాదులు
పెరుగుతున్నాయి: మద్రాస్ హైకోర్టు
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని సూచన
చెన్నై, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): సీబీఐ ప్రజల విశ్వాసం కోల్పోతోందని మద్రాస్ హైకోర్టు తూర్పారబట్టింది. సీబీఐపైనే అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలోని ఓ జాతీయ బ్యాంకులో రుణాల పేరుతో రూ.2 కోట్ల మోసం జరిగిన వ్యవహారంలో ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సహా 13 మందిపై సీబీఐ అధికారులు కేసు నమోదుచేశారు. విచారణ జరిపిన సీబీఐ కోర్టు బ్యాంక్ చీఫ్ మేనేజర్ బాలసుబ్రమణియన్‌తోపాటు 8 మందికి మాత్రమే శిక్ష విధిస్తూ 2019లో తీర్పు ఇచ్చింది. దీంతో ఆ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ 8మంది హైకోర్టు మదురై ధర్మాసనంలో అప్పీలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సీబీఐపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉండేది. కానీ, ఇక్కడ సీబీఐ విచారణలో లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని కేసుల్లో ప్రధాన నిందితులను నిర్దోషులుగా విడుదల చేసి, కొంతమంది వ్యక్తులపై కేసులు నమోదు చేస్తోందని బాధితుల తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. సీబీఐపై అవినీతి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా సీబీఐ ప్రజల విశ్వాసం కోల్పోతోంది. ఈ నేపథ్యంలో కేసులో నిందితులను చేర్చడం, వారిపై కేసులు నమోదుచేయడం, చార్జిషీటు దాఖలు చేయడం వరకు ప్రతి విషయాన్నీ సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి’ అని ధర్మాసనం సూచించింది.
ఇవి కూడా చదవండి..
Pakistan: భారత 'గూఢచారి డ్రోన్'ను కూల్చేశామన్న పాక్
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
Updated Date - Apr 30 , 2025 | 05:18 AM