Justice Yashwant Varma: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఎంక్వైరీ కమిటీ నివేదిక రద్దుకు విజ్ఞప్తి
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:13 PM
తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఎంక్వైరీ కమిటీ నివేదికను పక్కన పెట్టాలని అభ్యర్థించారు.
ఇంటర్నెట్ డెస్క్: నోట్ల కట్టలు లభించిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తుల ఎంక్వైరీ కమిటీ సమర్పించిన నివేదికను సవాలు చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న సూచనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఎంక్వైరీ కమిటీ నివేదికను కొట్టివేయాలని జస్టిస్ వర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కమిటీ నివేదిక తన హక్కులను ఉల్లంఘించిందని అన్నారు. కమిటీ రిపోర్టు ఆధారంగా తనపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలన్న మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచనను పక్కన పెట్టాలని అభ్యర్ధించారు. ఈ ఉదంతంలో కీలక వాస్తవాలను పరిశీలించకుండానే ఎంక్వైరీ కమిటీ తుది నిర్ణయానికి వచ్చిందని అన్నారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్‌ను తనపై మోపడం తప్పని పేర్కొన్నారు. ఎంక్వెరీ కమిటీ అభిప్రాయాలను తప్పని నిరూపించాల్సిన బాధ్యతను తప్పుగా తనపై మోపారని తెలిపారు.
త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇక ఈ వ్యవహారంలో పోలీసు, ఈడీ విచారణలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇటీవల సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పూర్తి స్థాయి విచారణ జరిగేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు లభించినప్పుడు కేసు నమోదు చేయడం పోలీసుల బాధ్యత అని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
నిమిష ప్రియ కేసుపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఇది సున్నితమైన అంశమని ప్రకటన
బిహార్‌లో షాకింగ్ ఘటన.. ఐసీయూలోని పేషెంట్‌పై కాల్పులు జరిపి హత్య
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 12:21 PM