Justice Chandrachud: కుమార్తెలకు అనారోగ్య సమస్యలు
ABN, Publish Date - Jul 08 , 2025 | 05:31 AM
అరుదైన జన్యువాధితో బాధపడుతున్న తన ఇద్దరు కుమార్తెలకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యానే..
అరుదైన జన్యువ్యాధి.. అందుకనే అధికారిక నివాసం ఖాళీ చేయలేదు
మాజీ సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ, జూలై 7: అరుదైన జన్యువాధితో బాధపడుతున్న తన ఇద్దరు కుమార్తెలకున్న ప్రత్యేక అవసరాల దృష్ట్యానే.. అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. గతేడాది నవంబరులో రిటైరైన చంద్రచూడ్ ఇప్పటికీ సీజేఐ అధికారిక నివాసంలోనే ఉంటున్నారని, ఆయనను ఖాళీ చేయించాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు పాలనా విభాగం లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రచూడ్ వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. తాను, తన భార్య కల్పన.. ప్రియాంక, మహి అనే ఇద్దరు బాలికలను గతంలో దత్తత తీసుకున్నామని, వారిరువురూ నెమలిన్ మయోపతి అనే అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.
ఈ వ్యాధి వల్ల బాలికలిద్దరికీ కండరాలు, నాడీ, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతుంటాయని.. ఈ వ్యాధికి ప్రస్తుతం చికిత్స లేదన్నారు. వారి ప్రత్యేక అవసరాల దృష్ట్యా.. అధికారిక నివాసంలో పలు మార్పులు చేశామని, రిటైర్మెంట్ తర్వాత అటువంటి ఇల్లు కోసం వెదికితే ఢిల్లీలో దొరకలేదన్నారు. పదవీ విరమణ తర్వాత తనకు ప్రభుత్వం కేటాయించిన భవంతిలో గత రెండేళ్లుగా ఎవరూ ఉండటం లేదని, ఆ భవనంలో మరమ్మతులు జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే దాంట్లోకి వెళ్తామన్నారు. కాగా, జస్టిస్ చంద్రచూడ్‌కు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 05:31 AM