ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇటు యుద్ధం.. అటు దౌత్యం!

ABN, Publish Date - Jun 21 , 2025 | 06:25 AM

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ఎనిమిదో రోజూ కొనసాగింది. ఇజ్రాయెల్‌ తన యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది.

  • పరస్పరం కొనసాగుతున్న ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దాడులు

  • అదే సమయంలో దౌత్య పరిష్కారం కోసం ప్రయత్నాలు

  • రంగంలోకి యూరప్‌ దేశాలు

న్యూఢిల్లీ, జూన్‌ 20: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ఎనిమిదో రోజూ కొనసాగింది. ఇజ్రాయెల్‌ తన యుద్ధ విమానాలతో ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్‌లోని పలు నగరాలపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది. మరోవైపు ఇరాన్‌ను అణ్వస్త్ర నిరోధక ఒప్పందం దిశగా ఒప్పించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ విభాగం చీఫ్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో భేటీ అయ్యారు. చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌తో యుద్ధం ఆపగలదని ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి మాజిద్‌ ఫరహని పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ నాయకత్వాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే చాలు. ఇరాన్‌ దౌత్యపరమైన మార్గాన్ని విశ్వసిస్తుంది. అది నేరుగా అయినా, పరోక్షంగా అయినా సరే..’’ అని పేర్కొన్నారు. అయితే తమ పౌర అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని.. ఏవైనా షరతులు ఉంటే ఆలోచిస్తామని చెప్పారు. మరోవైపు బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో భేటీ అయ్యారు. ఇరాన్‌తో అణు ఒప్పందం జరిగే అవకాశాలు, ఉద్రిక్తతలు తగ్గించే చర్యలపై చర్చించారు.

ట్రంప్‌ యంత్రాంగంతో నెతన్యాహు భేటీ

ఇరాన్‌ అణుఒప్పందానికి రాకుంటే.. ఇజ్రాయెల్‌కు తోడుగా తాము కూడా రంగంలోకి దిగుతామని ట్రంప్‌ ఇటీవల పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ ఈ అంశంపై ట్రంప్‌ తర్జనభర్జన పడుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌, ఇతర ప్రతినిధుల బృందంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఐడీఎఫ్‌ చీఫ్‌ ఇయాల్‌ జమీర్‌, రక్షణ మంత్రి ఇజ్రాఎల్‌ కట్జ్‌ తదితరులు శుక్రవారం భేటీ అయ్యారు.

కొనసాగిన దాడులు..

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పోరు ఎనిమిదో రోజూ ఉధృతంగా సాగింది. ఇరాన్‌లోని పదులకొద్దీ మిలటరీ లక్ష్యాలపై 60కిపైగా యుద్ధ విమానాలతో దాడులు చేశామని, 120కిపైగా స్వల్పశ్రేణి క్షిపణులు, బాంబులు ప్రయోగించామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) ప్రకటించింది. ముఖ్యంగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని క్షిపణుల తయారీ, రక్షణ పరిశోధన కేంద్రాలను, ఇజ్రాయెల్‌ వైపు గురిపెట్టి ఉన్న మూడు క్షిపణి లాంచింగ్‌ వ్యవస్థలను.. టెహ్రాన్‌తోపాటు ఇస్ఫహాన్‌ ప్రాంతాల్లో రాడార్‌ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది.

క్లస్టర్‌ బాంబులతో ఇరాన్‌ దాడి..

మరోవైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. ఈ యుద్ధంలో మొదటిసారిగా క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణిని ప్రయోగించింది. క్షిపణి నిర్దేశిత లక్ష్యం సమీపంలోకి రాగానే సుమారు ఏడు కిలోమీటర్ల ఎత్తులో వార్‌హెడ్‌ విచ్చుకుని చిన్నచిన్న బాంబులు నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడి విధ్వంసం సృష్టిస్తాయి. ఒక క్షిపణితో ఒకేచోట భారీ విధ్వంసం సృష్టించడం కన్నా... ఎక్కువ ప్రాంతాల్లో నష్టం కలిగించడమే ఈ క్లస్టర్‌ బాంబుల ఉద్దేశం. ఇరాన్‌ ప్రయోగించిన ఈ క్షిపణి నుంచి 20కిపైగా బాంబులు విడిపోయి అజోర్‌ నగరంపై పడినట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పత్రిక తెలిపింది.

భారతీయుల కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముదురుతుండటంతో ఇరాన్‌ తన గగనతలం మీదుగా ఎలాంటి విమానాలు ప్రయాణించకుండా నిషేధించిన విషయం తెలిసిందే. దీనితో సుమారు 10 వేల మంది భారతీయులు ఇరాన్‌లో చిక్కుకుపోయారు. అందులో 2వేల విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించుకునేందుకు వీలుగా ఇరాన్‌ తన గగనతలాన్ని తెరిచింది. ఇప్పటికే ఇరాన్‌ నుంచి ఆర్మేనియా మీదుగా 110 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.

Updated Date - Jun 21 , 2025 | 06:25 AM