12 బంకర్ బస్టర్ బాంబులూ చాల్లేదా?
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:25 AM
ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనది.. ఫోర్డో అణు కేంద్రం. ఇరాన్ ఈ యురేనియం శుద్ధి కేంద్రం నిర్మాణాన్ని 2006లో ప్రారంభించింది.
కొండల మధ్య.. భూమికి 295 అడుగుల
లోతున ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రం
అమెరికా పూర్తిగా ధ్వంసం చేయలేదేమోనన్న సందేహాలు
ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనది.. ఫోర్డో అణు కేంద్రం. ఇరాన్ ఈ యురేనియం శుద్ధి కేంద్రం నిర్మాణాన్ని 2006లో ప్రారంభించింది. ప్రపంచానికి దీని గురించి తెలిసింది 2009లో. దరిమిలా..ఈ కేంద్రానికి సంబంధించిన కీలక పత్రాలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఇరాన్ నుంచి దొంగిలించాయి. ఆ పత్రాల్లో ఉన్న వివరాల ప్రకారం.. ఫోర్డో అణు కేంద్రం.. భూగర్భంలో దాదాపుగా 80 నుంచి 90 మీటర్ల లోతున ఉంది. ఇక.. కేవలం 5ు శుద్ధి చేసిన యురేనియం తయారీ కోసం, 3000 సెంట్రీఫ్యూజులతో ఈ అణు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఇరాన్ తొలినాళ్లలో ప్రకటించింది. అయితే.. 2011 సెప్టెంబరు నాటికి 20ు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. వైద్య ప్రయోజనాల నిమిత్తమే.. 20ు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ ఈ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నట్టు 2012 జనవరిలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ప్రకటించింది. 2016లో.. ఇరాన్ ఈ కేంద్రానికి రక్షణగా రష్యాకు చెందిన ఎస్-300 క్షిపణి వ్యవస్థను మోహరించింది. ఈ కేంద్రంలో ఇరాన్ నెలకు సగటున 60ు శుద్ధిచేసిన 55 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా. అయితే.. ఇక్కడ 83.7 శాతం శుద్ధి చేసిన యురేనియంను గుర్తించినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ 2023 మార్చిలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే.. ఇజ్రాయెల్ దృష్టి ఈ అణు కేంద్రంపై పడింది. ఒకవేళ ఐఏఈఏ ప్రకటన నిజమై 83.7ు శుద్ధి చేసిన యురేనియాన్ని గనక ఇరాన్ ఉత్పత్తి చేస్తుంటే అది తమకు ప్రమాదమేనని భావించిన ఇజ్రాయెల్ ఈ నెల 13న ఇరాన్‌పై భీకర దాడులు ప్రారంభించింది. ఆరోజు ఇజ్రాయెల్ ఈ ప్లాంట్‌పై కూడా దాడులకు యత్నించింది. కానీ.. భూగర్భంలో దాదాపు 90 మీటర్ల లోతున ఉండడంతో అణు కేంద్రానికి ఏమీ కాలేదు. అంత లోతుకు వెళ్లి యురేనియం శుద్ధి కేంద్రాన్ని నాశనం చేయాలంటే.. అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులు, దాన్ని ప్రయోగించే సామర్థ్యం ఉన్న బీ2 స్టెల్త్ బాంబర్ విమానాలు కావాలి. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌తో పలుమార్లు చర్చలు జరిపారు.
దాడులు పూర్తిగా ఫలించలేదా?
‘ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్’ పేరిట..ఫోర్డో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా 12 బంకర్ బస్టర్ బాంబు (జీబీయూ-57)లను ప్రయోగించినట్టు సమాచారం. ఇందుకోసం అమెరికా డజను బీ2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది. మిసౌరీ (అమెరికా)లోని వైట్‌మ్యాన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి బయల్దేరిన బీ2 స్టెల్త్ బాంబర్లు నిరంతరాయంగా 37 గంటలపాటు ప్రయాణించి (గాల్లోనే వాటికి రీఫ్యూయెలింగ్ చేశారు) దాడులు చేశాయి. ఎందుకలా అంటే.. 13,600 కిలోల బరువుండే బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించడం.. ఒక్క బీ2 స్టెల్త్ బాంబర్లకే సాధ్యం. అవి ప్రపంచంలో ఒక్క అమెరికా అమ్ములపొదిలో మాత్రమే ఉన్నాయి. ఇక.. జీబీయూ-57 పెనెట్రేటర్లు భూమి లోపల 60 మీటర్ల లోతున ఉండే అత్యంత పటిష్ఠమైన కాంక్రీటు కట్టడాలను సైతం బదాబదలు చేస్తాయి. అంతకన్నా లోతున ఉండే నిర్మాణాలపై దాడి చేయాలంటే.. ఒకదాని తర్వాత ఒకటిగా బంకర్ బస్టర్ బాంబులను జారవిడుస్తారు. మొదటి బాంబు తాకిడికి దాదాపు 200 అడుగుల లోతు దాకా గొయ్యి పడడంతో.. ఆ తర్వాత వేసే బాంబులు అంతకన్నా లోతుకు వెళ్లి విధ్వంసం సృష్టిస్తాయి. అయితే.. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుందిగానీ.. దీంట్లో ఒక చిన్న లొసుగు ఉంది. మొదటి బంకర్ బస్టర్ బాంబు పడ్డ చోటే రెండోదీ పడాలని లేదు. ఈ కచ్చితత్వం లేకపోవడం వల్ల 60 మీటర్ల కన్నా లోతున ఉండే నిర్మాణాలను నాశనం చేయడం అంత సులువైన పని కాదు. అందుకే.. తొలుత ఈ కేంద్రంపై రెండు బాంబులు వేస్తే చాలని భావించిన అమెరికా.. 12 బాంబులు వేయాల్సి వచ్చింది. కానీ.. కచ్చితత్వం లేకపోవడం వల్ల ఈ 12 బాంబులతో కూడా పని పూర్తి కాలేదని.. ట్రంప్ చెప్పినట్టుగా ఫోర్డో అణు కేంద్రమేమీ ‘తుడిచిపెట్టుకు’పోలేదని.. అమెరికాకు చెందిన విశ్వసనీయ వర్గాలే తెలిపినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక కథనంలో వెల్లడించింది.
- సెంట్రల్ డెస్క్
Updated Date - Jun 23 , 2025 | 05:25 AM