Kim Jong Un control: ప్రతీ పదంపై నిఘా.. 5 నిమిషాలకో స్ర్కీన్‌షాట్
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:31 AM
ఉత్తరకొరియాలో ఫోన్లు కఠిన నియంత్రణలతో ఉన్నాయి. ప్రతి పదం, ప్రతి స్క్రీన్‌షాట్ ప్రభుత్వానికి సెక్యూర్‌గా అందుతుంది, విదేశీ కంటెంట్‌ను చూసినవారిపై తీవ్ర చర్యలు తీసుకుంటారు.
ప్రజలు ఏ యాప్ చూస్తున్నదీ, ఏమేం చేస్తున్నదీ అధికారులకు తెలిసిపోయేలా రహస్య ఏర్పాట్లు
ఉత్తర కొరియా నుంచి స్మగుల్ అయిన స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించి బీబీసీ కథనం
న్యూఢిల్లీ, జూన్ 1: మన ఫోన్‌లో ఏదైనా మన వ్యక్తిగతం.. సోషల్ మీడియా మొదలు అంతర్జాతీయ వెబ్‌సైట్ల దాకా అందులో ఏం చూసేదీ మనిష్టం. కానీ ఉత్తరకొరియాలో మాత్రం ఫోన్ అంటే ఓ నిఘా సాధనం. ఫోన్‌లో ఏం చూస్తున్నదీ, ఏం చేస్తున్నదీ క్షణక్షణం ప్రభుత్వానికి తెలిసిపోతుంది. చివరికి ఫోన్‌లో టైప్ చేసే పదాలపైనా నిఘా ఉంటుంది. ఆ పదాలు ఆటోమేటిగ్గా వేరే పదాల కింద మారిపోతాయి. ఉత్తరకొరియా నుంచి బయటికి స్మగ్లింగ్ చేసిన ఒక స్మార్ట్‌ఫోన్‌ను క్షుణ్నంగా పరిశీలించిన బీబీసీ ఆ వివరాలతో ఓ కథనం ప్రచురించింది. ఉత్తర కొరియాలో స్మార్ట్‌ఫోన్లన్నీ ప్రత్యేకంగా ప్రొగ్రామింగ్ చేసి ఉంటాయి. సమాచారం ఏదైనా ఆటోమేటిగ్గా సెన్సార్ అవుతుంది. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన భాష, సంస్కృతి, ఇతర అంశాలపై నిషేధం ఉంటుంది. ఉదాహరణకు ఫోన్‌లో దక్షిణ కొరియా అని టైప్ చేస్తే.. దానంతట అదే ‘పప్పెట్ స్టేట్ (తోలుబొమ్మ దేశం)’ అని మారిపోతుంది. అమెరికా చెప్పినట్టల్లా ఆడే పప్పెట్ స్టేట్ దక్షిణ కొరియా అని ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్‌జోంగ్ ఉన్ తరచూ విమర్శిస్తుంటారు. ఇక దక్షిణ కొరియాలో మగ స్నేహితులను పిలిచే ‘ఒప్పా’ అనే పదం టైప్ చేస్తే.. ‘కామ్రేడ్’గా మారిపోతుంది. ‘తోటివారిని పిలిచేందుకు కేవలం ఈ పదం మాత్రమే వాడాలి’ అనే హెచ్చరిక కూడా కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతి ఐదు నిమిషాలకోసారి ఫోన్ దానంతట అదే స్ర్కీన్‌షాట్ తీసుకుని, రహస్య ఫోల్డర్‌లో సేవ్ చేస్తుంది. ఫోన్ వాడేవారు వాటిని చూడలేరు. కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది.
ప్రభుత్వం అనుమతించిన సమాచారమే దిక్కు..
ఉత్తర కొరియాలో ఫోన్లతోపాటు రేడియోలు, టీవీలు కూడా కేవలం ప్రభుత్వం అనుమతించిన కంటెంట్ మాత్రమే అందేలా ప్రొగ్రామింగ్ చేసి ఉంటాయి. ఫోన్లలో పరికరాలను మార్చడానికి వీలు లేకుండా సీల్ చేస్తారు. దీనిని మార్చడానికిగానీ, విదేశాల కంటెంట్‌ను చూడటానికి గానీ ప్రయత్నిస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దక్షిణ కొరియాకు చెందిన కె-పాప్ వీడియోలు, సినిమాలను చూసినందుకు, ఇతరులకు పంపినందుకు ఇటీవల ఓ 22 ఏళ్ల యువకుడిని అధికారులు బహిరంగంగా కాల్చిచంపారు. ఈ నియంత్రణలతో ఉత్తర కొరియా ప్రజలకు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసే అవకాశం ఉండదు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:31 AM