Sharmishta Panoli Arrest: సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీ అరెస్టు
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:25 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్, ఉగ్రవాదులపై అనుచిత పోస్టు పెట్టిన కారణంగా 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్’పై స్పందించని బాలీవుడ్ నటులపై అనుచిత పోస్టు
తీవ్ర విమర్శలతో డిలీట్ చేసి క్షమాపణ
అయినా ఆమెపై కోల్‌కతా పోలీసుల కేసు
గురుగ్రామ్‌లో అదుపులోకి..
గురుగ్రామ్/కోల్‌కతా, జూన్ 1: సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీ(22)ని కోల్‌కతా పోలీసులు అరెస్టుచేశారు. పాకిస్థాన్, దాని ప్రేరిత ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై నోరువిప్పని బాలీవుడ్ నటులపైన, మహమ్మద్ ప్రవక్తపైన ఆమె గత నెల 14న అనుచితంగా పోస్టు పెట్టారు. పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్ రణవీర్ అల్లాబాదియాపై అందులో దూషించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టుతోపాటు తన ఇన్‌స్టా అకౌంట్‌లోని కంటెంట్ మొత్తాన్నీ మర్నాడే ఆమె డిలీట్ చేశారు. అయినా కోల్‌కతా పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం., మత భావనలను రెచ్చగొట్టడం.. ఉద్దేశపూర్వకంగా అవమానించడం.. శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. శుక్రవారం రాత్రి హరియాణాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై ఆమెను శనివారం కోల్‌కతా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు రెండు వారాలు అంటే జూన్ 13 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పుణే న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ‘లా’ విద్యార్థిని అయిన శర్మిష్ఠకు ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్‌లో 1,75,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె అరెస్టుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. అయితే అరెస్టులో తాము చట్టప్రక్రియను పాటించామని కోల్‌కతా పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు. శర్మిష్ఠకు నోటీసులివ్వడానికి పలు ప్రయత్నాలు చేశామని.. సంబంధిత కోర్టు అరెస్టు వారెంటు జారీచేయడంతో గురుగ్రామ్‌లో చట్టబద్ధంగానే ఆమెను అరెస్టుచేశామని.. అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని.. న్యాయాధికారి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారని వివరించారు. శర్మిష్ఠ పనోలీ అరెస్టును పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. ‘శర్మిష్ఠ తన పోస్టును డిలీట్ చేసినా బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి చర్య తీసుకున్నారు. మరి సనాతన ధర్మాన్ని అవహేళన చేసి కోట్ల మంది మనసులను టీఎంసీ ఎంపీలు గాయపరచినప్పుడు వారు ఏం చేశారు? మన ధర్మాన్ని కలుషిత ధర్మమని (మమతా బెనర్జీ) వ్యాఖ్యానించినప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదేం? వాళ్ల క్షమాపణలేవీ? సత్వర అరెస్టులేవీ’ అని నిలదీశారు.
సిందూర్‌పై స్వీయ పొగడ్తలు అక్కర్లేదు
ఆపరేషన్ సిందూర్‌పై స్వీయ పొగడ్తలు అక్కర్లేదని ప్రధాని మోదీని ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు. దీన్ని రాజకీయాలకోసం వాడుకోవడం తగదని, దీనిపై ఎన్నికల ప్రసంగాలు ఆపాలన్నారు. దేశాన్ని పక్కదోవ పట్టించడం మాని తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిందని ఖర్గే గుర్తు చేశారు. ఎప్పుడేం మాట్లాడాలో తమకు తెలుసని, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు అంతా ఒకే తాటిపై నిలిచి ప్రత్యర్థులను ఓడించాలన్నారు. తాజా పరిస్థితులపై కార్గిల్ రివ్యూ కమిటీ తరహాలో రక్షణ సన్నద్ధతపై స్వతంత్ర నిపుణుల కమిటీతో సమీక్ష జరగాల్సిందే అన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:26 AM