ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Fertility Rate 2025: దేశంలో పడిపోతున్న జననాల రేటు

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:02 AM

ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు.. మరోపక్క ఉరుకులు పరుగుల జీవితం.. దీంతో దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతోంది. యాభై ఏళ్ల క్రితం సగటున ఐదారుగురు పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా, ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు.

  • భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు

  • ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం

  • స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా

  • పని చేయదగిన వారు 68 శాతం మంది

  • వృద్ధులు 7 శాతం.. దేశ జనాభా 146 కోట్లు.. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు

  • ఆ తర్వాత క్రమేణా తగ్గుదల.. ఐరాస ప్రపంచ జనాభా నివేదిక-2025లో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 10: ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు.. మరోపక్క ఉరుకులు పరుగుల జీవితం.. దీంతో దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతోంది. యాభై ఏళ్ల క్రితం సగటున ఐదారుగురు పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా, ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో జనాభా పెరుగుదలకు సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మనదేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతదేశ జనాభా ఈ ఏడాది 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల, ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్యసమితి తన జనాభా నివేదికలో వివరించింది. యూఎన్‌ఎఫ్‌పీఏకు చెందిన స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాప్యులేషన్‌ (ఎస్‌ఓడబ్ల్యూపీ) 2025 నివేదికను మంగళవారం విడుదల చేసింది. భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువ ఉందని దానిలో వెల్లడించింది. జనాభా పెరుగుదల, తగ్గదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభమని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయిందని, భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉందని, అంటే జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావాల్సిన జననాల రేటులో దేశం లేదని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించినా.. యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. 0-14 ఏళ్ల వారు 24 శాతం, 10-19 ఏళ్ల వారు 17 శాతం, 10-24 ఏళ్ల వారు 26 శాతం ఉన్నారని వెల్లడించింది. పని చేసే వయసు (15-64)లో ఉన్న వారు 68 శాతం ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులు మొత్తం జనాభాలో 7 శాతంగా ఉన్నారి, ఆయుర్దాయం అంచనా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని అంచనా వేసింది.

యూఎన్‌ నివేదికలో ముఖ్యాంశాలు..

  • 2025లో ఆయుర్దాయం పురుషులకు 71 ఏళ్లు, మహిళలకు 74 ఏళ్లుగా అంచనా వేశారు.

  • ప్రస్తుతం దేశ జనాభా 146.39 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో అది 170కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభమవుతుంది.

  • 1960లో భారత జనాభా 43.6 కోట్లు. అప్పుడు మహిళలు సగటున ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు సగటున ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు.

  • సంతానోత్పత్తికి ఎందుకు వెనకాడుతున్నారో తెలుసుకోవడానికి 14 దేశాల్లో 14 వేల మంది (భారత్‌ నుంచి 1,048) నుంచి ఐరాస అభిప్రాయాలు సేకరించింది. 38% భారతీయులు ఆర్థిక ఇబ్బందుల వల్ల కోరుకున్నంత మంది పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నామని చెప్పారు. అలాగే, ఉద్యోగ భద్రత లేదని 21% మంది, ఇల్లు ఇబ్బంది ఉందని 22% మంది, పిల్లల సంరక్షణకు తగిన సౌకర్యాలు లేవని 18% మంది పేర్కొన్నారు. ఇక అనారోగ్యం కారణంగా 1%, సంతాన సాఫల్యత సమస్యల వల్ల 13%, గర్భిణులకు సంరక్షణ లేమి కారణంగా 14% సంతానోత్పత్తికి దూరంగా ఉన్నారు. భాగస్వామి లేదా కుటుంబం ఒత్తిడి వల్ల అనుకున్నంతమందికి జన్మనివ్వలేకపోతున్నామని 19 మంది చెప్పారు. భవిష్యత్‌పై భయంతో కూడా చాలా మంది పిల్లలకు దూరమవుతున్నారని నివేదిక వెల్లడించింది.

  • బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో జననాల రేటు ఎక్కువగా ఉండగా, ఢిల్లీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భర్తీ రేటు కంటే తక్కువగా ఉంది. దీనికి ఆర్థిక అసమానతలు కారణమని నివేదిక పేర్కొంది.

  • వేగవంతంగా జనాభా మార్పునకు లోనవుతున్న మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్‌ను ఐరాస ఉంచింది. జనాభా రెట్టింపు అయ్యే సమయాన్ని 79 ఏళ్లుగా అంచనా వేసింది.

మహిళల్లో మార్పు వల్లే..

నివేదిక విడుదల సందర్భంగా యూఎన్‌ఎఫ్‌పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నెర్‌ మాట్లాడుతూ.. ‘‘జననాల రేటు తగ్గించడంలో భారత్‌ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. సగటున ఒక్కో మహిళ 1970లో ఐదుగురు పిల్లలకు జన్మనివ్వగా, ఇప్పుడు ఇద్దరికే జన్మనిస్తున్నారు. మహిళల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ పెరగడం దీనికి కారణం. మాతృమరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటికి రాష్ట్రాల మధ్య, కులాల్లో, ఆదాయ వర్గాల్లో అసమానతలు అలాగే ఉన్నాయి. ప్రతిఒక్కరికి స్వేచ్ఛ, పునరుత్పత్తిలో సొంత నిర్ణయం ఉన్నప్పుడు జనాభాతో వచ్చే లాభాలు నిజంగా అందుతాయి. పునరుత్పత్తి హక్కులు, ఆర్థిక శ్రేయస్సు కలసి ముందుకెళ్లడాన్ని ప్రదర్శించే సదవకాశం భారత్‌ ముందు ఉంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 06:03 AM