Indian Army Response: సరిహద్దు.. ఉద్రిక్తం
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:58 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదుల నిర్మూలన కోసం ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటూ, పలువురు ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేస్తోంది.
కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాక్
హెచ్చరికలు లేకుండానే కాల్పులు
దీటుగా బదులిస్తున్న భారత సైన్యం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలతో భారత్- పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతుండటం, ప్రతిగా కాల్పులతో భారత దళాలు దీటుగా సమాధానం ఇస్తుండటంతో.. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. సరిహద్దులకు సమీపంలోని గ్రామాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా బంకర్లలోకి వెళ్లి తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా బలగాలు వివిధ ప్రాంతాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత కొనసాగుతోంది.
విచ్చలవిడిగా పాక్ సైన్యం కాల్పులు..
పాక్ సైన్యం నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) పొడవునా ఉన్న ఔట్‌పోస్టుల నుంచి ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే.. కాల్పులు జరుపుతోందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పహల్‌గామ్ ఘటన తర్వాత ఈ నెల 24న రాత్రి తొలిసారిగా పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించిందని.. తర్వాత అడపాదడపా కాల్పులు జరుపుతూనే ఉందని, శుక్రవారం రాత్రంతా కూడా ఇది కొనసాగిందని తెలిపాయి. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించిన సమయంలో.. తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో 18 వేలకుపైగా వ్యక్తిగత, సామూహిక బంకర్లను నిర్మించింది. కొన్నేళ్లుగా సరిహద్దుల వెంట కాల్పుల ఘటనలు లేకపోవడంతో వాటిని వినియోగించలేదు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు, పాక్ దళాల కాల్పుల నేపథ్యంలో... ఆ బంకర్లను శుభ్రం చేసి, తలదాచుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ‘‘ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే అండర్‌గ్రౌండ్ బంకర్లను సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం. మా గ్రామంలో గోధుమ పండిస్తున్నాం. దిగుబడి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అయినా ముందే పంట కోతలు చేపడుతున్నారు. మగవాళ్లంతా ఆ పనుల్లో ఉంటే.. ఆడవాళ్లంతా బంకర్లను శుభ్రం చేసే పనుల్లో ఉన్నారు’’ అని ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లోని ట్రెవా గ్రామ మాజీ సర్పంచ్ బల్బీర్ కౌర్ చెప్పారు.
మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత
ఉగ్రవాద నిర్మూలన దిశగా కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతను కొనసాగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఆసిఫ్ షేక్, ఆదిల్ తోకర్‌ల ఇళ్లను శుక్రవారం పేల్చేసిన భద్రతా బలగాలు.. శనివారం మరో ముగ్గురు ఉగ్రవాదులు అహ్సాన్ షేక్, షాహిద్ కుట్టీ, జాహిద్ అహ్మద్‌ల ఇళ్లను కూల్చేశాయి. ఇందులో పుల్వామాకు చెందిన లష్కరే తాయిబా ఉగ్రవాది అహ్సాన్‌కుపహల్గాం దాడితో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఇక, షోపియాన్ ప్రాంతానికి చెందిన షాహిద్, కుల్గాంకు చెందిన జాహిద్ ఇద్దరూ గత మూడు, నాలుగేళ్లుగా దేశద్రోహ చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు తేల్చారు. దీనిపై జమ్మూకశ్మీర్ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘‘స్థానికులు పాక్ ఉగ్రవాదులకు సాయం చేయడం, ఉగ్రవాదులుగా మారడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టక తప్పడం లేదు. ఉగ్రవాదులుగా మారిన వారి కుటుంబాలు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలేవీ అందవని స్థానిక యువతకు స్పష్టం చేస్తున్నాం. ఇళ్ల కూల్చివేత కూడా ఆ దిశగా ఇస్తున్న సంకేతాలే..’’ అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా అడుగడుగూ జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా తొకర్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదుల అనుచరులు ఇద్దరిని భద్రతా దళాలు గుర్తించి, అదుపులోకి తీసుకున్నాయి. అయితే వారి వివరాలను బయటికి వెల్లడించలేదు. మరోవైపు కుప్వారా జిల్లాలోని సెడోరి నల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధాల డంప్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించారు.
పహల్గాం కేసు ఎన్‌ఐఏ చేతికి..
పహల్గాం ఉగ్రదాడి కేసు అధికారికంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్లింది. ఘటన జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటన వివరాలు, పూర్వాపరాలను సేకరించి కేసు డైరీని సిద్ధం చేశారు. తాజా వీటన్నింటినీ అధికారికంగా ఎన్‌ఐఏకు అప్పగించారు. నిజానికి దేశంలో ఉగ్రవాద కేసుల దర్యాప్తు ఎన్‌ఐఏ ఆధ్వర్యంలోనే సాగుతుంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కూడా ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. శనివారం ఒడిశాలోని ఇషాని గ్రామానికి చేరుకుని.. ఉగ్రదాడిలో మృతి చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులను కూడా కలసి వాంగ్మూలాలు నమోదు చేశారు.
గొంతు కోస్తాం.. పాక్ ఆర్మీ అధికారి హెచ్చరిక సంజ్ఞ!
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట నిరసన తెలుపుతున్న భారతీయులకు పాక్ ఆర్మీ అధికారి చేసిన హెచ్చరిక సంజ్ఞ కలకలం రేపుతోంది. భారత సంతతివారితోపాటు ఇజ్రాయెలీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పాక్ హైకమిషన్‌లో సైనిక, వైమానిక దళాల సలహాదారుగా ఉన్న కల్నల్ తైమూర్ రాహత్ బాల్కనీలోకి వచ్చారు. 2019 భారత యుద్ధవిమానం కూలిపోయి.. ఎల్‌వోసీ అవతల పాకిస్థాన్‌కు చిక్కిన ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ చిత్రాన్ని పట్టుకుని రెచ్చగొట్టేలా వ్యవహరించారు. నిరసనకారులకు వేలు చూపిస్తూ.. గొంతు కోస్తామన్నట్టుగా సంజ్ఞ చేశారు. అంతేకాదు నిరసనకారుల నినాదాలు వినిపించకుండా లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్ద ధ్వనితో పాకిస్థాన్ దేశభక్తి గీతాలను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
Updated Date - Apr 27 , 2025 | 06:46 AM