Underground oil: భూగర్భంలో చమురు గుహలు
ABN, Publish Date - Jun 25 , 2025 | 06:07 AM
ఇజ్రాయెల్‌తో యుద్ధం, అమెరికా దాడులతో హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా అయ్యే ఈ జలసంధిని మూసేస్తే... చమురు కొరత తలెత్తి, ధరలు భారీగా పెరుగుతాయనే ఆందోళన నెలకొంది.
భారీగా నిల్వకోసం భారత్ వ్యూహం
ఇప్పటికే విశాఖ, మంగళూర్, పాడూర్‌లలో
మరో రెండింటి నిర్మాణానికి సన్నాహాలు
న్యూఢిల్లీ, జూన్ 24: ఇజ్రాయెల్‌తో యుద్ధం, అమెరికా దాడులతో హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా అయ్యే ఈ జలసంధిని మూసేస్తే... చమురు కొరత తలెత్తి, ధరలు భారీగా పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 80శాతానికిపైగా చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌కు ఇబ్బంది తప్పదని నిపుణులు విశ్లేషించారు. అయితే ఇలాంటి పరిస్థితి తలెత్తితే కొంతకాలం తట్టుకునేందుకు వీలుగా భారత్ భారీగా చమురు నిల్వలను ఏర్పాటు చేసుకుంది. అది భూమి అడుగున భారీ గుహలను తొలిచి, అందులో చమురును నిల్వ చేస్తోంది. 1990వ దశకంలో గల్ఫ్ యుద్ధం నాటి పరిణామాల నేపథ్యంలో 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం ‘వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (ఎస్‌పీఆర్)’ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఏపీలోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాడూర్‌లలో భారీ భూగర్భ చమురు నిల్వ కేంద్రాలను నిర్మించింది. వీటిలో ప్రస్తుతం 5.3 మిలియన్ మెట్రిక్ (53 లక్షల) టన్నుల చమురును నిల్వ చేస్తున్నారు. కర్ణాటకలోని పాడూర్‌లో రెండో కేంద్రాన్ని (25 లక్షల టన్నుల సామర్థ్యం), ఒడిశాలోని చండీఖోల్‌లో మరో నిల్వ కేంద్రాన్ని (40 లక్షల టన్నుల సామర్థ్యం) ఏర్పాటు చేస్తున్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర పరిణామాలతో ఒక్కసారిగా చమురు కొరత ఏర్పడితే ఈ వ్యూహాత్మక నిల్వలతో కొంతకాలం ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
10 అంతస్తుల ఎత్తున.. కిలోమీటర్ వెడల్పుతో..
భూమిపై నిర్మాణాలతో నిల్వ చేయడం కన్నా.. భూగర్భంలో నిల్వ కోసం అయ్యే ఖర్చు తక్కువ. భద్రత ఎక్కువ. పెట్రోలియం ఉత్పత్తులు సులువుగా లీకై, ఆవిరవుతుంటాయి. భూగర్భ కేంద్రాలతో ఈ సమస్య తక్కువ. ఈ క్రమంలో మన దేశంలో భూమిలో 90 మీటర్ల దిగువన ఈ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను నిర్మించారు. ఒక్కోటీ సుమారు కిలోమీటర్ వెడల్పు, పది అంతస్తుల ఎత్తుతో ఉంటాయి. ఇందులో విశాఖపట్నంలో ‘ద్రవీకృత పెట్రోలియం వాయువు (ఎల్‌పీజీ)’ నిల్వ కేంద్రం ఉంది. ఇది సముద్ర మట్టంతో పోలిస్తే ఏకంగా 196 మీటర్ల లోతు వరకు ఉండి.. ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భ ఇంధన నిల్వ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. ప్రస్తుతమున్న మూడు భూగర్భ నిల్వ కేంద్రాల్లో కలిపి 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురును నిల్వ చేస్తున్నారు. భారతదేశ రోజువారీ చమురు వినియోగం 5 మిలియన్ బ్యారెళ్లు. ప్రస్తుత నిల్వలు విదేశాల నుంచి ఒక్క బ్యారెల్ చమురు రాకపోయినా కూడా 15 రోజుల వరకు సరిపోతాయి. దేశీయ ఉత్పత్తి, దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీల వద్ద ఉండే నిల్వలను లెక్కలోకి తీసుకుంటే సుమారు రెండున్నర నెలల పాటు సరిపోతాయని అంచనా.
Updated Date - Jun 25 , 2025 | 11:10 AM