ICMR: అరుదైన గ్రూపు రక్తదాతల జాబితాతో పోర్టల్
ABN, Publish Date - Jun 22 , 2025 | 06:04 AM
భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పని చేసే ముంబైలోని ఎన్‌ఐఐహెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ) దేశవ్యాప్తంగా అరుదైన గ్రూపు రక్తం కలిగిన రక్తదాతల వివరాల జాబితాను సిద్ధం చేసింది.
దేశంలోనే తొలిసారిగా ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు
న్యూఢిల్లీ, జూన్ 21 : భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పని చేసే ముంబైలోని ఎన్‌ఐఐహెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ) దేశవ్యాప్తంగా అరుదైన గ్రూపు రక్తం కలిగిన రక్తదాతల వివరాల జాబితాను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో ఇలాంటి జాబితా తయారుచేయడం ఇదే తొలిసారి కాగా.. ఆ వివరాలతో ‘‘రేర్ బ్లడ్ డోనర్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా’’ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఎంఆర్-ఎన్‌ఐఐహెచ్ అందుబాటులోకి తెచ్చిన ఈ రిజిస్ట్రీలో నెగెటివ్ గ్రూపుల రక్తం కలిగిన 600 మంది దాతలు, అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన 250 మంది రక్తదాతల వివరాలు ఉన్నాయి.
అలాగే, 170 మంది బాంబే బ్లడ్ గ్రూపు దాతల సమాచారం కూడా ఉంది. దీంతో అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగి, తలసీమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తమార్పిడి అంశంలో ఈ పోర్టల్ వరప్రదాయిని కానుంది. రక్తనిధి కేంద్రాలు, దాతలు, రక్త నిల్వలు తదితర వివరాలను తెలియజేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-రక్తకోష్ ప్లాట్‌ఫామ్‌తో ఈ రేర్ బ్లడ్‌డోనర్ రిజిస్ట్రీని అనుసంధానం చేయాలని ఐసీఎంఆర్-ఎన్‌ఐఐహెచ్ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాయి.
Updated Date - Jun 22 , 2025 | 06:04 AM