Manali: ఆకాశ మార్గంలో తెగిన కేబుల్
ABN, Publish Date - Jun 16 , 2025 | 05:22 AM
ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలీలో విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబానికి దుర్ఘటన ఎదురయింది. కొండలను కలుపుతూ ఏర్పాటు చేసిన తీగ మార్గంపై..
మనాలీలో జిప్‌లైన్ నుంచి కిందపడ్డ బాలికకు తీవ్ర గాయాలు
మనాలీ, జూన్ 15: ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలీలో విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబానికి దుర్ఘటన ఎదురయింది. కొండలను కలుపుతూ ఏర్పాటు చేసిన తీగ మార్గంపై ఆదివారం జిప్‌లైన్ ద్వారా విహరిస్తున్నప్పుడు ఆ కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక ప్రమాదానికి గురయింది. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ బిజ్వే కుటుంబం విహార యాత్ర నిమిత్తం ఇక్కడికి వచ్చింది. ఆయన కుమార్తె త్రిష బిజ్వే... కేబుల్‌పై నడిచే జిప్‌లైన్‌పై ఆకాశ మార్గంలో విహరించడానికి ఉత్సాహం చూపించింది.
ఆమె విహరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ తీగ తెగిపోవడంతో కిందనున్న బండలపై పడిపోయింది. పలుచోట్ల తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం కోలుకుంటోంది. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యవర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట అంతా సవ్యంగానే సాగింది. అకస్మాత్తుగా కేబుల్ తెగిపోవడంతో ఆమె కిందనున్న రాళ్లపై పడిపోయింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పరిహారంపై జిప్‌లైన్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు అవగాహనకు వచ్చారని మనాలీ డీఎస్పీ తెలిపారు.
Updated Date - Jun 16 , 2025 | 05:22 AM