Brian Kelly: కంపెనీలో వాటాను 14వేల కోట్లకు అమ్మి రూ.13వేల కోట్లు దానమిచ్చేశాడు
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:49 AM
ఎవరైనా తాము సంపాదించిన దాంట్లో పదో.. పరకో.. దానం చేస్తారు. కానీ, ఓ కంపెనీ మాజీ సీఈవో కంపెనీలో తనకున్న వాటాను రూ.14వేల కోట్లకు(1.6బిలియన్ డాలర్లు) అమ్మేసి అందులో రూ.13వేల కోట్లను దానం చేసేశారు.
యాప్‌నెక్సస్ సంస్థ మాజీ సీఈవో బ్రియాన్ దాతృత్వం
నూఢిల్లీ, ఆగస్టు 16: ఎవరైనా తాము సంపాదించిన దాంట్లో పదో.. పరకో.. దానం చేస్తారు. కానీ, ఓ కంపెనీ మాజీ సీఈవో కంపెనీలో తనకున్న వాటాను రూ.14వేల కోట్లకు(1.6బిలియన్ డాలర్లు) అమ్మేసి అందులో రూ.13వేల కోట్లను దానం చేసేశారు. అడ్వర్టైజింగ్ టెక్నాలజీ కంపెనీ యాప్‌నెక్సస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బ్రియాన్ కెల్లీ ఈ ఘనత వహించారు. తాజాగా ఫార్చూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. యాప్‌నెక్సస్ కంపెనీలో బ్రియాన్‌కు 10% వాటా ఉండేది. 2018లో ఆయన దాన్ని ‘ఏటీ అండ్ టీ’ సంస్థకు విక్రయించారు. దీంతో ఆయనకు రూ.14వేల కోట్లు(1.6బిలియన్ డాలర్లు) వచ్చాయి.
ఇందులో దాదాపు 900కోట్లను(100మిలియన్ డాలర్లు) తమ కుటుంబం కోసం ఉంచుకొని మిగతా 13వేల కోట్లను విరాళంగా ఇచ్చేశారు. ‘‘బిలియనీర్‌గా ఉండటంపై, బిలియనీర్ లైఫ్‌స్టైల్ పైన నాకు ఆసక్తి లేదు. అందుకే నాకు, నా కుటుంబానికి ఎంత డబ్బు అవసరమో అంతే ఉంచుకోవాలని అనుకున్నా. ఈ విషయం నా భార్యతో చర్చించా. భవిష్యత్తు అవసరాల కోసం 100 మిలియన్ డాలర్లు చాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం’’ అని ఆయన తెలిపారు. యాప్‌నెక్సస్ కంపెనీలో తన వాటాను విక్రయించాక బ్రియాన్ స్కోప్3 స్టార్ట్‌పను ప్రారంభించారు.
Updated Date - Aug 17 , 2025 | 05:49 AM