Flying Buses: ప్రజా రవాణాకు ఎగిరే బస్సులు
ABN, Publish Date - Jun 17 , 2025 | 05:54 AM
దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి, భవిష్యత్‌లో ప్రజా రవాణాలో కొత్తతరం బస్సులు ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎగిరే బస్సులుగా పిలిచే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే యోచనలో ఉంది.
ఒకేసారి 135 మంది ప్రయాణం
బెంగళూరు, ఢిల్లీల్లో పైలట్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి, భవిష్యత్‌లో ప్రజా రవాణాలో కొత్తతరం బస్సులు ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎగిరే బస్సులుగా పిలిచే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే యోచనలో ఉంది. మెట్రో రైళ్లలాగా ఎలివేటెట్ కారిడార్లలో నడిచే ఈ బస్సులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రజా రవాణాకు సంబంధించి సౌకర్యం, వేగం, పర్యావరణ అనుకూల అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. అంతర్జాతీయ సంస్థల నుంచి ఇప్పటికే పలు ప్రతిపాదనలు వచ్చాయని, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో పైల ట్ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘మొత్తం 360 ప్రతిపాదనలు వచ్చాయి. కాలుష్యం లేని ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాం. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏరియల్ పాడ్ ట్యాక్సీలు లేదా ఫ్లయింగ్ బస్‌ల ప్రతిపాదన చేశాం. ఇవి విమానాలు కాదు. కానీ, డ్రైవర్ లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే ఎలక్ట్రిక్ పాడ్‌లు. వీటిని డబుల్ డెక్కర్ బస్సుల్లాంటి పాడ్స్ అనవచ్చు. ఒక్కో బస్సులో 135 మంది ప్రయాణించవచ్చు. ఇప్పటికే 13 సాంకేతిక ప్రతిపాదనలు వచ్చాయి. ఇది ప్రజారవాణాకు సంబంధించినది కాబట్టి తక్కువ రేట్లకే ప్రజలకు సౌకర్యం కల్పించాలి. ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా లాభదాయకమా, కాదా? అనేది పరిశీలిస్తున్నాం. బస్సు స్టేషన్‌లో ఆగినప్పుడు అర నిమిషంలో ఫ్లాష్ చార్జింగ్ సిస్టంతో చార్జి అవుతుంది. 40 కి.మీ. సునాయాసంగా ప్రయాణిస్తుంది. విమానంలోలాగా టీ, కాఫీ ఇతర సదుపాయాలు కూడా బస్‌లో అందించే అవకాశం ఉంది’’ అని గడ్కరీ తెలిపారు.
Updated Date - Jun 17 , 2025 | 05:55 AM