డ్రోన్ల యుగంలో ఎఫ్-35లు అవసరమా?
ABN, Publish Date - Feb 16 , 2025 | 05:13 AM
ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ విమానాల ప్రత్యేకతపై చర్చ మొదలైంది.
వాషింగ్టన్, ఫిబ్రవరి 15: ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్‌కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రతిపాదించిన నేపథ్యంలో ఆ విమానాల ప్రత్యేకతపై చర్చ మొదలైంది. దాంతోపాటు శరవేగంగా మారుతున్న యుద్ధ రీతుల్లో అంత ఖరీదు పెట్టి ఆ విమానాలను కొనాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారతదేశానికి చెందిన స్వతంత్ర రక్షణ నిపుణులు ఎఫ్-35కి అనుకూలంగా, ప్రతికూలంగా తమ వాదనలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్-35కి వ్యతిరేకంగా ఐటీ దిగ్గజం ఎలాన్ మస్క్ గత ఏడాది నవంబర్లో పెట్టిన పోస్టులు ఇప్పుడు చర్చకు వచ్చాయి. చరిత్ర గతిలో అమెరికా పెట్టిన సొమ్ముకు మిలిటరీపరంగా అతితక్కువ ఫలితం ఇచ్చిన విమానాలు ఎఫ్-35 అని మస్క్ పేర్కొన్నారు. అదే రోజు మరో సందర్భంలో చిన్న మిలిటరీ డ్రోన్ల వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘ఈ కాలంలో కూడా కొంతమంది మూర్ఖులు ఎఫ్-35ల తరహాలో మనుషులు ఉన్న యుద్ధ విమానాలను తయారు చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఎఫ్-35లో ఏమేం ఉండాలనేది నిర్ణయించే సమయంలోనే దాని లక్ష్యం దెబ్బతింది. ఒక్క దాంతోనే చాలా పనులు చేయించాలి అనుకున్నారు. దాంతో అది అత్యంత ఖరీదైనదిగా, సంక్లిష్టమైనదిగా తయారైంది. అన్నిట్లో ప్రవేశం ఉంది. ఎందులోనూ నిష్ణాతురాలు కాదు అన్నట్లు తయారైంది. దాడిలో విజయం సాధించడం ఆ విమానానికి నిర్దేశించిన లక్ష్యాల్లో ఉన్నట్లు అనిపించడం లేదు. డ్రోన్ల యుగంలో పైలట్ ఫైటర్ జెట్‌లు పైలట్ల ప్రాణాలను ఫణంగా పెట్టడం తప్ప ఇంకెందుకూ పనికిరావు’’ అని మరో పోస్టులో అన్నారు. క్షిపణులు, డ్రాప్ బాంబ్‌ల రేంజ్‌లు పెంచుకోవాలంటే పైలట్లున్న ఫైటర్ జెట్‌లు సెట్ కావని చెప్పారు. తిరిగి వాడగల డ్రోన్లు ఆ పని తేలిగ్గా చేయగలవన్నారు. శత్రుపక్షానికి అధునాతన డ్రోన్లు, భూమి మీద నుంచి ప్రయోగించే అధునాతన క్షిపణులు ఉంటే పైలట్ సహిత ఫైటర్ జెట్‌లను ఇట్టే కూల్చేయగలవని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధమే ఇందుకు ఉదాహరణ అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించే ఫైటర్ జెట్‌లు పైలట్లకు అందమైన ప్రియురాళ్లను తెచ్చిపెట్టగలదని వ్యంగ్యంగా అన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 05:13 AM