Mahatma Gandhi Grand Daughter: మహాత్మా గాంధీ మునిమనుమరాలికి జైలు
ABN, Publish Date - Jun 15 , 2025 | 05:58 AM
మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్‌గోబిన్(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత..
రూ. 3.2 కోట్ల మోసం కేసులో ఏడేళ్లు శిక్ష ఖరారు చేసిన డర్బన్ కోర్టు
డర్బన్(సౌత్ ఆఫ్రికా), జూన్ 14: మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్‌గోబిన్(56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె లత... వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్‌ను 3.22 కోట్లకు మోసం చేశారు. నేరం రుజువుకావడంతో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ కోర్టు శిక్ష ఖరారు చేస్తూ, అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది. తనకు తాను ఆహింసావాదిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునే లత రామ్‌గోబిన్‌ను, వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్ 2015లో కలిశారు.
ఆయన వస్త్ర, పాదరక్షల వ్యాపారి. ఇతర వ్యాపారవేత్తలకు అవసరమైన నిధులు సమకూరుస్తూ లాభంలో వాటా తీసుకుంటారు. ‘దక్షిణాఫ్రికాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి గ్రూప్‌నకు అవసరమైన ‘లైనిన్’ ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నా. కస్టమ్స్, దిగుమతి సుంకం చెల్లించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత పెట్టుబడి లేదు. మీరు సమకూరిస్తే లాభంలో వాటా ఇస్తాను’ అంటూ లత.. మహరాజ్‌తో నమ్మబలికారు. మహరాజ్ పెట్టుబడి సమకూర్చారు. కొద్ది కాలానికే ఆమె మోసం చేసిందని తెలుసుకున్న ఆయన పోలీస్ కేసు పెట్టారు. అసలు ఆమె భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోలేదని నిర్ధారణ అయింది.
Updated Date - Jun 15 , 2025 | 10:29 AM