CJI Gavai: సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి సరిసమానం
ABN, Publish Date - Aug 18 , 2025 | 04:11 AM
న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టుల రాజ్యాంగపర స్థాయి సమానంగా ఉంటుందని సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఒకదాని కింద మరొకటి పనిచేయడం అంటూ ఉండదని తెలిపారు.
హైకోర్టుల కొలీజియంలకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వలేం
సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 17: న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టుల రాజ్యాంగపర స్థాయి సమానంగా ఉంటుందని సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఒకదాని కింద మరొకటి పనిచేయడం అంటూ ఉండదని తెలిపారు. ఒకటి సుపీరియర్, మరొకటి దిగువస్థాయిది అన్న మాటే ఉండదని చెప్పారు. పరస్పర గౌరవం ఆధారంగా ఆ రెండు వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సుప్రీంకోర్టు, హైకోర్టుల కొలీజియంల పరిధిపైనా స్పష్టత ఇచ్చారు.
న్యాయమూర్తి పదవికి ఫలానా వారి పేరు సిఫార్సు చేయాలని హైకోర్టు కొలీజియంకు సుప్రీంకోర్టు కొలీజియం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. న్యాయమూర్తి పదవులకు ఎవరి పేర్లను సిఫార్సు చేయాలన్నదాన్ని హైకోర్టు కొలీజియంలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మహా అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఎవరి పేర్లనయినా సూచించవచ్చని, అంతే తప్ప వాటిని జాబితాలో చేర్చాలని ఆజ్ఞలు ఇవ్వలేవని చెప్పారు.
Updated Date - Aug 18 , 2025 | 04:11 AM