NEET Exam: పోలీసు భద్రతతో నీట్ ప్రశ్నపత్రాల రవాణా
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:58 AM
గత అనుభవాల దృష్ట్యా ఈసారి నీట్ పరీక్షను ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల భద్రత, మోసాలను నివారించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : నీట్ పరీక్షలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు కేంద్ర విద్యా శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. మే 4వ తేదీన ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 550 నగరాల్లోని 5000కు పైగా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గత ఏడాది ఈ పరీక్ష నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చిన దృష్ట్యా ఈసారి ఎటువంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నీట్ ప్రశ్నపత్రాల రవాణా, భద్రతకు అలాగే సమస్యల నివారణకు ఇప్పటికే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరీక్ష కేంద్రాల వద్ద జాతీయ పరీక్ష ఏజెన్సీ(ఎన్టీయే) నియమించే సిబ్బందితోపాటు ఆయా జిల్లాల పోలీసులు తనిఖీలు చేపడతారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్ల వంటి ముఖ్యమైన వాటిని పూర్తిగా పోలీసు భద్రతతోనే రవాణా చేస్తారు. మోసాలకు పాల్పడకుండా కోచింగ్ సెంటర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా ఉంచుతారు. అన్ని పరీక్ష కేంద్రాలను డ్యూటీ మేజిస్ట్రేట్‌లు తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఆ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలి.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News
Updated Date - Apr 29 , 2025 | 04:58 AM