BrahMos missile: అది బ్రహ్మాస్త్రమే..
ABN, Publish Date - May 12 , 2025 | 05:35 AM
పాకిస్థాన్ ఎయిర్‌బేసులపై బ్రహ్మోస్ క్షిపణి దాడులు ప్రభావితం చేసి ఆ దేశం కాల్పుల విరమణ కోరే స్థితికి వచ్చిందని సమాచారం. ఇది మాక్-3 వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్ క్షిపణిగా, 800కి.మీ. దూరం దాటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది.
పాక్‌ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి
రాడార్లకు చిక్కకుండా.. కచ్చితత్వంతో టార్గెట్ విధ్వంసం
‘ఆపరేషన్ సిందూర్’తోనే.. తొలిసారిగా యుద్ధంలో వినియోగం
మరింత సమర్థవంతమైనబ్రహ్మో్‌స-2ను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీవో
న్యూఢిల్లీ, మే 11: పాక్ ఎయిర్‌బే్‌సలపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి.. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు ఎన్నో..
ఇది సూపర్ సోనిక్ క్షిపణి. మాక్-3(గంటకు 3,700 కిలోమీటర్లకుపైగా) వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి.
తొలుత నౌకాదళం కోసం రూపొందించారు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి (సర్ఫేస్ టు సర్ఫేస్), యుద్ధ విమానాల నుంచి (ఎయిర్ టు సర్ఫేస్) ప్రయోగించగల వెర్షన్లను అభివృద్ధి చేశారు.
మొదట్లో 290కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు. తర్వాత 500కి.మీ.కు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌పై ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేశారు.
మరింత వేగం, సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్-2 హైపర్‌సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. గంటకు 9,700కి.మీ. వేగం తో..1,500కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని రూపొందిస్తున్నారు.
తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా..రాడార్లకు చిక్కకుండా (స్టెల్త్)దూసుకెళ్లే బ్రహ్మో్‌స- నెక్ట్స్ జనరేషన్‌నూ అభివృద్ధి చేస్తున్నారు.
సుఖోయ్-30ఎంకేఐ నుంచి ప్రయోగించేలా మార్పులు చేసి బ్రహ్మోస్‌ఎయిర్-లాంచ్‌డ్ వెర్షన్ అభివృద్ధి చేశారు.
బ్రహ్మోస్ క్షిపణికి అయ్యే ఖర్చు రూ.34కోట్లు. అందువల్ల కచ్చితంగా ధ్వంసం చేయాల్సిన ‘హైవ్యాల్యూ’ లక్ష్యాలను ఛేదించడానికి బ్రహ్మో్‌సను రంగంలోకి దింపుతారు.
ఆ రెండూ.. మొదటి సారిగా పాక్‌పైనే..
బ్రహ్మోస్ మన అమ్ములపొదిలో చేరిన తర్వాత పాక్‌పై 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్‌లో దాడులు చేసింది. కానీ బ్రహ్మో్‌సను వినియోగించలేదు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్నసుఖోయ్-30ఎంకేఐ విమానాలను 2004లోనే తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై భారత్ పలుమార్లు దాడులు చేసినా సుఖోయ్‌లను వినియోగించలేదు. ఆపరేషన్ సిందూర్‌లోనే మొదటిసారిగా వినియోగించడం గమనార్హం.
ఒకే దెబ్బతో నౌకను ముంచేసే సామర్థ్యం
నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారు 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా..దాని గతిశక్తి (కైనెటిక్ ఎనర్జీ) చాలా ఎక్కువ. ఎంతలా అంటే.. సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తంగా దెబ్బతిని, సముద్రంలో మునిగిపోతుంది. ఇక బ్రహ్మో్‌సలో 200కిలోలకుపైగా బరువుండే వార్‌హెడ్ ఉంటుంది. క్షిపణి గతిశక్తికి తోడు వార్‌హెడ్ పేలుడు కలసి.. తీవ్ర విధ్వంసం సృష్టించగలవు. భారత్ దాడిలో పాక్ ఎయిర్‌బే్‌సలు తీవ్రంగా దెబ్బతినడానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
బ్రహ్మో్‌స-ఎల్‌ఆర్ సక్సెస్
800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించేలా..
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల్లో... మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మో్‌స-ఎల్‌ఆర్ (లాంగ్ రేంజ్) వేరియంట్‌ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం తీరంలో పరీక్షించిన ఈ క్షిపణి 800కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణవర్గాలు వెల్లడించాయి. పాక్‌లోని అన్ని ప్రాంతా లు, చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తాన్ని ఇది చేరుకోగలుగుతుందని తెలిపాయి. ఇందుకోసం క్షిపణి పొడవు పెంచి, పెద్ద ఇంధన ట్యాంకు అమర్చారని వెల్లడించాయి.
Updated Date - May 12 , 2025 | 05:35 AM