Trump Urges EU to Impose: భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి
ABN, Publish Date - Sep 11 , 2025 | 03:31 AM
భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలపై భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ...
ఈయూను కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
భారత్‌తో అసంబద్ధమైన వాణిజ్యం కోరుకోం
మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవారో
వాషింగ్టన్, సెప్టెంబరు 10: భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలపై భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణం చూపుతూ భారత్, చైనాలపై వంద శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్‌ను కోరారు. ఈయూ కూడా కలిసి వస్తే తాము కూడా భారత్, చైనాలపై 100ు సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అమెరికా, ఈయూ అధికారులతో వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు చర్చించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామనే వరకు రెండు దేశాలపై సుంకాలు కొనసాగించాలని, ఈ విషయంలో కలిసి రావాలని అమెరికా సూచించగా ఈయూ అధికారులు సానుకూలంగా స్పందించారంటూ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు పుతిన్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంగా దీన్ని చూడాలని అమెరికా వింతవాదన చేస్తోంది.
మళ్లీ నోరుపారేసుకున్న నవారో
భారత్‌తో అసంబద్ధమైన వాణిజ్యాన్ని అమెరికా కోరుకోవడం లేదని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉద్యోగాలతో పాటు అమెరికా మార్కెట్లవైపు భారత్ ఆత్రంగా చూస్తోందన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేయడానికి భారత్ చమురు కొనుగోలు చేయడమే కారణమంటూ నవారో కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ యుద్ధం మోదీ యుద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నవారో వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే గట్టిగా తిప్పికొట్టింది. అయినా ఆయన తన ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు.
Updated Date - Sep 11 , 2025 | 03:31 AM