Trade Policy: తనను నోబెల్‌కు సిఫారసు చేయలేదనే..
ABN, Publish Date - Aug 31 , 2025 | 07:05 AM
భారత్‌పై అమెరికా అడ్డగోలు సుంకాల వెనుక ‘రష్యా చమురు కొనుగోళ్ల’ను మించిన కారణం ఉందా? ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారీగా సుంకాలు విధించారా?
భారత్‌పై ట్రంప్ సుంకాలకు కారణమిదే
న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
న్యూయార్క్, ఆగస్టు 30: భారత్‌పై అమెరికా అడ్డగోలు సుంకాల వెనుక ‘రష్యా చమురు కొనుగోళ్ల’ను మించిన కారణం ఉందా? ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారీగా సుంకాలు విధించారా? ట్రంప్, మోదీ మధ్య బంధం చెడిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ న్యూయార్క్ టైమ్స్ అవుననే అంటోంది. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తనను నామినేట్ చేయాలని భారత్‌ను కోరారని, దానికి మోదీ నిరాకరించడంతో అక్కసు పెంచుకున్నారని పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘‘భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ 40 సార్లు చెప్పుకొన్నారు. యుద్ధం ఆపే విషయంలో అమెరికా సహా మరే దేశ జోక్యం లేదని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ ఆగ్రహించారు. జూన్ 17న మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్.. తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని కోరారు. అలా చేస్తే.. యుద్ధాన్ని ట్రంప్ ఆపారని ఒప్పుకొన్నట్టు అవుతుందని, కుదరదని మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ కోరారుకదా అని నామినేట్ చేస్తే.. భారత్‌లో తన ప్రతిష్టకు మచ్చ వస్తుందని మోదీ భావించారు. భారత్ అలా నామినేట్ చేయకపోవడంతో ట్రంప్ కక్షగట్టారు. భారత్‌పై అధిక సుంకాల వెనుక ‘రష్యా చమురు కొనుగోళ్ల’ను మించిన కారణం ఇదే. ఇతర దేశాలు రష్యా నుంచి చమురుకొంటున్నా పట్టించుకోకుండా.. భారత్‌ను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారు. ఒకప్పుడు మిత్రులుగా పేరుపొందిన మోదీ, ట్రంప్ మధ్య దూరం పెరిగింది. జూన్ 17 తర్వాత వారు మళ్లీ మాట్లాడుకున్నది కూడా లేదు..’’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
Updated Date - Aug 31 , 2025 | 07:08 AM