Ceasefire Violation: శాంతికి తూట్లు
ABN, Publish Date - Oct 20 , 2025 | 04:12 AM
గాజాలో శాంతి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది! హమాస్, ఇజ్రాయెల్ నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన బలవంతపు...
గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి పురిట్లోనే సంధి!
రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి
గగనతల దాడులతో విరుచుకుపడ్డ ఐడీఎఫ్
గాజాకు మానవతా సాయం అందకుండా ఆపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన
33 మంది మరణించారు: గాజా అధికారులు
వెస్ట్‌బ్యాంక్, అక్టోబరు 19: గాజాలో శాంతి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది! హమాస్, ఇజ్రాయెల్ నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన బలవంతపు ‘సంధి’కి పురిట్లోనే సంధి కొట్టింది!! హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) గగనతలదాడులకు పాల్పడడంతో గాజా మళ్లీ నెత్తురోడింది. రఫాలో తమసైనికులపై హమాస్ దాడులు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని.. అందుకే తాము గగనతల దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతుండగా, ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆ దేశ రక్షణ మంత్రి, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తదితరులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా ప్రతిస్పందించాలని సైన్యానికి దేఏశాలు జారీ చేశారు. కాగా.. తమ సేనలు రఫాలో గగనతల దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ‘‘రఫా ప్రాంతం లో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్న ఐడీఎఫ్ ట్రూప్స్ మీద.. హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. యాంటీ ట్యాంక్ క్షిపణులను ప్రయోగించారు. యుద్ధవిమానాలు, శతఘ్నులతో ఐడీఎఫ్ వారికి దీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదులకు చెందిన పలు సైనిక నిర్మాణాలు, సొరంగాలు ఈ దాడుల్లో దెబ్బతిన్నాయి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐడీఎఫ్ దాడుల్లో 33 మంది మరణించినట్టు గాజా స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ జరగడానికి కొన్ని గంటల ముందే.. గాజాలోని పాలస్తీనా పౌరులపై హమాస్ దాడులకు పాల్పడబోతున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందంటూ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొనడం గమనార్హం. కానీ, అదంతా ఇజ్రాయెల్ దుష్ప్రచారమేనంటూ హమాస్ ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. శనివారం రాత్రి మరో ఇద్దరు ఇజ్రాయెలీల మృతదేహాలను అప్పగించింది. దీంతో ఇప్పటిదాకా హమాస్ 12 మృతదేహాలను అప్పగించినట్టయింది. హమాస్ దాడుల నేపథ్యంలో.. తదుపరి నోటీసులు జారీ చేసేదాకా గాజా ప్రాంతంలోకి మానవతా సహాయాన్ని అందకుండా నిలిపివేస్తున్నట్టు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణ కారణంగా కొద్దిరోజులుగా ఆ ప్రాంతానికి అందుతున్న మానవతా సాయం తాజా పరిణామాలతో నిలిచిపోయినట్టయింది.
Updated Date - Oct 20 , 2025 | 04:12 AM