International Space Station: ఐఎస్‌ఎస్‌లోకి శుభాన్షు
ABN, Publish Date - Jun 27 , 2025 | 04:21 AM
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎస్)లోకి ప్రవేశించారు. వారికి ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు వ్యోమగాములు సాదరంగా స్వాగతం పలికారు.
ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర
ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైన గ్రేస్
కొత్తగా వచ్చిన నలుగురికి స్వాగతం పలికిన ఏడుగురు వ్యోమగాములు
త్రివర్ణ పతాకంతోపాటు మీ ప్రేమ కూడా నాతో ఉంది
అంతరిక్షం నుంచి భూమి అద్భుతం
భారరహిత స్థితిలో అంతా కొత్తగానే..
శిశువులా నేర్చుకుంటున్నా
వీడియో లింక్ ద్వారా శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ, జూన్ 26: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎ్‌సఎస్)లోకి ప్రవేశించారు. వారికి ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు వ్యోమగాములు సాదరంగా స్వాగతం పలికారు. అంతరిక్షం నుంచి భూమిని చూసే అరుదైన అవకాశం తనకు లభించటంపై శుభాన్షు హర్షం వ్యక్తం చేశారు. తాను ఊహించుకున్న దానికన్నా గొప్పగా ఉందన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన గ్రేస్.. 28 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.01 గంటలకు ఐఎ్‌సఎ్‌సను చేరుకుంది. ఆ తర్వాత ఐఎ్‌సఎస్‌తో 12 జతల హుక్స్ ద్వారా అనుసంధానమయ్యే ప్రక్రియ మొదలైంది. ఐఎస్‌ఎస్‌కు గ్రేస్‌కు మధ్య సమాచార, విద్యుత్ లింకులు విజయవంతంగా ఏర్పాటయ్యాయి. దీనికి రెండు గంటల సమయం పట్టింది. గ్రేస్‌లోని వ్యోమగాములు నలుగురు ఐఎ్‌సఎ్‌సలోకి వెళ్లారు. తద్వారా ఐఎ్‌సఎ్‌సలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. శుభాన్షుకు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ 634వ బాడ్జి ఇచ్చారు. రోదసిలో ప్రయాణించిన 634వ వ్యోమగామి అని ఈ బ్యాడ్జి అర్థం. ‘భారత అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక కొత్త అధ్యాయం. మీతో మాట్లాడుతూ ఉంటా. నాతో త్రివర్ణ పతాకం ఉంది. మీ అందరి ప్రేమనూ నేను వెంట తీసుకొచ్చా. రాబోయే 14 రోజులూ శాస్త్ర పరిశోధనల పరంగా చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి’ అని శుభాన్షు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ అనే ప్రైవేటు సంస్థ చేపట్టిన ఈ ప్రయోగానికి శుభాన్షు.. మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మిషన్ కమాండర్‌గా ఉన్నారు. కాగా, ఐఎ్‌సఎ్‌సలో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములున్నారు. తాజాగా, వారికి మరో నలుగురు అదనంగా చేరారు.
ఒక శిశువులా నేర్చుకుంటున్నా: శుభాన్షు శుక్లా
భూమ్మీద నుంచి ఐఎ్‌సఎ్‌సకు వెళ్తున్న క్రమంలో గ్రేస్ వ్యోమనౌకలో ఉన్న వీడియో లింక్ ద్వారా శుభాన్షు శుక్లా మాట్లాడుతూ, గురుత్వాకర్షణ శక్తి లేని పరిస్థితుల్లో జీవించటం నేర్చుకుంటున్నానని, ఇదంతా ఒక శిశువులా అనిపిస్తోందన్నారు. అందరికీ హలో.. నమస్కారం అంటూ శుభాన్షు తన మాటలు ప్రారంభించారు. ప్రయోగానికి ముందు 30 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్న సంగతిని ప్రస్తావిస్తూ.. ‘లాంచ్‌ప్యాడ్ మీద గ్రేస్‌లో కూర్చోగానే ఎప్పుడెప్పుడు బయల్దేరుదామా అనే భావనే నా మనసు నిండా ఆవరించింది. ప్రయాణం ప్రారంభమవగానే సీటులో నెట్టివేయబడినట్టు అనిపించింది. అంతా నిశ్శబ్దం. శూన్యంలో తేలుతూ ఉన్నాం. తొలుత ఏమీ ప్రత్యేకంగా అనిపించలేదు. కానీ, కొంతసేపటి తర్వాత మాత్రం అద్భుతంగా అనిపించసాగింది’ అని తెలిపారు. ‘ఈ కొత్త అనుభవానికి అలవాటు పడటం మొదలైంది.. కొత్తగా అడుగులు వేయటం, నడవటం, తినటం, చదవటం, నన్ను నేను నియంత్రించుకోవటం వంటివన్నీ ఒక శిశువులా నేర్చుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఇదంతా కొత్త వాతావరణం, కొత్త సవాల్. నా సహచర వ్యోమగాములతో కలిసి నేర్చుకుంటున్నా. పొరపాట్లు చేయటం మంచిదే.. కానీ, వాటిని ఇతరులు చేస్తుంటే చూడటం వినోదాన్ని ఇస్తుంది’ అంటూ ప్రయాణంలో విశేషాల్ని, సరదాల్ని శుభాన్షు శుక్లా వివరించారు.
ఇది సమష్టి విజయం
ఈ ప్రయాణం తన వ్యక్తిగత ఘనత కాదని, దీంట్లో భాగస్వాములైన వారందరి సమష్టి విజయమని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని శుభాన్షు వినమ్రంగా పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం కూడా గొప్పదని, వారు లేకుంటే తాను ఇక్కడి దాకా వచ్చేవాడినే కాదన్నారు. గురుత్వాకర్షణ రాహిత్య స్థితిని తెలుసుకోవటం కోసం (జీరో జీ ఇండికేటర్) తమతోపాటు తీసుకొచ్చిన హంస బొమ్మను ప్రస్తావిస్తూ.. ‘భారతీయ సంస్కృతిలో హంసకు గొప్ప ప్రాధాన్యం ఉందని, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారని గుర్తు చేశారు. అవసరమైన దానిపైనే దృష్టి పెట్టి, అనవసరమైన వాటిని వదిలిపెట్టటం హంస లక్షణమని, ప్రస్తుత చంచల ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైనదన్నారు. ప్రయాణంలో తాను చాలాసేపు ప్రశాంతంగా పడుకున్నానని తన సహచరులు చెప్పినట్లు శుక్లా వెల్లడించారు. ఐఎస్ఎస్‌లో శుక్లా బృందం 14 రోజులపాటు ఉండనుంది. సైన్స్‌కు సంబంధించిన పలు ప్రయోగాలను ఈ బృందం చేయనుంది.
Updated Date - Jun 27 , 2025 | 06:21 AM