Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 69మంది మృతి
ABN, Publish Date - Oct 02 , 2025 | 03:13 AM
సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోగా...
సెబు(ఫిలిప్ఫిన్స్), అక్టోబర్ 1: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 69మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బోగో నగరంలో దాదాపు 90వేల మంది భూకంపం కారణంగా ప్రభావితమయ్యారు. మృతుల్లో దాదాపు సగం మంది ఈ నగరానికి చెందినవారేనని తెలుస్తోంది. భూకంపం ధాటికి అనేక ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు దెబ్బతిన్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై కొండచరియలు విరిగిపడటంతో అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. బుధవారం ఉదయం వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఫిలిప్పీన్స్ జియోలాజికల్ విభాగం ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఫిలిప్పీన్స్ ఇంకా కోలుకోకముందే, భూకంపం రూపంలో మరోసారి ప్రకృతి విరుచుకుపడింది.
Updated Date - Oct 02 , 2025 | 03:13 AM