Foreign Policy Criticism: ట్రంప్‌కు నోబెల్ సిఫార్సు లేఖ ఉపసంహరించాల్సిందే
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:43 AM
ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను శాంతి దూతగా కొనియాడిన పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత ప్లేటు ఫిరాయించారు.
ఆయన శాంతి దూత ఎలా అవుతారు?
ప్రభుత్వ నిర్ణయం పాక్ పరువు తీసింది
లేఖను వ్యతిరేకిస్తూ పాక్ నేతల ప్రకటనలు
ఇస్లామాబాద్, జూన్ 23: ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను శాంతి దూతగా కొనియాడిన పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. ట్రంప్‌ను 2026కు నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫార్సు చేస్తూ పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇక్బాల్ ధర్ రాసిన లేఖను ఇప్పటికే నోబెల్ ఎంపిక కమిటీకి పంపించారు. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత పాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జమాత్ ఉలేమా ఇ-ఇస్లాం అధ్యక్షుడు మౌలానా ఫజలుర్ రహమాన్ ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రభుత్వం తన లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్‌లపై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ సమర్థించడం శాంతికి సంకేతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎంపీ ముషాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ట్రంప్ ఇజ్రాయెల్ పన్నిన ఉచ్చులో ఇరుక్కున్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ మీద దాడి అధ్యక్షుడిగా ఆయన చరిత్రలో పెద్ద మరకగా మిగిలిపోతుందన్నారు. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ-ఇన్సా్‌ఫ(పీటీఐ) ఎంపీ అలీ మొహమ్మద్ ఖాన్ కూడా ప్రభుత్వం ట్రంప్‌కు అనుకూలంగా రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. పీటీఐ ఒక అధికారిక ప్రకటనలో ఇరాన్ సార్వభౌమాధికారానికి మద్దతు ప్రకటించింది. అమెరికా దాడిని ఖండించింది. పీటీఐ మేధావుల కమిటీ అధ్యక్షుడు రవూఫ్ హసన్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రభుత్వం తెలివితక్కువ నిర్ణయంతో మొత్తం జాతి సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కల్పించిందన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 04:45 AM