Nobel Prize in Medicine: రోగనిరోధక వ్యవస్థపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
ABN, Publish Date - Oct 07 , 2025 | 02:13 AM
మన శరీరంలోకి చొరబడే హానికారక సూక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించి, కాపుగాయాల్సిన రోగనిరోధక వ్యవస్థ.. మన అవయవాలపైనే దాడి చేయకుండా చేసే...
అమెరికాకు చెందిన మేరీ బ్రన్‌కో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన సకగూచీకి సంయుక్తంగా ప్రకటన
స్టాక్‌హోం, అక్టోబరు 6: మన శరీరంలోకి చొరబడే హానికారక సూక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించి, కాపుగాయాల్సిన రోగనిరోధక వ్యవస్థ.. మన అవయవాలపైనే దాడి చేయకుండా చేసే ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’పై కీలక పరిశోధనలు చేసిన మేరీ ఈ బ్రన్‌కో (64), ఫ్రెడ్ రామ్స్‌డెల్ (64), సకగూచి(74)లను ఈ ఏటి వైద్య నోబెల్ వరించింది. వీరిలో బ్రన్‌కో, రామ్స్‌డెల్ అమెరికన్లు కాగా.. సకగూచి జపనీయుడు. బ్రన్‌కో.. సియాటెల్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీ’లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రామ్స్‌డెల్.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘సోనోమా బయోథెరప్యూటిక్స్’లో శాస్త్రీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇక.. సకగూచీ ‘ఒసాకా యూనివర్సిటీ (జపాన్)’లోని ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్ రిసెర్చ్ సెంటర్ గౌరవ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రైజ్‌మనీ కింద ఇచ్చే 10.64 కోట్లను వీరు ముగ్గురూ సమానంగా పంచుకోనున్నారు. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పని తీరును తెలుసుకోవడానికి వారు చేసిన పరిశోధనలే కీలకమని నోబెల్ కమిటీ చైర్ ఒల్లె కాంపె కొనియాడారు.
ఏమిటీ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్?
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వద్ద ఉన్న యోధులు.. టీ సెల్స్. అయితే, అవి కట్టు తప్పి మన శరీర అవయవాల మీదే దాడి చేయకుండా ఉండేందుకు ప్రాథమికంగా వాటికి మన ఛాతీపైభాగంలో బ్రెస్ట్ బోన్ (పక్కటెముకలను కలిపే మధ్య భాగం-స్టెమ్) కింద ఉండే థైమస్ గ్లాండ్ (శైశవ గ్రంథి)లో ప్రాథమిక శిక్షణ లభిస్తుంది. అయితే, కొన్ని టీ-సెల్స్ అక్కడ విపరీతంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. అవి బయటకు వస్తే.. మన అవయవాల మీదే దాడి చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాసిస్, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు రావడానికి కారణమవుతాయి. అందుకే థైమ్‌సలో ‘సెంట్రల్ టోలరెన్స్’ అనే వ్యవస్థ వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించివేస్తుంది. కానీ, దాన్నీ తప్పించుకుని వచ్చిన టి-సెల్స్‌ను అదుపులో పెట్టేందుకు రోగనిరోధక వ్యవస్థలో ఇంకో ఏర్పాటు ఉంటుంది. అదే ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’.
ఈ వ్యవస్థ సీడీ4, సీడీ25, ఫాక్స్‌పీ3 వంటి ప్రత్యేక టి-సెల్స్ సాయంతో.. సదరు రోగ్ టి-సెల్స్‌ను అణచివేస్తాయి. అసలు ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉందని కనుగొనడానికి ఆధారం ఈ ముగ్గురి పరిశోధనలే. సకగూచి 1995లో ఒక కొత్త టి-సెల్ ఉపవర్గాన్ని గుర్తించడంతో ఈ ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్’ గురించి ప్రపంచానికి తెలియడం మొదలైంది. అప్పట్లో ఆయన గుర్తించిన టి-సెల్స్ ఉపవర్గాన్ని ఇప్పుడు రెగ్యులేటరీ టి-సెల్స్ లేదా టి-రెగ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వీటిని శాంతిదూతలు అనొచ్చు. అవసరానికి మించి పనిచేసే ఇమ్యూన్‌రెస్పాన్స్‌ను ఇవి అదుపులో పెడతాయి. సకగూచి వీటిని గుర్తించిన ఆరేళ్ల తర్వాత.. 2001లో బ్రన్‌కో, రామ్స్‌డెల్ ఫాక్స్‌పి3 జన్యువులో కలిగే ఉత్పరివర్తనాలే మానవుల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణమని గుర్తించారు. ఆ తర్వాత రెండేళ్లకు.. 2003లో సకగూచి తన ఆవిష్కరణను, బ్రన్‌కో, రామ్స్‌డెల్ ఆవిష్కరణతో అనుసంధానం చేసి.. తాను గుర్తించిన టి-రెగ్స్ అభివృద్ధిని నియంత్రించే మాస్టర్ స్విచ్ ‘ఫాక్స్‌పి3’ జన్యువే అని నిరూపించారు. ఇది.. ఇమ్యూనాలజీ అనే కొత్త విధానానికి దారులు తెరిచింది. ఈ వివరాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులందరూ.. ఆటో ఇమ్యూన్ వ్యాధులను, క్యాన్సర్ వంటివాటిపై పోరాటానికి టి-రెగ్స్‌ను ఉపయోగించుకునే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. కాగా.. 2025 సంవత్సరానికిగాను నోబెల్ పురస్కారాల ప్రకటన షూరూ అయింది. మంగళవారం భౌతిక శాస్త్ర నోబెల్, బుధవారం రసాయన శాస్త్ర నోబెల్, గురువారం సాహిత్య నోబెల్ విజేతలను ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి ఎవరికిచ్చేదీ శుక్రవారం, ఆర్థిక నోబెల్ విజేతను అక్టోబరు 13న (వచ్చే సోమవారం) ప్రకటించనున్నారు.
Updated Date - Oct 07 , 2025 | 02:13 AM