Nobel Institute: నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్
ABN, Publish Date - Oct 13 , 2025 | 06:47 AM
ఇటీవల వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రకటన సమాచారం అంతకుముందే లీక్ అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
న్యూఢిల్లీ, అక్టోబరు 12: ఇటీవల వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రకటన సమాచారం అంతకుముందే లీక్ అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీని వెనుక గూఢచర్యం ఉండొచ్చని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ అనుమానిస్తోంది. మరియా మచాడో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి విజేతగా ఎంపికయ్యే అవకాశాలు బెట్టింగ్ ప్లాట్‌ఫాం ‘పాలిమార్కెట్’లో రాత్రికి రాత్రే 3.75 శాతం నుంచి 73 శాతానికి పెరిగిందని ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ పేర్కొంది. మచాడోను ఈ ఏడాది విన్నర్‌గా నోబెల్ కమిటీ ఓస్లోలో అధికారికంగా ప్రకటించడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులు, మీడియా సంస్థల అంచనాల్లోనూ మరియా మచాడో పేరు ప్రముఖంగా వినిపించకపోవడం అత్యంత రహస్య సమాచారం లీకైందనే అనుమానాలను బలం చేకూరుస్తోంది. నోబెల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హార్ప్‌వికెన్ నార్వేకు చెందిన టీవీ2 టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఇది గూఢచర్యం అయ్యే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఈ వ్యవహారంపై నోబెల్ ఇన్‌స్టిట్యూట్ పరిశీలిస్తుందని, అవసరమైన చోట భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు.
Updated Date - Oct 13 , 2025 | 06:48 AM