New H 1B Lottery: హెచ్ 1బీ లాటరీ... ఇక కొత్తగా
ABN, Publish Date - Sep 24 , 2025 | 03:07 AM
లక్ష డాలర్ల వన్‌టైమ్ ఫీజుతో ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై కత్తి ఝుళిపించిన ట్రంప్ సర్కారు.. ఆ వీసాలు జారీ చేయడానికి ఇన్నాళ్లుగా వాడుతున్న లాటరీ విధానం...
అత్యధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం
జీతం ఆధారంగా నాలుగు శ్రేణులుగా వర్గీకరణ
ఎక్కువ జీతం ఉన్నవారికి సెలెక్షన్ పూల్‌లో 4 ఎంట్రీలు
మధ్యస్థం 3.. తక్కువ జీతం 2.. కొత్తవారికి ఒక ఎంట్రీ
వాషింగ్టన్, సెప్టెంబరు 23: లక్ష డాలర్ల వన్‌టైమ్ ఫీజుతో ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై కత్తి ఝుళిపించిన ట్రంప్ సర్కారు.. ఆ వీసాలు జారీ చేయడానికి ఇన్నాళ్లుగా వాడుతున్న లాటరీ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది! అత్యుత్తమ ప్రతిభ కలిగి.. అధిక వేతనాలు అందుకునేవారికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేలాగా ఈ కొత్త ఎంపిక ప్రక్రియను రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్’ నుంచి అనుమతి పొంది.. ఫెడరల్ రిజిస్టర్‌లో మంగళవారం ప్రచురించింది. ఇప్పటిదాకా హెచ్-1బీ వీసాల జారీకి అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) అనుసరిస్తున్న లాటరీ విధానంలో.. ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగాగానీ.. జీతం ఆధారంగాగానీ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వరు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటరైజ్డ్ విధానంలో లాటరీ వేసేవారు. ఎంపికైనవారు అమెరికాకు వచ్చేవారు. కానీ.. కొత్త విధానంలో ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని అనుసరిస్తారు. అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం.. ఎంపిక ప్రక్రియలో ఎక్కువ అవకాశాలు ఇస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా.. హెచ్-1బీ వీసాల కోసం వచ్చే దరఖాస్తులను.. ఎక్కువ జీతం (లెవెల్ 4), మధ్యస్థ జీతం (లెవెల్ 3), తక్కువ జీతం (లెవెల్ 2), ఎంట్రీ లెవెల్ (ఒకటో లెవెల్) అని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. వీరిలో ఎక్కువ నైపుణ్యం, ఎక్కువ జీతం ఉండే లెవెల్ 4 వారికి సెలెక్షన్‌పూల్‌లో నాలుగు ఎంట్రీలు ఇస్తారు. మధ్యస్థ జీతం ఉన్నవారికి 3 ఎంట్రీలు, తక్కువ జీతం ఉన్నవారికి 2 ఎంట్రీలు, ప్రవేశస్థాయివారికి ఒక ఎంట్రీ ఇస్తారు. ఒక ఎంట్రీని ఒక టికెట్‌గా పరిగణిస్తే.. ఒక టికెట్ ఉన్నవారు ఎంపికయ్యే అవకాశం 20% ఉంటుంది. అదే నాలుగు టికెట్లు ఉన్నవారు ఎంపికయ్యే చాన్స్ 80ు దాకా ఉంటుంది.
అంటే.. ఎక్కువ నైపుణ్యం ఉన్నవారే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటివారి వల్ల తమ దేశానికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నది ట్రంప్ సర్కారు ఉద్దేశం. అలాగని ఎక్కువ జీతం/ఎక్కువ ప్రతిభ ఉన్నవారినే కాకుండా.. అన్ని స్థాయులవారికీ అవకాశాలు కల్పించేలాగా ఈ విధానాన్ని రూపొందించినట్టు ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. ఈ కొత్త విధానం వల్ల.. హెచ్-1బీ వీసా వచ్చే అవకాశాన్ని మెరుగుపరిచేందుకకు కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు పెంచుతాయని.. ఇలా పెరిగే మొత్తం 502 మిలియన్ డాలర్ల దాకా (దాదాపు రూ.4,400 కోట్లు) ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేస్తోంది. అయితే.. లెవెల్ 1 ఉద్యోగాలకు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే చిన్న కంపెనీలపై ఈ విధానం వల్ల ఎక్కువగా భారం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నవే అయినప్పటికీ.. ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు మాత్రం ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ట్రంప్ సర్కారు ప్రతిపాదిస్తున్న ఈ కొత్త విధానం.. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగి ఉండి, అత్యధిక వేతనాలు అందుకునే భారతీయ సీనియర్ టెకీలకు ప్రయోజనకరమని, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మాత్రం దీనివల్ల నష్టమేనని వారు వివరిస్తున్నారు. కాగా.. ట్రంప్ సర్కారు రూపొందించిన ఈ విధానం ప్రస్తుతానికి ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరారు. ప్రజలు, పరిశ్రమ వర్గాలు.. ఇలా అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తీసుకున్నాకే కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నియమ, నిబంధనలను ఖరారు చేస్తారు.
Updated Date - Sep 24 , 2025 | 03:07 AM