Nepal in Turmoil as Youth Protests: నేపాల్‌అగ్నిగుండం
ABN, Publish Date - Sep 10 , 2025 | 03:51 AM
సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం.. నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది..
యువత ఆందోళనలు హింసాత్మకం.. పార్లమెంట్ సహా సుప్రీంకోర్టు, ప్రముఖుల ఇళ్లకు నిప్పు
ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా.. అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర, మంత్రులు
నేతల ఇళ్లపై దాడులు, నిప్పు.. కాలిన గాయాలతో మాజీ ప్రధాని ఖనాల్ భార్య మృతి
ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు.. ఆర్మీ బ్యారక్‌లకు ప్రముఖులు
సైన్యం చేతికి పాలన?.. తదుపరి ప్రధానిగా కఠ్మాండూ మేయర్ బాలేంద్ర షాకు అవకాశం?
కఠ్మాండూ, సెప్టెంబరు 9: సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం.. నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. సోమవారం మొదలైన ఆందోళనలు.. మంగళవారం హింసాత్మకంగా మారాయి. దీంతో.. హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు అధికారపక్షం.. విపక్షం అని చూడకుండా.. ప్రధాని సహా.. మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిపారు. వారి అధికారిక, ప్రైవేటు ఇళ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించగా.. ఆ మంటల్లో ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమయ్యారు. ఆర్మీ కొందరు మంత్రులు, వీఐపీలను హెలికాప్టర్లలో తమ బ్యారక్‌లకు తరలించగా.. ఆ అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. మహిళా మంత్రులపైనా విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించగా.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై తన్నుతూ.. తరిమి కొట్టారు. ఈ పరిణామాల మధ్య ప్రధాని కేపీ ఓలి రాజీనామా చేయగా.. దాన్ని ఆమోదించిన దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూడా తన పదవిని త్యజించారు. మాజీ ప్రధాని ప్రచండ పిలుపుతో యువత ఆందోళన పగ్గాలను అందుకునేందుకు కఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా(బాలెన్) సిద్ధమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో నేపాల్‌లో పాలన పగ్గాలను ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ చేపట్టే అవకాశాలున్నాయి.
అర్ధరాత్రి నుంచి హింసాత్మక ఘటనలు
నేపాల్ పార్లమెంట్ వద్ద పోలీసులు సోమవారం రబ్బర్ బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించడంతో.. సోషల్ మీడియాను పునరుద్ధరించిన ప్రభుత్వం.. రాత్రి 10 గంటల సమయంలో మాటమార్చింది. ప్రభుత్వాదేశాలతో సైన్యం, పోలీసులు ప్రజల ఇళ్లలోకి వెళ్లి, వందల సంఖ్యలో యువతను అరెస్టు చేశారు. దీంతో.. అర్ధరాత్రి నుంచి నేపాల్ భగ్గుమంది. ప్రధాని ఓలి ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వేర్వేరు సంఘటనల్లో మరో ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందారు. దీంతో.. మంగళవారం ఉదయం నుంచి హింస ఉధృత రూపు దాల్చింది. సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు భవనాన్ని ఆందోళనకారులు టార్గెట్‌గా చేసుకున్నారు. సుప్రీంకోర్టుతోపాటు.. పలు న్యాయస్థానాలకు నిప్పుపెట్టారు. ప్రధాని ఓలి ప్రైవేటు ఇంటిని తగులబెట్టారు. దేశాధ్యక్షుడి నివాసం ‘శీతల్ నివాస్’, కార్యాలయాన్ని దహనం చేశారు. సోమవారం నాటి హింసకు సాక్షిగా ఉన్న పార్లమెంట్ భవనం అగ్నికీలల్లో మండిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మాజీ ప్రధానులు-- డాక్టర్ బాబూరాం భట్టరాయ్(నేపాల్ సోషలిస్ట్ పార్టీ చీఫ్), పుష్పకమల్ దహాల్(ప్రచండ), షేర్ బహదూర్ దేవుబా(నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు), జలనాథ్ ఖనాల్ ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు. జలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవదహనమైనట్లు నేపాలీ పత్రికలు పేర్కొన్నాయి. అయితే.. కొన ఊపిరితో ఉన్న ఆమె ఆస్పత్రిలో చనిపోయినట్లు ఇండియాటుడే ప్రచురించింది. దేవుబా ఇంటిని తగులబెట్టడానికి ముందు ఆందోళనకారులు అక్కడున్న వారిపై భీకర దాడులు చేశారు. దేవుబా, ఆయన భార్య, నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి అర్జూరాణా దేవుబాపై విచక్షణారహితంగా దాడులు చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆర్థిక శాఖ మంత్రి, 65 ఏళ్ల వయసున్న బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను ఆందోళనకారులు వీధుల్లో తరిమికొట్టారు. ప్రభుత్వ ఆఫీసులకు నిప్పుపెట్టారు.
ఆర్మీ బ్యారెక్‌లకు ప్రముఖులు
నేపాల్‌లో హింస నేపథ్యంలో అధికారులు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా.. అన్ని ఎయిర్‌పోర్టులను మూసివేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 300 మంది సైనికులు పహారాకాస్తున్నారు. ప్రముఖులు దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో.. సైన్యం తమ హెలికాప్టర్లలో వారిని ఆర్మీ బ్యారెక్‌లకు తరలించింది. కఠ్మాండూలోని ఆర్మీ బేస్‌లలో ప్రధాని ఓలి సహా.. పలువురు మంత్రులు, అధికారులు, వీఐపీలు ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి ఆర్మీ..
‘ఓలీ రాజీనామా చేయాలి..’.. ‘కేపీ చోర్.. నేపాల్ చోడ్(కేపీ శర్మ ఓ దొంగ.. ఆయన నేపాల్‌ను వీడాలి)..’.. అంటూ యువత ఉద్యమం ఊపందుకోవడంతో.. మంగళవారం ఉదయం ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ ప్రధాని ఓలిని కలిశారు. ‘‘మీరు రాజీనామా చేస్తే తప్ప పరిస్థితి సద్దుమణిగేలా లేదు. మీరు రాజీనామా చేస్తే.. ఆందోళనల విరమణకు యువతను ఒప్పిస్తాం’’ అని ఆయన కోరినట్లు తెలిసింది. దాంతో ఓలి రాజీనామా చేశారు. ఆయన భరోసా ఇవ్వడంతోనే.. ఓలి దేశాన్ని వీడకుండా కఠ్మాండూలోనే ఉండిపోయినట్లు సమాచారం. ఆ వెంటనే ‘‘యువత సంయమనం పాటించాలి.. ఓలి రాజీనామా చేశారు’’ అంటూ ఓ ప్రకటన చేశారు. చర్చలకు రావాలంటూ యువతను ఆహ్వానించారు. ఈ పరిణామాలను బట్టి.. పాలనపగ్గాలను ఆర్మీ చీఫ్ తాత్కాలికంగా చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి 10 గంటల సమయం నుంచి కఠ్మాండూ సహా.. సమస్యాత్మకంగా మారిన జిల్లాల్లో ఆర్మీ మోహరించింది. యువత ఆందోళనలను వీడకుంటే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయంటూ మైకుల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ప్రధాని పదవిపై బాలెన్, రవి ఫోకస్
తదుపరి నేపాల్ ప్రధానిగా కఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా(బాలెన్) పేరు వినిపిస్తోంది. సోమవారం రాత్రే మాజీ ప్రధాని ప్రచండ యువత ఉద్యమానికి నాయకత్వం వహించాలని బాలెన్‌ను కోరడం గమనార్హం..! ప్రధాని రాజీనామా తర్వాత బాలెన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. అయితే.. ఆందోళనకారులు మాత్రం.. రాజీనామాలు సరిపోవని, అవినీతి నాయకులను జైళ్లకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. బాలెన్ తర్వాత.. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎ్‌సపీ) అధ్యక్షుడు రవి లామిచానే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓలి ప్రభుత్వం రవిని జైలులో పెట్టగా.. ఆయనను అధికారులు మంగళవారమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
జైళ్ల ధ్వంసం.. ఖైదీల పరారీ
నేపాల్ ఆందోళనలను పలు జైళ్లలోని ఖైదీలు అవకాశంగా మలచుకున్నారు. జలేశ్వర్ జైలులో 576 మంది ఖైదీలుండగా.. 575 మంది గేట్లను బద్ధలుకొట్టి పారిపోయారు. కాస్కీ జైలులో 981 మంది ఖైదీల్లో 900 మంది, తులసీపూర్‌లో 179 మంది ఖైదీలకు గాను 124 మంది, నక్షీ జైలులో 90 మంది పరారయ్యారు. దీంతో.. పలు జైళ్లలో ఖైదీలు ఆందోళనలు చేశారు. ఆందోళనలు ఉధృతమవుతుండడంతో.. ఆయా జైళ్ల అధికారులు ఖైదీలను స్వచ్ఛందంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లనుంచి విడుదలైన/పారిపోయిన ఖైదీల సంఖ్య 6,500గా ఉన్నట్లు నేపాల్ పత్రికలు పేర్కొన్నాయి. కాగా, ఆందోళనకారులు పార్లమెంటు భవనంలో వస్తువులను, తుపాకులను ఎత్తుకెళ్లారు.
Updated Date - Sep 10 , 2025 | 03:51 AM