NASA: సిటీ కిల్లర్!
ABN, Publish Date - Feb 21 , 2025 | 05:05 AM
ఇది భూమిని 2032 డిసెంబరు 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రజ్ఞులు ‘2024 వైఆర్4’గా నామకరణం చేశారు.
భూమి దిశగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
2032 డిసెంబరులో భూమిని తాకొచ్చు
దక్షిణ అమెరికా నుంచి పసిఫిక్ మహా సముద్రం, ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా ఎక్కడైనా పడొచ్చు
భారత్‌లో ముంబై, కోల్‌కతా ఆ పరిధిలో
న్యూయార్క్, ఫిబ్రవరి 20: దాదాపు 130నుంచి 300 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూమి దిశగా గంటకు 46,800 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది! ఇది భూమిని 2032 డిసెంబరు 22న ఢీకొట్టే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలానికి నాసా శాస్త్రజ్ఞులు ‘2024 వైఆర్4’గా నామకరణం చేశారు. న్యూయార్క్‌లోని స్వేచ్ఛాప్రతిమ (స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) అంతపెద్దగా ఉండే ఈ గ్రహశకలం ఢీకొంటే భూమ్మీద ఏకంగా ఒక నగరమే నాశనమైపోతుందనే అంచనాల నేపథ్యంలో దీన్ని ‘సిటీ కిల్లర్’గా కూడా వ్యవహరిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రం, సబ్-సహారన్ ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా.. ఎక్కడైనా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించే ముప్పుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిధిలో ఈక్వెడార్, కొలంబియా, వెనెజువెలా, నైజీరియా, సూడాన్, ఇథియోపియా, పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్ దేశాలున్నాయి. భారత్‌లో ముంబై, కోల్‌కతాలకు ముప్పుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత వేగంతో ఈ గ్రహశకలం భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత.. హిరోషిమాలో అణుబాంబు పేలుడు కన్నా 500 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
హిరోషిమాలో అణుబాంబు పేలుడు తీవ్రత 15 కిలోటన్నుల టీఎన్‌టీ కాగా.. ఈ గ్రహశకలం పేలుడు తీవ్రత 15-30 మెగాటన్నుల టీఎన్‌టీ దాకా ఉంటుందని వారు చెబుతున్నారు. భూమిని తాకితే.. ఆ తాకిడికి 3000 అడుగులకు పైగా వెడల్పైన గొయ్యి ఏర్పడుతుందని, ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనమయ్యే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి దాదాపుగా 37 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం 3.1శాతంమేర ఉందని తొలుత మంగళవారం నాసా శాస్త్రజ్ఞులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండురోజులపాటు దాని గమనాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం.. ప్రమాద శాతాన్ని 1.5 శాతానికి తగ్గించారు.
గతంలో తుంగుస్కాలో..
1908 జూన్ 30న ఉదయం 7.15గంటల సమయంలో రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగుస్కా నదీ పరీవాహక ప్రాంతంలో దాదాపు 177 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూవాతావరణంలోకి ప్రవేశించి.. గాల్లోనే పేలిపోయింది. అది మంచు ఎడారికావడం, మనుషుల జాడ అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఆ పేలుడు ధాటికి దాదాపు 8కోట్ల చెట్లు నిలువునా కాలిపోయా యి! 1908లోనే ఈ ఘటన జరిగినా రష్యా ప్రభుత్వం అక్కడికి 1921లో మాత్రమే శాస్త్రజ్ఞులను పంపింది. వారు అక్కడికి చేరుకోవడానికి ఆరేళ్లు పట్టింది.
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 21 , 2025 | 05:05 AM