Mossad Drone Operation: దటీజ్ మొస్సాద్
ABN, Publish Date - Jun 16 , 2025 | 06:10 AM
ఇరాన్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడివి? రష్యాలోకి ఉక్రెయిన్ ట్రక్కుల ద్వారా పంపినట్లుగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఆపరేషన్‌ను నిర్వహించిందా?
ఇరాన్‌లోనే డ్రోన్ల పరిశ్రమ
డబుల్ ఏజెంట్లతో అనుమతులు
(సెంట్రల్ డెస్క్)
ఇరాన్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడివి? రష్యాలోకి ఉక్రెయిన్ ట్రక్కుల ద్వారా పంపినట్లుగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఆపరేషన్‌ను నిర్వహించిందా? రోడ్డుమార్గంలో తరలిస్తే.. ఏ దేశం నుంచి పంపింది? ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాలపై చర్చలు జోరందుకున్నాయి. అయితే, ఈ వ్యూహం ఇప్పటిది కాదు! ఐదేళ్ల క్రితమే మొస్సాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పాగా వేసింది..! అక్కడే డ్రోన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. మొస్సాద్ నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రోన్స్’పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
డబుల్ ఏజెంట్ల సాయంతో..
మొస్సాద్ అధికారులు ఇరాన్ వ్యూహాలను తెలుసుకునేందుకు పలువురు ఇరానీయులను ఏజెంట్లుగా నియమించుకుంది. వీరినే డబుల్ ఏజెంట్లు అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఇరాన్ ప్రభుత్వం నుంచి ఐదేళ్ల క్రితం ఈ ఏజెంట్ల ద్వారా అనుమతులు తీసుకుంది. అంతేకాదు.. విడిభాగాలను ఒకేచోట కాకుండా.. ఆయా పరిశ్రమల్లో తయారు చేసేలా ఏర్పాట్లు చేసింది. టెహ్రాన్‌లోని ఇస్లామ్ షహర్ అనే పారిశ్రామిక వాడలో మరో కర్మాగారాన్ని స్థాపించి, అక్కడ అసెంబ్లింగ్ చేసింది. గత ఏడాది లెబనాన్‌లో హిజ్బుల్లా నేతలే లక్ష్యంగా మొస్సాద్ భారీ ఎత్తున పేజర్ బాంబులు, వాకీటాకీ బాంబులను పేల్చిన విషయం తెలిసిందే..! అప్పటికే టెహ్రాన్‌లో మొస్సాద్ ఏజెంట్లు తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. డ్రోన్లను అసెంబ్లింగ్ చేసి.. అంతర్గతంగా పరీక్షలు నిర్వహించారు. సూసైడ్ డ్రోన్లు సవ్యంగా పనిచేసేలా.. ప్రోగ్రామింగ్ చేశారు. పేలుడు పదార్థాలను కూడా సాధారణ ట్రక్కుల్లో ముడిపదార్థాల మాటున ఇస్లాం షహర్‌కు తెప్పించారు. అన్నీ సిద్ధమయ్యాక.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆదేశాల కోసం ఇంతకాలం ఎదురుచూశారు. ఇజ్రాయెల్ సర్కారు నుంచి ఆదేశాలు వచ్చిందే తడవుగా.. ఇరాన్ అణు స్థావరాలకు సమీపంలో సూసైడ్ డ్రోన్లను తీసుకెళ్లి తమ పనిని పూర్తిచేశారు. అయితే, ఇజ్రాయెల్ దాడులు జరిపాక ఇరాన్ మేల్కొంది. ఇస్లామ్ షహర్‌లోని కర్మాగారంలో డ్రోన్లను అసెంబుల్ చేసినట్లు ఆదివారం ఉదయం గుర్తించినట్లు ఇరాన్ వార్తాసంస్థ ‘ఇరాన్ ఖబర్’ వెల్లడించింది.
Updated Date - Jun 16 , 2025 | 06:12 AM