Pakistan Saudi Arabia Defense Pact: పాక్ సౌదీ రక్షణ ఒప్పందంలోకి మరిన్ని దేశాలు
ABN, Publish Date - Sep 20 , 2025 | 04:17 AM
అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా ఇటీవల వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుంది. గల్ఫ్, అరబ్ దేశాలు ఇజ్రాయెల్ సైనిక చర్యలపై...
ఖతార్, యూఏఈ చర్చలు జరుపుతున్నట్టు కథనాలు
న్యూఢిల్లీ, ఇస్లామాబాద్, సెప్టెంబరు 19: అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా ఇటీవల వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుంది. గల్ఫ్, అరబ్ దేశాలు ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరిన్ని దేశాలు పాక్- సౌదీ ఒప్పందంలో భాగమవుతాయనే చర్చ మొదలైంది. ఖతార్, యూఏఈ ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదీతో తాము చేసుకున్న రక్షణ ఒప్పందంలో మరిన్ని అరబ్ దేశాలు భాగమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. సౌదీతో తాము చేసుకున్న ఒప్పందంలో మరో దేశం చేరకూడదనే షరతు లేదని వివరించారు. పాకిస్థాన్‌కు బలహీనతలు ఉండడంతో నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను ఎప్పట్నించో చెబుతున్నానని ఆసిఫ్ పేర్కొన్నారు. ముస్లిం ప్రజలు, ముస్లిం దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదనే నిబంధన కూడా లేదని ఆసిఫ్ తెలిపారు. అయినా అణ్వాయుధాల విషయంలో పాక్ ఎప్పుడూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొన్నారు. ఇరుదేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా వెళ్లిపోయాక తాలిబన్లు, బలూచీస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి వారితో తాము పోరాడుతున్నామని ఆసిఫ్ వెల్లడించారు. అఫ్ఘాన్‌ను తమకు శత్రు దేశంగా అభివర్ణించిన ఆసిఫ్.. సౌదీ సైనికులకు పాక్ ఎప్పట్నించో శిక్షణ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇదిలా ఉండగా సౌదీతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎప్పట్లాగే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత్ శుక్రవారం అభిప్రాయపడింది.
Updated Date - Sep 20 , 2025 | 04:17 AM