PM Modi: నిజాం పాలనలో ఎన్నో దారుణాలు
ABN, Publish Date - Sep 18 , 2025 | 04:27 AM
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నిజాం పాలకుల చెర నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించడం...
హైదరాబాద్ విమోచన దినాన్ని గత పాలకులు పట్టించుకోలేదు
మేం వచ్చాకే ‘సెప్టెంబరు 17’ను అధికారికంగా ప్రకటించాం
మధ్యప్రదేశ్‌లో సభలో ప్రధాని మోదీ
ధార్ (మధ్యప్రదేశ్), సెప్టెంబరు 17: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నిజాం పాలకుల చెర నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకపాత్ర పోషించారన్నారు. ఉక్కు మనిషి పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో భాగమైందని కొనియాడారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రోజు సెప్టెంబరు 17. ఇది మరో చరిత్రాత్మక దినం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. భారత సైన్యం నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నాం’’ అని ప్రధాని చెప్పారు. హైదరాబాద్ విమోచన దినం మనకు స్ఫూర్తిదాయకమని, భరతమాత గౌరవం కంటే పెద్ద అంశమేదీ లేదని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని కూడా కొన్ని దశాబ్దాల పాటు జరుపుకోలేకపోయామంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం వచ్చాకే సెప్టెంబరు 17ను హైదరాబాద్ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించినట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు.
‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’ ప్రారంభం
తన పుట్టిన రోజునాడు మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్, రాష్ట్రీయ పోషణ్ మాహ్’ కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. వికసిత్ భారత్‌కు మహిళలు, యువత, పేదలు, రైతులు నాలుగు స్తంభాలని పేర్కొన్నారు. నారీ శక్తి మన దేశాభివృద్ధికి పునాది అన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటే ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా ఉంటారని, తల్లికి సుస్తీ చేస్తే మొత్తం ఇల్లంతా జబ్బు పడినట్లేనని తెలిపారు. అందుకే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పథకాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదే సమయంలో పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావించిన మోదీ.. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. అణు ముప్పులకు నవ భారతం భయపడదని మోదీ అన్నారు. కాగా, ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్’ అభియాన్ కారక్రమంలో భాగంగా ఈసీఐసీ బుధవారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా తన అధీనంలోని 160 ఆస్పత్రుల్లో, 1600కు పైగా డిస్పెన్సరీల్లో మహిళల కోసం హెల్త్ క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ హెల్త్ క్యాంపుల్లో ఉచితంగా రోగనిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Updated Date - Sep 18 , 2025 | 04:27 AM