ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Los Angeles Curfew: నిప్పురవ్వ.. పెను జ్వాలై..

ABN, Publish Date - Jun 11 , 2025 | 06:15 AM

లాస్‌ ఏంజెలెస్‌.. అంటే దేవతల నగరం అని అర్థం! తళుకుబెళుకు తారలకు నిలయమైన హాలీవుడ్‌ కొలువుదీరిన నగరం!! ఈ నగరం.. కిందటి శుక్రవారం(జూన్‌ 6) నుంచి రణరంగంగా మారింది! ఒకవైపు పోలీసులు, దేశ సైన్యంలోని రిజర్వ్‌ దళాలు, దళాలు, మెరైన్లు..

  • అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ దాడులతో రణరంగంగా మారిన లాస్‌ ఏంజెలెస్‌

  • భారీగా సైన్యం, మెర్లైన్ల మోహరింపు

  • ట్రంప్‌ నిర్ణయంపై కాలిఫోర్నియా గవర్నర్‌ అభ్యంతరం.. రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి

  • ఇతర నగరాలకూ విస్తరిస్తున్న నిరసన జ్వాల

  • అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారిన లాస్‌ ఏంజెలెస్‌

లాస్‌ ఏంజెలెస్‌.. అంటే దేవతల నగరం అని అర్థం! తళుకుబెళుకు తారలకు నిలయమైన హాలీవుడ్‌ కొలువుదీరిన నగరం!! ఈ నగరం.. కిందటి శుక్రవారం(జూన్‌ 6) నుంచి రణరంగంగా మారింది! ఒకవైపు పోలీసులు, దేశ సైన్యంలోని రిజర్వ్‌ దళాలు, దళాలు, మెరైన్లు.. మరోవైపు బాష్పవాయు ప్రయోగాలకు, రబ్బర్‌ బుల్లెట్లు, ఫ్లాష్‌ గ్రనేడ్లకూ అదరక బెదరక నిరసన తెలుపుతున్న సాధారణ పౌరులు!! క్షణక్షణం ఉద్రిక్తం.. ఇదీ అక్కడి పరిస్థితి! అక్రమ వలసదారులను డీపోర్ట్‌ చేయడమే లక్ష్యంగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చేపట్టిన తనిఖీలు, చేసిన అరెస్టులతో చిన్న నిప్పురవ్వలా మొదలైన ప్రజాగ్రహం.. వారిని అణచివేయడానికి ట్రంప్‌ సర్కారు ఏకంగా నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించడంతో పెను జ్వాలగా మారింది.

అసలేమైందంటే..

అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా జూన్‌ 6వ తేదీ ఉదయాన్నే ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు లాస్‌ ఏంజెలెస్‌ వెస్ట్‌లేక్‌లోని హోమ్‌ డిపో సహా రోజువారీ కార్మికులంతా పనికోసం వచ్చే ఏడు కేంద్రాలపై ఒకే సమయంలో దాడులకు దిగారు. వారిని ప్రశ్నించినందుకు.. క్యాలిఫోర్నియాలోనే అతిపెద్ద కార్మిక యూనియన్‌ చీఫ్‌ అయిన డేవిడ్‌ హ్యుయెర్టాను అరెస్ట్‌ చేశారు. లాస్‌ఏంజెలెస్‌ డౌన్‌టౌన్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు ఆయన్ను తరలించారు. ఆయనతోపాటు.. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న పలువురిని పట్టుకుని అక్కడికి తరలించారు. ఈ విషయం తెలియడంతో ఆ రోజు మధ్యాహ్నానికి పలువురు నిరసనకారులు డిటెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని శాంతియుతంగా నిరసన తెలపడం మొదలుపెట్టారు. సాయంత్రం 7 గంటల సమయంలో.. లాస్‌ ఏంజెలెస్‌ పోలీసులు నిరసనకారులను అక్కణ్నుంచీ చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం చేశారు. మర్నాడు(జూన్‌ 7న) ఐసీఈ అధికారులు సరిహద్దు గస్తీ ఏజెంట్లను రంగంలోకి దింపి మరోసారి అక్రమ వలసదారులను పట్టుకునేందుకు తనిఖీలు చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ కావడంతో వందలాది మంది.. తనిఖీలు జరుగుతున్న పారామౌంట్‌ బిజినెస్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. సాయంత్రానికి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆరోజు రాత్రి 7 గంటల సమయంలో.. లాస్‌ ఏంజెలె్‌సలో జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వంపై తిరుగుబాటుగా పేర్కొన్న ట్రంప్‌ యంత్రాంగం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేషనల్‌ గార్డ్‌ దళాలను రంగంలోకి దింపనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. కాలిఫోర్నియాలోని క్యాంప్‌ పెండిల్టన్‌లో ఉన్న 500 మంది మెరైన్లను హై అలర్ట్‌లో ఉంచనున్నట్టు అమెరికా రక్షణ మంతి పీట్‌ హెగ్సెత్‌ ప్రకటించారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ట్రంప్‌ సర్కారు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే నేషనల్‌ గార్డ్స్‌ మోహరింపును ఉపసంహరించుకోవాలని సూచించారు(ఎందుకంటే.. ఒక రాష్ట్ర గవర్నర్‌ విజ్ఞప్తి చేయకుండా ఫెడరల్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించడం సంప్రదాయం కాదు). ఇక, జూన్‌ 8వ తేదీన.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆరోజు ఉదయం 10.30 గంటల నుంచి ఒంటిగంట మధ్య.. వేలాది నిరసనకారులు డిటెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. డీపోర్టేషన్‌ ప్రక్రియపై తీవ్ర నిరసన వెలిబుచ్చారు. పోలీసులు అక్కణ్నుంచీ వెళ్లిపోవాలని హెచ్చరించారు. రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. పలువురిని అరెస్టు చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో ట్రంప్‌ సర్కారు శనివారం నియోగించిన 2100 మంది నేషనల్‌ గార్డ్‌ సిబ్బందికి అదనంగా సోమవారం మరో 2000 మందిని, 700మంది మెరైన్లను రంగంలోకి దించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా సైన్యాన్ని రంగంలోకి దించడం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని కాలిఫోర్నియా గవర్నర్‌ మండిపడుతున్నారు.

కాలిఫోర్నియాలో ఎందుకిన్ని దాడులు?

అమెరికాను అవకాశాల గడ్డగా భావించి ప్రపంచం నలుమూలల నుంచీ చాలా మంది అక్రమంగా వలస వస్తుంటారు. అలా వచ్చేవారు ఎక్కువగా ఉండేది ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ టెక్‌ కంపెనీలున్న కాలిఫోర్నియాలనే. ఆ రాష్ట్ర జనాభాలో 22 శాతం విదేశీ సంతతికి చెందినవారే. ప్యూరిసెర్చ్‌ గణాంకాల ప్రకారం 2022 నాటికి కాలిఫోర్నియా జనాభాలో 18 లక్షల మంది వలసదారులున్నారు. అందుకే ట్రంప్‌ గతంలో ఒకసారి.. ‘లాస్‌ ఏంజెలె్‌సపైకి అక్రమ వలసదారులు, నేరగాళ్లు దండెత్తారు’ అని సోషల్‌ మీడియాలో పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఐసీఈ అధికారులు కాలిఫోర్నియాపై.. ముఖ్యంగా లాస్‌ ఏంజెలెస్‌ నగరంపై దృష్టి సారించి వరుస దాడులు చేశారు.

-సెంట్రల్‌ డెస్క్‌

హార్వర్డ్‌కు వీసాల జారీ పునఃప్రారంభం

ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి విద్యార్థి (స్టూడెంట్‌/ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌) వీసాలు తిరిగి జారీ చేయాలని అమెరికా ఆదేశించింది. ఈ వీసాల ప్రాసెసింగ్‌ను పునఃప్రారంభించాలంటూ అన్ని దేశాల్లోని రాయబార కార్యాలయాలకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు చెప్పిన తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అమెరికాలోని అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్‌లో ప్రవేశం కోసం కలలు కనే భారతీయ విద్యార్థులకు కోర్టు తీర్పుతో భారీ ఉపశమనం లభించింది.

ఇతర నగరాలకూ పాకుతున్న ఘర్షణలు

ఇమ్మిగ్రేషన్‌ అధికారుల దాడులతో లాస్‌ ఏంజెలె్‌సలో మొదలైన నిరసనల పర్వం.. క్రమంగా కార్చిచ్చుగా మారి అమెరికాలోని ఇతర ప్రదాన నగరాలకూ పాకుతోంది. న్యూయార్క్‌, షికాగో, డాలస్‌, అట్లాంటా తదితర నగరాల్లో వేలాది మంది నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో సోమవారం పెద్ద సంఖ్యలో నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. శాన్‌హోసేలోని సిటీహాల్‌ వద్ద వందల మంది గుమిగూడి నిరసన తెలుపగా.. శాన్‌డియోగోలో రెండుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే.. లాస్‌వెగాస్‌, పోర్ట్‌లాండ్‌, సియాటిల్‌, న్యూయార్క్‌ నగరాల్లోనూ అందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. న్యూయార్క్‌లో ట్రంప్‌ టవర్‌ వద్ద నిరసనకు దిగినవారిలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాల్‌సలోనూ పోలీసులు ఒక నిరసనకారుణ్ని అరెస్ట్‌ చేశారు. అటు.. టెక్సస్‌ కాపిటోల్‌ వద్ద 500 మంది, శాన్‌ ఆంటోనియోలో కొన్ని వందల మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అట్లాంటా, డెట్రాయిట్‌, ఒక్లహామా నగరాల్లో కూడా పలువురు ర్యాలీలు చేపట్టారు.

Updated Date - Jun 11 , 2025 | 06:16 AM