Putin Praises Modi: ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు
ABN, Publish Date - Oct 04 , 2025 | 03:00 AM
తమ దేశం నుంచి ఇంధన కొనుగోళ్లు నిలిపివేయాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తుండటాన్ని రష్యా అధ్యక్షుడు...
ఇంధన కొనుగోళ్లలో రాజకీయాలు లేవు
ప్రధాని మోదీ తెలివైన నాయకుడు: పుతిన్
మాస్కో, అక్టోబరు 3: తమ దేశం నుంచి ఇంధన కొనుగోళ్లు నిలిపివేయాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తుండటాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి ఒత్తిళ్లకు భారత్ ఎప్పటికీ తలొగ్గదని చెప్పారు. ఎలాంటి అవమానాలనూ భరించడానికి కూడా సిద్ధపడదన్నారు. సోచిలోని వల్దాయ్ డిస్కషన్ క్లబ్‌లో జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘సమతుల్యంతో ఉండే తెలివైన నేత’ అంటూ ప్రధాని మోదీని కొనియాడారు. మాస్కోకు, ఢిల్లీకి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు వెనుక పూర్తి ఆర్థిక గణాంకాలే ఉన్నాయి తప్ప రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని వివరించారు. శిక్షించే విధంగా అమెరికా విధించిన సుంకాలతో ఏర్పడుతున్న నష్టాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనంతో భారత్ సమతుల్యం చేస్తోందన్నారు. వాణిజ్య భాగస్వాములపై అత్యధిక సుంకాలు విధిస్తే ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతాయని పుతిన్ అమెరికాను హెచ్చరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్లు పెద్దఎత్తున పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. భారత్ స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి రష్యాతో ప్రత్యేకమైన సహజ సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత ఉందని అంగీకరించిన పుతిన్.. దానిని సరిచేయడానికి భారత్ నుంచి మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు కొనుగోలు చేస్తామన్నారు. ఏఐతో పాటు ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో కలిసి పనిచేయాలన్న సూచనను స్వాగతించారు. భారత్ నుంచి సోచి సదస్సులో పాల్గొన్న వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ అరవింద్ గుప్తా ఆ ప్రతిపాదన చేశారు.
భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం
భారతీయ సినిమాలంటే తనకెంతో ఇష్టమని పుతిన్ తెలిపారు. తమ దేశంలో భారతీయ సినిమాలకు ఎంతో జనాదరణ ఉందని చెప్పారు. ‘‘మాకు భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాల కోసమే ప్రత్యేక టీవీ చానల్ నడుపుతున్నాం. భారత్ వెలుపల ప్రపంచంలో రష్యా ఒక్కటే బహుశా ఇలాంటి చానల్ నడుపుతోంది’’ అని పేర్కొన్నారు. డిసెంబరులో పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు.
Updated Date - Oct 04 , 2025 | 03:00 AM