Tang Renjian: అవినీతి కేసులో చైనా మాజీ మంత్రికి మరణశిక్ష
ABN, Publish Date - Sep 29 , 2025 | 03:24 AM
భారీ మొత్తంలో లంచాలు స్వీకరించిన కేసులో చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి టాంగ్ రెంజియన్‌కు ఆ దేశ కోర్టు ఆదివారం...
నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో రెండేళ్ల పాటు శిక్ష నిలిపివేత
బీజింగ్, సెప్టెంబరు 28: భారీ మొత్తంలో లంచాలు స్వీకరించిన కేసులో చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి టాంగ్ రెంజియన్‌కు ఆ దేశ కోర్టు ఆదివారం మరణశిక్ష విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేసిన టాంగ్ 2007 నుంచి 2024 వరకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో నిర్వర్తించిన వివిధ పదవులను ఉపయోగించుకుని వ్యాపారాలు, ప్రాజెక్టు కాంట్రాక్టులు, ఉద్యోగ బదిలీలు వంటి విషయాల్లో ఇతరులకు సహకరించి, బదులుగా సుమారు రూ.334 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు స్వీకరించారని కోర్టు తెలిపింది. టాంగ్ చేసిన నేరాలు దేశం, ప్రజల ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగించాయని, అందువల్ల ఆయన మరణశిక్షకు అర్హుడని తీర్పులో పేర్కొంది. అయితే టాంగ్ తన నేరాలను అంగీకరించడంతో రెండేళ్ల పాటు శిక్షను నిలిపివేస్తూ ఉపశమనం కల్పించింది. 2012లో షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన ఇప్పటివరకు సుమారు 10 లక్షలకు పైగా అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Updated Date - Sep 29 , 2025 | 03:24 AM