Donald Trump Intel CEO: ఇంటెల్ కంపెనీ సీఈఓకు ట్రంప్ హెచ్చరిక.. రిజైన్ చేయాల్సిందేనని వార్నింగ్
ABN, Publish Date - Aug 07 , 2025 | 10:07 PM
ఇంటెల్ సీఈఓకు చైనా కంపెనీలు, మిలిటరీతో సంబంధాలున్నాయన్న వార్తలపై అమెరికాలో వివాదం చెలరేగుతోంది. ఇది అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదమన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటెల్ సీఈఓ రాజీనామా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అల్టిమేటమ్ జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా కంపెనీలు, మిలిటరీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెల్ సంస్థ సీఈఓ లిప్-బు టాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఆయన తక్షణం సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు.
ఇంటెల్ సీఈఓ చైనా సెమీ కండక్టర్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు కొద్ది రోజులుగా అమెరికాలో వివాదానికి దారి తీశాయి. ఈ విషయమై ఆర్కాన్సాస్ రిపబ్లికన్ సెనెటర్ టామ్ కాటన్ ఇంటెల్ బోర్డు చైర్మన్ నుంచి వివరణ కోరారు. చైనాతో టాన్‌కు ఉన్న సంబంధాలు, చైనా సెమీకండక్టర్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు, మిలిటరీతో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు లేఖ రాశారు. అమెరికా ప్రజల పట్ల ఇంటెల్ తన బాధ్యతను సరిగా నిర్వర్తించగలుగుతుందా అన్న ప్రశ్న వస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఇంటెల్‌లో సెక్యూరిటీ నిబంధనల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
లిప్-బు టాన్ వందల కొద్దీ చైనా సెమీ కండక్టర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఏప్రిల్‌లో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిల్లో కొన్ని సంస్థలకు చైనా మిలిటరీతో కూడా సంబంధాలు ఉన్నట్టు బయటపడింది.
ఈ వివాదంపై బుధవారం ఇంటెల్ ఓ విస్పష్ట ప్రకటన విడుదల చేసింది. అమెరికా జాతీయ భద్రతకు ఇంటెల్, సంస్థ సీఈఓ లిప్-బు టాన్ పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. యూఎస్ రక్షణ రంగ సమగ్రతను కాపాడేందుకు ఎల్లప్పుడు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అల్టిమేటమ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఈ వివాదం ఇంటెల్ స్టాక్స్‌పై ప్రభావం చూపింది. గురువారం నాటి ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో షేరు విలువ ఏకంగా 5 శాతం పతనమైంది. ఇక టాన్ గత ఏడాది కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇతర చిప్ మేకర్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇంటెల్ ఇటీవల ఉద్యోగుల తొలగింపునకు కూడా పూనుకుంది.
Updated Date - Aug 07 , 2025 | 10:19 PM