Donald Trump Immigration: వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు
ABN, Publish Date - Jul 26 , 2025 | 10:50 AM
వలసల కారణంగా ఐరోపా పతనం అవుతోందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో ఐరోపా నేతలు వెంటనే మేల్కొని దిద్దుబాటు చర్యలకు దిగాలని సూచించారు. ఈ దారుణ ఆక్రమణను అడ్డుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: స్కాట్‌లాండ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వలసల కారణంగా ఐరోపా పతనమవుతోందని అన్నారు. ఈ విషయంలో ఐరోపా దేశాలు దిద్దుబాటు చర్యలకు దిగాలని అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఐరోపా అనేదే ఉండదని హెచ్చరించారు. ఈ దారుణ ఆక్రమణను ఐరోపా దేశాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు నాయకులు వలసలను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారికి తగిన గుర్తింపు రాలేదని అన్నారు.
ఈ సందర్భంగా వలసలను అడ్డుకునేందుకు తను చేపట్టిన చర్యల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ గురించి గొప్పగా చెప్పుకున్నారు. ‘గత నెలలో ఒక్కరు కూడా అమెరికాలోకి కాలుపెట్టలేదు. అమెరికాలో ఉంటున్న అనేక మందిని వెనక్కు కూడా పంపించాము’ అని ఆయన ఘనంగా చెప్పారు. ఐక్యరాజ్య సమితి 2020 నాటి గణాంకాల ప్రకారం, ఐరోపాలో 87 మిలియన్‌ల మంది అంతర్జాతీయ వలసదారులు నివసిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో సమావేశం కానున్నారు. ఆ తరువాత ఐరోపా పర్యటనలో భాగంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్‌తో కూడా సమావేశమవుతారు.
రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ట్రంప్ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు వీలుగా దేశ చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వేల మంది ఏలియన్స్‌ను (విదేశీయులు) అమెరికా నుంచి పంపేశారు. అయితే, ఈ చర్యలకు తీవ్ర ప్రతిఘటన మొదలైంది. అనేక మంది వలసదారులు వీధుల్లోకి వచ్చి ట్రంప్ చర్యలపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
ఇక వలసలకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలు ఇప్పటికే వలసల నిబంధనలను కఠినతరం చేశారు. ఇటలీని తాను ఐరోపా దేశాల శరణార్థ శిబిరంగా అస్సలు మారనివ్వనని ప్రధాని జార్జియా మెలోనీ భరోసా ఇచ్చారు. ఇక ఐరోపా సమాఖ్య అధికారులు మాత్రం సమతులమైన, మానవత్వంతో కూడిన వలసల విధానం ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 26 , 2025 | 10:59 AM