China Spy Drone: దోమ సైజులో గూఢచారి డ్రోన్..
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:47 AM
ఈ రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సైనిక కార్యకాలాపాల కోసం అనేక దేశాలు డ్రోన్లను విరివిగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా సరికొత్త విప్లవానికి తెరతీస్తూ..
చేతి గోరు కంటే చిన్నగా తయారీ
సైనిక అవసరాల కోసం చైనా అద్భుత సృష్టి
న్యూఢిల్లీ, జూన్ 26: ఈ రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సైనిక కార్యకాలాపాల కోసం అనేక దేశాలు డ్రోన్లను విరివిగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా సరికొత్త విప్లవానికి తెరతీస్తూ.. దోమ సైజులో ఉండే అతిచిన్న గూఢచారి డ్రోన్‌ను ఆవిష్కరించింది. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (ఎన్‌యూడీటీ) అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ డ్రోన్‌ను.. సైనిక కార్యకలాపాలు, రహ స్య మిషన్లు, నిఘా అవసరాలకు ఉపయోగించనున్నారు. 0.6 సెంటీమీటర్లతో చిన్న కీటకం సైజులో ఉండే దీన్ని ఇటీవల చైనా అధికారిక మిలటరీ చానెల్ సీసీటీవీ 7లో ప్రదర్శించారు. నల్లటి కర్ర లాంటి శరీరం, ఆకుల ఆకారంలో ఉండే రెక్కలు, తీగల్లాంటి కాళ్లతో ఇది చూడటానికి దోమలా ఉంటుంది. ఇది సూక్ష్మ జీవిలా కనిపించినా.. దీని వెనుక నిఘా, రహస్య ఆపరేషన్ల కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక సైనిక ఇంజనీరింగ్ ఉంది. ఇది పెద్ద సైన్యాన్ని సైతం స్తంభింపచేయగలదు.
రాడార్లు గుర్తించకుండా ఎగరగలదు
రహస్య మిషన్ల కోసం రూపొందించిన ఈ డ్రోన్.. సహజ వాతావరణంలో కలిసిపోతుంది. సంప్రదాయ భద్రతా వ్యవస్థలైన రాడార్లు వీటిని గుర్తించడం కష్టం. చైనా శాస్త్రవేత్తలు దాని బాడీ లో కమ్యూనికేషన్ గేర్, సెన్సర్లు, పవర్ యూనిట్లు, కంట్రోల్ ఎలకా్ట్రనిక్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ డ్రోన్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ సూక్ష్మ డ్రోన్‌పై భద్రతా రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్‌వర్డ్‌లు, సున్నితమైన డేటా తస్కరణకు నేరస్థులు ఇలాంటి డ్రోన్లను వినియోగించవచ్చని రక్షణ రంగ నిపుణుడు తిమోతి హీత్ ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Jun 27 , 2025 | 03:49 AM