China India relations: భారతీయులపై చైనా వీసాల వర్షం!
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:05 AM
సుంకాల యుద్ధంలో అమెరికాతో పోరాటం చేస్తున్న చైనా, భారత్ పట్ల తన వైఖరిని మార్చుకుని 85 వేలకుపైగా వీసాలను మంజూరు చేసింది. ఇది పరస్పర సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా జరిగిందని చెబుతూ, భారతీయుల్ని చైనా సందర్శించమని ఆహ్వానిస్తోంది.
ఈ ఏడాది జనవరి 1-ఏప్రిల్ 9 మధ్య
85 వేలకు పైగా వీసాలు మంజూరు
2023 ఏడాది మొత్తంలో ఇచ్చిన
వీసాలు 1.8 లక్షలు మాత్రమే
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో
భారత్ పట్ల మారిన చైనా వైఖరి!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సుంకాల సమరం చేస్తున్న చైనా.. భారత్ విషయంలో తన పంథా మార్చుకున్నట్టు తెలుస్తోంది. భారతీయులపై డ్రాగన్ కంట్రీ వీసాల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య దాదాపు 85 వేలకు పైగా వీసాలను మంజూరు చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే క్రమంలోనే ఇంత భారీ సంఖ్యలో వీసాలు మంజూరు చేసినట్టు భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘‘ఇండియన్ ఫ్రెండ్స్ మరింత మంది మా దేశాన్ని సందర్శించాలి. చైనా ద్వారాలు తీసే ఉంటాయి. సురక్షితం. స్నేహపూరిత వాతావరణాన్ని అనుభవించండి’’ అని ఫీహాంగ్ ఆహ్వానించారు. కాగా, గత 2023 ఏడాది మొత్తంలో భారతీయులకు 1.8 లక్షల వీసాలను మాత్రమే మంజూరు చేసిన చైనా ఈ ఏడాది తొలి నాలుగు(జనవరి 1-ఏప్రిల్ 9) మాసాల్లోనే 85 వేలకుపైగా వీసాలు ఇవ్వడం గమనార్హం. అంతేకాదు, వీసా దరఖాస్తుల్లో పలు ముఖ్యమైన సడలింపులు కూడా ఇచ్చింది. కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే కోరుతోంది. వీసా దరఖాస్తు దారులు వాటిని సమర్పించడానికి ఆన్‌లైన్ అప్పాయింట్‌మెంట్ బుక్ చేసుకునే విధానాన్ని తొలగించి, నేరుగా వీసా కేంద్రాల వద్ద దరఖాస్తులు సమర్పించే సౌలభ్యం కల్పించారు. అదేవిధంగా 180 రోజులకంటే తక్కువగా చైనాలో ఉండాలని భావించే వారికి బయోమెట్రిక్ డేటా, వేలి ముద్రలు వంటివాటిని మినహాయించారు. వీటితోపాటు.. వీసా ఫీజును కూడా తగ్గించారు.
రండి కలిసి పోరాడదాం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఎడతెగని సుంకాలపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని భారత్ సహా పలు దేశాలకు చైనా పిలుపునిచ్చింది. సుంకాల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ వ్యాఖ్యానించారు. భారత్, చైనాలు రెండూ అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద దేశాలని, ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఇదిలావుంటే, ట్రంప్ విధించిన సుంకాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు రావడంతో ఆయన ఇతర దేశాల విషయంలో కొంత వెనక్కి తగ్గారు. కానీ, చైనా విషయంలో తన పంతాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు
Updated Date - Apr 17 , 2025 | 04:05 AM