American Airlines: విమానం గాల్లో ఉండగా ఇంజెన్ నుంచి మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం
ABN, Publish Date - Jun 26 , 2025 | 09:56 AM
అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. అయితే, ఎయిర్‌పోర్టులో సురక్షితంగా తిరిగి ల్యాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మర్చిపోక మునుపే మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడం ప్రయాణికులను కలవర పెట్టింది. అయితే, పైలట్లు వెంటనే విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8.11 గంటలకు 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం లాస్ వేగస్ ఎయిర్ పోర్టు నుంచి నార్త్ కెరొలినాలోని చార్లొట్ ప్రాంతానికి బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్‌లో నుంచి మంటలు, పొగలు చెలరేగాయి. ఈ దృశ్యాలను చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
విషయాన్ని గుర్తించిన వెంటనే పైలట్‌లు విమానాన్ని వెనక్కు మళ్లించారు. బయలుదేరిన పది నిమిషాలకే విమానం లాస్ వేగస్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండయ్యింది. దీంతో, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు వెల్లడించారు. ఘటన తాలూకు దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక విమానం ల్యాండైన తర్వాత టెక్నికల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కానీ మంటలు చెలరేగాయని చెప్పేందుకు ఆధారాలు లేవని తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ చూడండి..
ఇవీ చదవండి:
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..
రన్నింగ్‌లో విమానం ఎక్కుదామనుకున్నావా.. అదేమైనా రైలా.. ఎవురయ్యా నువ్వు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 26 , 2025 | 03:21 PM