BP medication Failure: బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..
ABN, Publish Date - Aug 12 , 2025 | 07:30 AM
బీపీ మందులు పని చేయకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇవేంటో, పరిష్కార మార్గాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బీపీ మందులు పనిచేయకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె, మెదడు, కిడ్నీ ఆరోగ్యానికి బీపీ నియంత్రణలో ఉండటం అత్యంత అవసరం. అయితే, మందులు తీసుకుంటున్నప్పటికీ కొందరికి రక్తపోటు కంట్రోల్‌లో ఉండదు. ఈ పరిస్థితికి కొన్ని జీవనశైలి అలవాట్లు, ఇతర అంతర్గత ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణం. మరి ఇవేంటో ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.
ఉప్పు అధికంగా తీసుకోవడం
సాధారణంగా మనం తినే ప్యాకేజ్డ్ ఫుడ్స్, క్యాన్స్‌లో వచ్చే ఇతర ఫుడ్స్, రెస్టారెంట్ భోజనాలు, స్నాక్స్‌లో ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి తినే వాళ్ల శరీరంలోకి రోజుకు 5 గ్రాములకంటే ఎక్కువ ఉప్పు చేరుతుంటుంది. దీంతో, మందుల ప్రభావం తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని తప్పించుకునేందకు ఫుడ్ ప్యాకెట్స్‌పై ఉన్న లేబుల్స్ చదవాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఫుడ్స్‌నే ఎంచుకోవాలి. పొటాషియం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
అధిక కెఫీన్ వినియోగం
రోజుకు ఒకటి రెండు కాఫీలు, టీలు తాగితే పర్లేదు కానీ ఈ పరిమితి దాటితే మాత్రం రక్తపోటు కచ్చితంగా పెరుగుతుంది. కెఫీన్ ప్రభావం ఎక్కువగా ఉండే వారికి ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి, మధ్యాహ్న సమయాల్లో టీ, చాయ్‌కు బదులు హెర్బల్ టీలు వాడటం మంచిది.
అంతర్గత ఆరోగ్య సమస్యలు
స్లీప్ యాప్నియా, థైరాయిడ్, కిడ్నీ, ఎడ్రనల్ గ్రంథి సమస్యలు.. బీపీ మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నదీ లేనిదీ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఆ తరువాత రోగి పరిస్థితిని బట్టి చికిత్స ప్రారంభిస్తే బీపీ సులువుగా నియంత్రణలోకి వస్తుంది.
ఒకేసారి అన్ని మందులు తీసుకోవడం వల్ల శరీరం అసమతౌల్యానికి లోనవుతుంది. కాబట్టి, పలు మందులు వాడే వారు వైద్యుల సలహా మేరకు వాటిని ఉదయం, సాయంత్రం వేళల్లో విడివిడిగా తీసుకోవడం మంచిది. ఇక ప్రతిరోజూ ఒకే సమయానికి మందుల తీసుకోకపోయినా వాటి ప్రభావం తగ్గుతుంది.
డోసేజ్లో మార్పు అవసరం
వయస్సు, బరువు, జీవనశైలి మార్పుల వల్ల కాలం గడిచే కొద్దీ ఔషధ డోసేజ్ పెంచాల్సి రావొచ్చు. రోగి పరిస్థితిని అంచనా వేశాక వైద్యులు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి, బీపీ నియంత్రణలో లేని సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
బీపీ మందులు పనిచేయకపోవడానికి చాలా సందర్భాల్లో జీవనశైలి మార్పులే కారణం. మందులు వేసుకోవడంలో సమయపాలన, సరైన జీవన శైలి అలవాట్లు, వైద్యుల సహకారంతో ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలిక హృదయ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
Updated Date - Aug 12 , 2025 | 07:40 AM