Black Coffee Effects: వరుసగా 30 రోజుల పాటు బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కనిపించే మార్పులు
ABN, Publish Date - Aug 07 , 2025 | 09:10 PM
రోజూ బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కొన్ని స్పష్టతమైన మార్పులు కనిపిస్తాయి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది ఉదయం వేళ కాఫీ తాగనిదే రోజును ప్రారంభించలేరు. కొందరు బ్లాక్ కాఫీని కూడా ఇష్టపడతారు. అయితే, వరుసగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కొన్ని ఊహించని మార్పులు కూడా వస్తాయి. మరి ఈ మార్పుల గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీలో అధికమొత్తంలో ఉండే కెఫీన్ కారణంగా శరీరంలో డోపమైన్, నార్‌ఎపినెఫ్రిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మెదడు పనితీరు ఇనుమడిస్తుంది.
కెఫీన్‌తో ఎడ్రనలిన్ హార్మోన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరం అధిక శ్రమను తట్టుకునే విధంగా సమాయత్తం అవుతుంది.
జీర్ణక్రియలు కూడా 3 నుంచి 11 శాతం మేర వేగవంతం అవుతాయి. దీంతో, శరీరంలోని కొవ్వులు మరింత వేగంగా కరిగి బరువు తగ్గుతారు.
బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గి కణజాలం ఆరోగ్యం మెరుగవుతుంది.
అయితే, బ్లాక్ కాఫీతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫీన్ అడినోసిన్‌కు అడ్డంకిగా మారుతుంది. దీంతో, జీవగడియారం తీరులో మార్పులు వచ్చి రాత్రి నిద్ర చెడిపోతుంది.
అతిగా బ్లాక్ కాఫీ తాగితే కొందరిలో అసౌకర్యం, చికాకు పెరుగుతుంది. పరగడుపున కాఫీ తాగే వారిలో కొందరు యాసిడ్ రిఫ్లక్స్ బారిన పడతారు. కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ఇక కొందరిలో గాబరా కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ.. ముఖ్యంగా బ్లాక్ కాఫీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యాల బారిన పడకుండా కెఫీన్ ప్రయోజనాలను పొందేందుకు పరిమిత స్థాయిలో కాఫీ తాగాలని సూచిస్తున్నారు. పర గడుపున ఎట్టి పరిస్థితుల్లో కాఫీ తాగొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు యథాతథంగా పాటిస్తే కెఫీన్‌తో నష్టాలను చాలా వరకూ పరిమితం చేసుకుని గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు. మరి మీరూ ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి.
ఇవి కూడా చదవండి:
ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త
చాయ్‌తో పాటు బిస్కెట్లు తింటారా.. మరి ఈ విషయాల గురించి తెలుసా
Updated Date - Aug 07 , 2025 | 09:19 PM