Telugu Book Trends: యంగ్ పబ్లిషింగ్
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:19 AM
ఎక్కువ మందిని తెలుగులో చదవడానికి ప్రోత్సహించడం అనే స్పష్టమైన లక్ష్యం నాది. సేపియన్ స్టోరీస్ మాతృ సంస్థగా, ‘అజు పబ్లికేషన్స్’ ఇంప్రింట్ 2022లో ప్రారంభమైంది.
తెలుగు పబ్లిషింగ్ రంగంలో గత ఐదేళ్ళలో యువతరం నుంచి కొత్త పబ్లిషర్లు వచ్చారు. వీరు అటు పాత తరాన్ని, ఇటు కొత్త తరాన్ని సమన్వయం చేస్తూ పుస్తకాలు వేస్తున్నారు. సొంత అభిరుచులతో, దృక్పథాలతో తెలుగు ప్రచురణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురణ రంగంలో వారి తొలి అడుగుల గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి తెలుసుకునే ప్రయత్నం ఇది.
కొత్త తరం నుంచి కొత్త పాఠకులను తీసుకొచ్చాం
ఎక్కువ మందిని తెలుగులో చదవడానికి ప్రోత్సహించడం అనే స్పష్టమైన లక్ష్యం నాది. సేపియన్ స్టోరీస్ మాతృ సంస్థగా, ‘అజు పబ్లికేషన్స్’ ఇంప్రింట్ 2022లో ప్రారంభమైంది. 2024లో మా పుస్తకాలలో ఒకటైన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల (రచయిత: రవి మంత్రి) కేవలం ఎనిమిది నెలల్లోనే 1.75లక్షల కాపీలు అమ్ముడై, భారతీయ భాషలన్నిటిలోనూ ఎక్కువగా అమ్ముడైన ఫిక్షన్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. కాంటెంపరరీ, రీజినల్ స్టోరీస్‌కీ, స్టోరీటెల్లింగ్‌కీ ఉన్న బలాన్ని నమ్మినందుకు ఒక నేషనల్ బెస్ట్ సెల్లర్‌ని ఇవ్వటంతోపాటు, వేలమంది తెలుగువాళ్లతో వారి మొదటి పుస్తకాన్ని చదివించాం. కొత్త తరం నుంచి కొత్త పాఠకులని తయారు చేశాం. పాఠకులు ఉన్నారనీ, వారి అభిరుచికి తగిన పుస్తకాలను వాళ్లవరకు చేర్చాల్సిన పని పబ్లిషర్లదేననీ ఈ విజయం మాకు నేర్పింది. మేము ఇప్పటిదాకా ప్రచురించిన 23 పుస్తకాల్లో మధురాంతకం నరేంద్ర, వసీరా, అఫ్సర్, పూడూరి రాజిరెడ్డి, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ, వి. రాజారామ్మోహనరావు, శాంతి ప్రబోధ వంటి సీనియర్ రచయితలతోపాటు నేటి సాహిత్య సంభాషణను మారుస్తున్న రవి మంత్రి, మల్లికార్జున్, ఎస్.ఎం. గౌస్, ఇందుకూరి సీతారామరాజు, సాయి కౌలూరి, సాంబశివ తడవర్తి, అఖిల కొనకంచి, ప్రసాద్ రామతోట, శ్రీకాంత్ మిర్యాల, హర్షవర్ధన్ వంటి కొత్త రచయితలు కూడా ఉన్నారు. ఇతర భాషల నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదాలు ప్రచురించడంపైన కూడా దృష్టి పెడుతున్నాం. తెలుగు భాషను అక్కున పెట్టుకుంటూనే స్థలకాలాలకు అతీతంగా ఎదిగే ఒక సాహిత్య ఒరవడి సృష్టించాలనే ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం.
– అజు పబ్లికేషన్స్, aju.publications@gmail.com
కొత్త తరానికి సరికొత్త అనువాదాలు
ఒక కాలంలో తెలుగు నేలను రష్యన్ సాహిత్యం ప్రభావితం చేసినట్టుగా మరే సాహిత్యం చేయలేదు. ఇది రెండు మూడు తరాలను ప్రగతిశీల సాహిత్యం వైపు తీసుకువచ్చింది. అదే ప్రభావం నా మీదా ఉంది. అనువాద సాహిత్యంలో ఉండే భాష నాకు నచ్చేది, కానీ తరువాత నాకు కొత్తగా పరిచయమైన వాళ్ళకు ఆ పుస్తకాలు ఇచ్చి చదవమని అన్నప్పుడు ‘ఈ భాష అర్థం కాలేదు’ అని పక్కన పెట్టేశారు. కాలంతో పాటుగా భాషలో కూడా వచ్చిన మార్పు వల్ల అప్పటి భాషా పదాలని ఈనాటి పిల్లలు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారనిపించింది. వాటిని సరిచేసి ఈ తరానికి ఆ సాహిత్యం అందించడానికి చేసిన ప్రయత్నమే ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్. ప్రచురణ లోకి వచ్చిన తరవాత ఒక్క కాల్పనిక సాహిత్యం మాత్రమే ప్రచురించాలి అనుకోవడం లేదు. ఫిక్షన్‌తో పాటు సామాజిక విషయాలను అర్థం చేయించే పుస్తకాలూ కూడా అంతే అవసరం. అందులో భాగంగా అంబేద్కర్ ‘కులం పుట్టుక – నిర్మూలన’ పుస్తకం తీసుకువచ్చాం. ఇది ఐదువేల కాపీల వరకు అమ్ముడైంది. అంతమంది కొత్త పాఠకులకు అంబేద్కర్ రచనని అందించామనీ, ఆయన కృషిని జనాలకు మరింత దగ్గర చేసే ప్రయత్నంలో మేమూ చిన్న అడుగు వేశామనీ తృప్తి కలిగింది. రాబోయే ఈ సంవత్సర కాలంలో సాహిత్య విమర్శ, యువ కవుల కవిత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశీయ, బయట దేశాల సాహిత్యాన్ని, సామాజిక విషయాలు అర్థం చేయించే సాహిత్యాన్ని పాఠకులకు దగ్గర చేయా లన్నదే ఎన్నెలపిట్ట ఆలోచనా, ప్రయత్నమూ కూడా.
– ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్,
79895 46568 ennelapitta@gmail.com
నేటివ్ సృజనాత్మకతని దొరకబుచ్చుకునే గోస
ముద్దుకృష్ణ గారి వలే వచన కవిత్వానికి పరిమితమై ‘వైతాళికులు’ వంటి మరొక సంపుటి అచ్చు వేయాలని కుతూహల పడ్డాం. సంపాదకత్వం మాదేనన్నమాట. అందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మనమే ఆ పని చేద్దామనుకుని 2021లో ‘హోరు’ను ప్రారంభించాం. ఆలస్యమైనా అది అచ్చుకు సిద్ధమైంది. కొత్తగా రాస్తూన్న వాళ్ళ కవిత్వాన్ని ప్రచురించాలన్నది మరొక బలీయమైన కోరిక. ‘గాంధారి వాన’, ‘1818’ వంటి మా రచనలు గాక ‘మా నాయిన పాట’ (సుంకర గోపాలయ్య), ‘గచ్చెంసెట్టుకి అటూ ఇటూ’ (పాయల మురళీకృష్ణ), ‘ఇయ్యాల ఊళ్ళో’ (గూండ్ల వెంకట నారాయణ), ‘కుందుర్తి కవిత్వం’ కవిత్వ సంపుటాలతోపాటు, ‘ఆల్టర్ ఈగో’ (బహుశా వేణుగోపాల్) కథల సంపుటి ప్రచురించాం. పాపులిజం కన్నా కాలానుగుణమైన నేటివ్ సృజనాత్మకతని దొరకబుచ్చుకునే గోస పడుతున్నాం. ప్రచార సంరంభాల కన్నా భావజాల సారూప్యత ఉన్న మిత్రుల సహకారంతో ముందుకు వెళ్తు న్నాం. ఒన్–-టూ–-ఒన్ కాంటాక్టే మా పుస్తకాల పంపిణీకి కీలకం. కుందుర్తి సమగ్ర కవిత్వం పూర్తిగా అమ్ముడుపోవడం ఈ తరం చదువరితనానికి నిదర్శనం. జి. వెంకటకృష్ణ సమగ్ర కవిత్వ సంపుటి, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వానికి జి.ఎన్. సాయిబాబా అనువాదం, పెళ్ళూరు సునీల్ కవిత్వ సంపుటి, ఒక కవిత్వ విమర్శ వ్యాసాల సంకలనం... మొదలైనవి ప్రచురించే పనిలో ఉన్నాం. ఈ పని మొత్తానికీ నాటి ‘కవిత్వం ప్రచురణలు’ త్రిపురనేని శ్రీనివాస్ మాకు ఎప్పటికీ స్ఫూర్తి.
– హోరు ప్రచురణలు, horupublishers@gmail.com
చరిత్రలో ఈ కాలాన్ని నిలిపే రచనలు తేవాలన్నది లక్ష్యం
‘‘నువ్వు చదవాలనుకున్న పుస్తకం ఎవరూ రాయకపోయుంటే, నువ్వే రాయి’’ అన్న టోనీ మారిసన్ ఉవాచనే ‘‘నువ్వు చదవాలనుకుంటున్న పుస్తకం ఎవరూ వేయకపోతుంటే నువ్వే అచ్చేయ్’’ అని మాకు ప్రేరణగా మార్చు కున్నాం. మన చుట్టూ జరుగుతున్న కథనాలు, మనం అణచిపెట్టినా బయటకు పొంగుకొచ్చే భావోద్వేగాలు, మనం ఊహించడానికే హడలుతున్న భవిష్యత్తు దారుణాల అంచనాలు, మన గతాన్ని ప్రస్తుతంలోకి తీసుకొచ్చే అనువాదాలు... చరిత్రలో ఈ కాలాన్ని నిలుపుతూ ఇప్పటివారు మాత్రమే చేయగల రచనలు... ఇలాంటి పుస్తకాలు మా లక్ష్యం. చేతి లోకి తీసుకోవాలనిపించే కవర్ డిజైన్, కళ్ళకు ఇంపుగా ఉండే అక్షరాలు, చదివేసి పక్కకు పెట్టేశాక కూడా లోలోపల తిరుగాడే కథలు, కథనాలు—వీటి చుట్టూనే మా తాపత్రయం అంతా! ద్రవ్యోల్బణం ఎంత గిచ్చుతున్నా అబ్బా- అయ్యో అనుకుంటూ సాగిపోతూ, పుస్తకాల కొనుగోలు విషయంలో మాత్రం ‘‘పేజీకి ఇంతకన్నా పెట్టేది లేదు’’ అని బుసలు కొట్టే సమాజం మనది కాబట్టి, రేటుని ఒక రేంజ్ దాటనివ్వకుండా ఉంచడానికి పడే తంటాలు వేరే. మూడేళ్ళల్లో ఎనిమిది పుస్తకాలు తెచ్చాం. మంటో, అమృతా ప్రీతమ్, హమీద్ దల్వాయీ, నైనా దేవి, విద్యా రావ్‍లను తెలుగు పాఠకులకు మాదైన రీతిలో పరిచయం చేశాం. ముళ్ళపూడి శ్రీదేవి, అక్కినేని కుటుంబరావు రచనలు; ఓల్గా, పూర్ణిమ చేసిన అనువాదాలు ప్రచురించాం. ఈ ఏడాది తమిళ, కన్నడ, ఇంగ్లీష్ రచనల అనువాదాలు తెస్తున్నాం. అందులో ఒక గ్రాఫిక్ నవల కూడా ఉంది! ఒక పాపులర్-సైన్స్ పుస్తకం కూడా రాబోతుంది. అంతర్జాతీయ ప్రచురణల అనువాదం తీసుకోవాలన్న ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
– ఎలమి పబ్లికేషన్స్, 82474 74541 elamibooks@gmail.com
బతుకు లోంచి రాలిన శకలమైతే చాలు
ఎందుకు ఇదంతా? అంటే, సరైన సమాధానం లేదు. కానీ కారణాలున్నాయి. చెల్లాచెదురవుతోన్న కాలాన్ని కుప్పగా పోసుకోడానికి ఇదో మార్గంగా అనిపించిందేమో. ఇష్టమైన వ్యాపకం కనుక, ఇటు రావాలనిపించిందేమో. కానీ, స్పష్టంగానే ఉన్నాం. అనవసరాన్ని వడపోసి, అవసరాన్ని మాత్రమే మీ ముందుకు తెస్తాం. అక్షరదోషాలూ, అన్వయదోషాలూ లేని నిఖార్సైన పుస్తకాన్ని చేతిలో పెడతాం. ఎలాంటి పుస్తకాలు వేయాలన్న ప్రశ్న వేసుకున్నాం. పుస్తకం లోని ఏదో ఒక సందర్భం... భూమ్మీద ఉన్న సమస్త అసమానతల్లోని ఏదో ఒక అసమానతకు ఎదురు నిలబడాలి. ఏ డిస్క్రిమినేషనూ లేని హాయిని పంచాలి. జాన్రాల పట్టింపు లేదు. రేషనల్‌గా ఉంటే చాలు, బతుకులోంచి రాలిన శకలమైతే చాలు. ఈ లోకం ఎవరికి అన్యాయం చేసిందో, ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో... వాళ్ళని అచ్చులో ఉంచడమే మా ప్రాధాన్యత. ఈ ఏడాదే తొలి ప్రయత్నంగా కొత్త రచయితలు శరత్ – మెట్ల కలిసి రాసిన ‘తిమ్మిరి బిళ్లలు – తొడపాశాలు’ పుస్తకం వేశాం. రెండు ఎడిషన్లు అయిపోయాయి. ఇటీవలే ఝాన్సీ పాపుదేశి అనువాదం చేసిన నవలను ‘పరువు’ పేరుతో ప్రచురించాం. ఈ నవలది బాధితుల పక్షం, బలమైన గొంతు. అత్యంత త్వరలో సుజాత వేల్పూరి ‘పల్నాడు కథలు’ రెండో ఎడిషనూ, బండ్లమూడి స్వాతికుమారి కథలూ, మానస చామర్తి వచనమూ రాబోతున్నాయి.
– ఒక... పబ్లికేషన్స్, 96421 08756
అమ్మాయిల నుంచి మరిన్ని పుస్తకాలు రావాలి
నేను ‘లెటర్స్ టు లవ్’, ‘కడలి కథలు’, ‘చిక్ లిట్’ అనే మూడు పుస్తకాలు రాసాను, ‘మస్టర్డ్’ అనే పుస్తకానికి సంపాదకత్వం వహించాను. ఒకరోజు తెలుగులో మహిళా పబ్లిషర్స్ ఎవరున్నారు అని లిస్ట్ తీస్తే నాకు కనబడిన అంకె నన్ను షాక్‌కి గురి చేసింది. మహిళలు ఎక్కువమంది ఈ రంగంలో దిగే ధైర్యం చేయట్లేదు అనే విషయం అర్థమైంది. మరి నా దగ్గరకు ఆడపిల్లలు వచ్చి, ‘‘అక్కా మేము ఒక పుస్తకం రాశాము, దీన్ని పబ్లిష్ ఎలా చేయించాలి’’ అని అడిగినప్పుడు, అరే నేనూ ఒక పబ్లిషర్‌ను అయితే, నాలాంటి ఇంకెంతో మంది రైటర్స్, ముఖ్యంగా అమ్మాయిలకు కొన్ని మంచి పుస్తకాలను బయటకు తీసుకురావడంలో సాయం చేసినదాన్ని అవుతాను కదా అనిపించింది. ‘కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్’ అనే ప్రచురణ సంస్థని 2024లో స్థాపించాను. నా ఉద్దేశ్యం ఒకటే, మంచి పుస్తకాలు, ముఖ్యంగా అమ్మాయిల నుంచి మరిన్ని మంచి పుస్తకాలు తీసుకురావాలి. వాళ్ల రాయల్టీలు వాళ్ళకి ప్రతి పైసా అందించాలి. పుస్తకం క్వాలిటీలో రాజీ పడకుండా పని చేయాలి. వచ్చే బుక్ ఫెయిర్ లోపు మా ‘కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్’ నుంచి కనీసం పది పుస్తకాలైనా తీసుకురావాలనుకుంటున్నాం. రచనలకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్. మంచి కంటెంట్ ఉంటే, అక్షరరూపం ఇవ్వండి. పుస్తకరూపం మేమిస్తాం.
– కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్,
kadaliwritesandpublication@gmail.com
‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ మరుగున పడకూడదని...
తాతగారు కుందుర్తి ఆంజనేయులు, శీలా వీర్రాజు కలిసి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలు’ మొదలుపెట్టారు. దాన్ని మరుగున పడనివ్వకుండా చూడాలని నాకు గట్టిగా ఉంది. నా కవితా సంపుటి ‘జస్ట్ ఏ హౌజ్ వైఫ్’ ఫ్రీవర్స్ ఫ్రంట్ పబ్లికేషన్స్ పేరు మీద గత ఏడాది ప్రచురించాను. అలాగే నేనూ, శీలా సుభద్రాదేవి గారు నడుపుతున్న వాట్సాప్ గ్రూప్‌లో బహుమతి కవితల్ని ‘ఆనవాళ్లు 2023’ పేరుతో ప్రచురించాం. ప్రతీ ఏడాది ఇలాంటి సంకలనం తేవాలని ఉంది. కవిత్వం కోసం ఎప్పుడూ నిరంతరాయంగా పని చేయాలని, యువకవులతో శక్తివంతమైన కవితా సంపుటులు తేవాలన్నది నా ఆకాంక్ష.
– ఫ్రీవర్స్ ఫ్రంట్,
freeversefrontpublications@gmail.com
నాన్న నమ్మిన విలువలకు అంకితంగా...
జ్ఞానాన్ని పంచడానికే బతికిన మా నాన్న ఎం.ఎస్. భాస్కర్ అకాల మరణం తర్వాత ఆయన ఙ్ఞాపకంగా ఈ బాలా బుక్స్ పబ్లికేషన్స్ సంస్థను ఇదే ఏడాది జనవరిలో స్థాపించాను. ఇది ఆయన నమ్మిన విలువలకు అంకితమైనది. ఈ ప్రచురణ సంస్థ ద్వారా పిల్లలకు అవసరమైన సాహిత్యం, తెలుగులో మరచిపోతున్న క్లాసిక్ రచనలు, వేరే భాషలలో ఉన్న అమూల్యమైన రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తూ వస్తున్నాం. ప్రారంభించిన ఐదు నెలల్లో పెద్దల సాహిత్యంలో 13 పుస్తకాలు, పిల్లల సాహిత్యంలో 25 పుస్తకాలు ప్రచురించాం. పురిపండా అప్పలస్వామి, వి. ఆర్. రాసాని, జి. సి. జీవి, ఎం. జయదేవ్, దినేష్ వంటి రచయితలు రచనలు ఇందులో ఉన్నాయి. తమిళంలో రచయిత ముత్తునాగు రాసిన చారిత్రక నవల ‘సుళుందీ’ను తెలుగులో మేమే మొదటిసారిగా ప్రచురిస్తున్నాం. వీటితో పాటు రాబోయే కాలంలో మరో 20 పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
– బాల బుక్స్ పబ్లికేషన్స్,
99080 91509 balabookspublications@gmail.com
కంటెంట్ బాగుంటే చాలు, కొత్త పాత తేడా లేదు
2023లో మా తొలి పుస్తకంగా పూరి జగన్నాథ్ సినిమాల పైన ‘పూరి.. ది పవర్ హౌస్’ అన్న పుస్త కాన్ని పబ్లిష్ చేసే క్రమంలో మాకు ఎదురైన ఎన్నో ఇ బ్బ ం దు లన్నీ దృష్టిలో ఉంచు కొని, కొత్త రచయితలు అలాంటి ఇబ్బందులు పడ కుండా ఒక ప్రచురణ సంస్థ ద్వారా వారికి అండగా ఉండాలని, ‘ఝాన్సీ పబ్లికేషన్స్’ మొదలుపెట్టాం. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలను ప్రచురించాం. మాకు కంటెంటే కీలకం. కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేకుండా అందరి పుస్తకాలూ వేయడానికి సిద్ధం. రచయిత చెప్తున్న అంశమేమిటి, దాన్ని ఎలా చెప్తున్నారు, అది పాఠకులకు ఏ మేరకు చేరుతుందనే అంశాలను ఆలోచిస్తాం. మేము ప్రచురించిన ‘ఎర్ర మల్లెలు’ నవలలో స్త్రీ రుతుక్రమ అంశాలు, వైవాహిక జీవితంలో స్త్రీ ఎదుర్కొనే సమస్యలను అర్థవంతంగా చెప్పేందుకు రచయిత్రి దాసరి రోజారాణి ప్రయత్నించారు. పదకొండుమంది రచయితల మా ‘చౌరస్తా’ కథా సంకలనంలో ఒక్కో రచయిత ఒక్కో భిన్నమైన అంశాన్ని కథగా మలిచారు. పాలగిరి విశ్వప్రసాద్ 1989 నుంచి రాసిన కథల్ని ‘నల్లరేగడి నేలల్లో’ అనే కథాసంపుటిగా తీసుకొచ్చాం. ఈ ఏడాది నరేష్కుమార్ సూఫీ, సిద్ధార్థ కట్టా, రవీంద్ర రావెళ్ళ, సాయి వంశీ, గూండ్ల వెంకట నారాయణ మొదలైన రచయితల మొదటి నవలలతోపాటు, కొత్త రచయితల రచనలు కూడా తీసుకురాబోతున్నాం. మహిళా ప్రచురణకర్తగా ప్రత్యేకమైన ఇబ్బందులేమీ నేను పడలేదు. ప్రచురణ రంగం లోకి అడుగుపెట్టిన తర్వాత అందరూ పడే ఇబ్బందులే నేనూ పడ్డాను. ఆ క్రమంలో కొత్త విషయాలెన్నో నేర్చుకున్నాను.
– ఝాన్సీ పబ్లికేషన్స్, 63000 19394 jhansipublishers@gmail.com
మా ఏడు పుస్తకాల్లో ఐదు కొత్త రచయితలవే
ప్రచురణ సంస్థను వ్యాపారాత్మకంగా నడుపుతూ, మాకు మేలుగా అనిపించిన పుస్తకాలు వేయాలని 2023లో ‘రేగి అచ్చులు’ సంస్థని మొదలుపెట్టాం. ఈ సంస్థను నడిపే క్రమంలో మా తోటి ప్రచురణ సంస్థలన్నీ మాకు సహకరించాయి. ఆ వాతావరణం మాలో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికి ఏడు పుస్తకాలు ప్రచురించాం. మేము ప్రచురించాం అనేకన్నా, రచయితలు మమ్మల్ని నమ్మి తమ పుస్తకాలు ఇచ్చారనేది నిజం. రచయిత ఆలోచన, పాఠకుల ఆసక్తి, మార్కెట్ ట్రెండ్... ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ఈ సంస్థ నడుపుతున్నాం. మేమిద్దరం కథా రచయితలం కావడం, కథా రచయితలు మమ్మల్ని ఎక్కువగా సంప్రదించడం వల్ల మేము ఇప్పటిదాకా వేసిన ఏడు పుస్తకాల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కథా సంపుటాలే. సాయి వంశీ, రవీంద్ర రావెళ్ల, హరివెంకటరమణ, నరేష్కుమార్ సూఫీ, చరణ్ పరిమి, విశ్వరూప్ వేముల వీరందరివీ కథా సంపుటాలే. వీటితోపాటు రేణుక్ వల్లెపు సస్పెన్స్ నవల ‘భగీరథ కోన’ వేశాం. వీరందరిలో ఐదుగురికి అవే వారి తొలి పుస్తకాలు కావడం విశేషం.
– రేగి అచ్చులు, regiacchulu@gmail.com
Updated Date - Jun 23 , 2025 | 02:23 AM