ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telugu Literature,: భావోద్వేగాల్లో అవిభక్త కవలల్లాంటి వాళ్లం, కాబట్టే మేం కలిసి ఈ నవల రాయగలిగాం

ABN, Publish Date - Aug 04 , 2025 | 05:48 AM

పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ ఈ మధ్య ప్రచురించిన ‘రెక్కచాటు ఆకాశం’ నవల అనేక అంశాల రీత్యా ప్రత్యేకమైనది. ఇప్పటితరం

పర్‌స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ ఈ మధ్య ప్రచురించిన ‘రెక్కచాటు ఆకాశం’ నవల అనేక అంశాల రీత్యా ప్రత్యేకమైనది. ఇప్పటితరం స్త్రీల జీవితాల్లోని అనేక పార్శ్వాలను క్రమపద్ధతిలో చర్చలోకి తీసుకురావడం అందులో మొదటిది. ఇద్దరు రచయిత్రులు కలిసి దాదాపు మూడువందల యాభై పేజీల నవలని నిర్వహించడం మరొకటి. భిన్న శైలీ ప్రత్యేకతలు కలిగిన వీరు ‘సిస్టర్‌హుడ్’ భావన పట్ల ప్రేమతో అల్లిన కలనేత ఈ నవల. ఈ సందర్భంగా తొలి జంట నవలా రచయిత్రులు సుజాత వేల్పూరి, ఉమా నూతక్కిలతో -ముఖాముఖి.

జంటగా ఇంత పెద్ద నవల రాయడానికి మీ ఇద్దరినీ కలిపిన అంశాలు ఏమిటి? ‘రెక్కచాటు ఆకాశం’ నవలని మేమిద్దరం కలిసి రాయాలనే ఆలోచన అసంకల్పితంగా మొదలైంది. ఆ తర్వాత ప్రయత్నపూర్వకంగా ముందుకు సాగింది. మా ఇద్దరిలో బలంగా ఉన్న జెండర్‌ కాన్షస్‌నెస్‌, అణచివేయబడి నిశ్శబ్దమైపోతున్న నిస్సహాయ అనుభవాలకి గొంతుకనివ్వాలనే కాంక్ష- బహుశా ఈ రచనకి పురికొల్పాయని అనుకుంటున్నాము. స్పష్టంగా చెప్పాలంటే- నవల ఇతివృత్తం మమ్మల్ని కలిపిన ప్రథానాంశం. ‘రెక్కచాటు ఆకాశం’ కేవలం ఒక కథ కాదు– ఆత్మగౌరవ పతాక, ధిక్కార ప్రకటన. స్త్రీత్వం చుట్టూ సాలెగూడులా అల్లుకున్న పితృస్వామ్య భావజాలం, బయటికి హింసగా కనపడని వేధింపులు, మనసు మీద నిఘా, స్వేచ్ఛని అణచివేసే ప్రయత్నాలు, వేచివేచి వాటిమీద విరుచుకుపడిన ఆక్రోశం, ఇవన్నీ నవల్లో చర్చకు వస్తాయి. కథాంశపు తీవ్రత, మా ఏకీకృత స్త్రీవాద దృక్పథం, ఆలోచనల్లో సమన్వయం– ఇవన్నీ కలిసే ‘రెక్కచాటు ఆకాశం’ నవల సృజనకి మమ్మల్ని పురికొల్పిన అంశాలు.

జమిలి రచనలోని సాధకబాధకాలు? సహజంగా మా ఆలోచనా ధోరణి కొంతవరకూ ఒకేలా ఉంటుంది కాబట్టి, నవల సాఫీగా సాగిపోతుందనే అనుకున్నాం. నవల్లో ఒకటికి మించి ప్రధానపాత్రలు ఉన్నపుడు సాధారణంగా దేనికీ ప్రత్యేకత లేకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదంలో పడకుండా, ప్రతిపాత్రనూ వైవిధ్యంగా తీర్చిదిద్దడ మన్నది జమిలి రచన వల్లే సాధ్యమైంది. ఒకరు మొదలు పెట్టిన దాన్ని మరొకరు అందిపుచ్చుకుని సమర్థవంతంగా నెరుపుతూ ముందుకు తీసుకువెళ్ళగలిగే ప్రేరణ జమిలి రచన వల్లే సాధ్యమైంది. సవాళ్ల విషయానికి వస్తే, ఇద్దరు కలిసి ఒక కథను రాస్తున్నపుడు, ఒకరి వ్యక్తీకరణ మరొకరికి అతిగానో, అనవసరంగానో అనిపించే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో జంటస్వరాల మధ్య గందరగోళం పాఠకులకి కూడా అందే అవకాశం ఉంది. అయితే భావోద్వేగాల పరంగా మేం అవిభక్త కవలల వంటివాళ్లం కాబట్టి దాన్ని సులభంగానే దాటేశాం. కథ, కథనం కల్లోకం కాకుండా కాచింది అదే. ప్రతి రచయితకూ ఒక స్వరం, ఒక దృష్టికోణం ఉంటాయి. ఇద్దరు కలిసి రాస్తున్నపుడు, సహ రచయిత మీద నమ్మకం, రచన లక్ష్యంమీద ఉమ్మడి నిబద్ధత ఉండటం, ఆ స్వరాన్నీ దృష్టినీ సమర్థవంతంగా మరొక స్వరంతో దృష్టితో ఏకీకృతం చేయడానికి సహకరిస్తాయి. మా విషయంలోనూ అదే జరిగి ‘రెక్క చాటు ఆకాశం’ రూపుదిద్దుకుంది.

నవలా వస్తువు కొత్తగా చెపుతున్నది ఏమిటి? ‘పెళ్లి’, ముఖ్యంగా ‘మాతృత్వం’ వంటి వ్యక్తిగత అంశాలని సామాజికం చేసి, సాధారణీకరించి వాటికి ‘పవిత్రత’ పేరిట పలుపుతాళ్లు, గుదిబండలూ విధించ డాన్ని ఈ నవల ప్రశ్నిస్తుంది. సన్నిహిత సంబంధాలలో కూడా అధికార నిర్మాణాలు చొచ్చుకుపోయి విధ్వంసక ధోరణులకు ఎలా దారితీస్తాయో వివరిస్తుంది. ఒక స్త్రీ సెక్సువాలిటీని ఆమె బలహీనతగా భావించి, ఆమెను పాతాళానికి తొక్కేయాలనుకుంటే, ఆమె రెట్టింపు శక్తితో అగ్నిపర్వతంలా ఎగిసిపడి అటువంటి శక్తుల అంతు చూడగలదనేది ఈ నవలలో కొత్తగా మేము చెప్పిన అంశం. ఇటువంటి కథాంశంతో ఇంతకు ముందు నవల ఏదీ రాలేదని చెప్పగలం. ఈ నవల గాయాల ప్రదర్శన ఎంతమాత్రం కాదు. గాయాల పునరుక్తికి కారణమౌతున్న అణచివేత వ్యవస్థలకు వ్యతిరేకంగా తిరుగుబాటు స్వరంతో సవాలును విసురుతుందీ నవల. వ్యక్తిగత విషాదాలను ఈదటం నుంచి, సామూహిక సాధికారత దిశగా కొద్దిమంది స్త్రీలనైనా ఈ నవల ఆలోచింప చేస్తుందని ఆశిస్తున్నాం.

ఈ నవల ఎటువంటి పాఠకుల కోసం? ఈ నవల జెండర్‌కి అతీతంగా, స్త్రీ పురుష సీరియస్ పాఠకుల కోసం. హాపిలీ ఎవర్ ఆఫ్టర్ ఎండింగ్‌లూ, ఫీల్ గుడ్ ఫాక్టర్ల కోసమూ కాక, పుస్తకం మూశాక, ఒక్క క్షణం కూచుని ఈ నవలలో ఏదో ఒక అంశాన్ని గురించి కాసేపు ఆలోచించగలిగే పాఠకుల కోసం. చదువుకుని సంపాదిస్తూ తమకాళ్ళ మీద తాము నిలబడిన స్త్రీలంతా భద్రలోకంలో ఉన్నారనుకునే వారు కూడా ఈ నవలను చదవాలి. లింగ సమానత, స్త్రీల జీవితాల చుట్టూ అల్లుకున్న అనేక రాజకీయాలు, వంటి లోతైన ఆంశాల మీద ఆసక్తిని, ఆలోచనలను రేకెత్తించే సాహిత్యాన్ని ఇష్టపడేవారి కోసం ఈ నవల. స్వీయనిర్ణయాధికారం కోసం, తమదైన ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాటం చేసే స్త్రీలను అభిమానించే పాఠకుల కోసమే మా ‘రెక్కచాటు ఆకాశం’ నవల. స్త్రీలను సాటి స్త్రీల కంటే ఎవరూ లోతుగా అర్థం చేసుకోలేరని, సిస్టర్‌హుడ్‌తో స్త్రీలు మాత్రమే ఒకరి బాధల్ని సంతోషాల్ని మరొకరు embrace చేసుకోగలరని నమ్మే పాఠకుల కోసం ఈ నవల.

-కె.ఎన్. మల్లీశ్వరి

Updated Date - Aug 04 , 2025 | 05:48 AM