ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hindu Rashtra Debate: సంఘ్‌ సంకల్పం సాకారమయ్యేనా

ABN, Publish Date - Jul 05 , 2025 | 01:20 AM

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ మనోరథం నెరవేరలేదు. అయితే అది తన లక్ష్య సాధనలో వెనకడుగు వేయడం లేదు. ఒక హిందూ రాష్ట్ర (హిందూ రాజ్యం)ను నెలకొల్పాలనేది దాని ధ్యేయం.

రాజ్యాంగ ప్రవేశికలోని ‘సెక్యులర్‌’, ‘సోషలిస్ట్‌’ అనే పదాలను తొలగించాలన్న హోసబలె డిమాండ్‌కు ఎలాంటి రాజ్యాంగ సూత్రం కాని, సామాజిక అవసరం కానీ ఆధారం కానేకాదు. మతతత్వశక్తులు రగిలించిన మంటలకు ఆజ్యం పోయడమే ఆ డిమాండ్‌ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ (యు), అన్నాడీఎంకే, మొదలైన రాజకీయ పక్షాలు ఆరెస్సెస్‌ / బీజేపీకి మద్దతు నివ్వడం తమ ప్రధాన ఆశయాలకు నమ్మక ద్రోహం చేయడమే అవుతుంది. తమకు తప్పక విజయం లభించే ఒక పెద్ద పోరాటానికి ‘ఇండియా’ సంసిద్ధమవ్వాలి.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ మనోరథం నెరవేరలేదు. అయితే అది తన లక్ష్య సాధనలో వెనకడుగు వేయడం లేదు. ఒక హిందూ రాష్ట్ర (హిందూ రాజ్యం)ను నెలకొల్పాలనేది దాని ధ్యేయం. పవిత్ర రోమన్‌ సామ్రాజ్యం (క్రీ.శ.800–1800), ఇస్లామిక్‌ ఖలీఫా (క్రీ.శ. 632–1258) స్ఫూర్తితో హిందూ రాష్ట్ర భావన రూపుదిద్దుకున్నది. ఈ దేశ పాలన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఉండాలని ఆ భావన నిర్దేశిస్తుంది. వంద సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు భారత్‌ను హిందూ రాజ్యంగా పునః స్థాపించచడం ఒక పరమ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో సంఘ్‌ అప్పుడప్పుడూ వెనక్కు తగ్గినట్టు కనిపించినప్పటికీ దాని నిర్ణయం మారలేదు. హిందూ రాజ్య సంస్థాపనే దాని దృఢ సంకల్పం. సంకల్ప సాధనకు సరైన సమయం కోసం వేచి ఉన్నది. సంఘ్‌ హిందూ రాష్ట్ర భావనకు అనేక ఉప లక్ష్యాలు ఉన్నాయి. అవి: రాజ్యాంగ అధికరణ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, వారణాసి, మథుర మొదలైన పవిత్ర ప్రదేశాలపై హిందువులకు సంపూర్ణ హక్కు; బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ప్రాతిపదికగా ఉండే రాజ్యాంగాన్ని తీసుకురావడం మొదలైనవి. ఆధునిక జాతి–రాజ్యం (నేషన్‌–స్టేట్‌)కు పునాది పౌరసత్వ భావన హిందూ జాతి లేదా రాజ్యంకు మూల స్తంభం హిందూ మతం. ‘గురూజీ’గా సంస్మృతుడవుతున్న రాష్ట్ర్ీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్‌ (1940–73) ఎమ్‌ఎస్‌ గోల్వాల్కర్‌ తన పుస్తకం ‘We, or Our Nationhood Defined’లో ఇలా రాశారు: ‘హిందుస్థాన్‌లోని విదేశీ జాతులవారు అందరూ విధిగా హిందూ సంస్కృతిని అనుసరించాలి, హిందూ మతాన్ని గౌరవించాలి. హిందూ జాతి సంస్కృతిని మినహా మరే జాతి, సంస్కృతిని ఎట్టి పరిస్థితులలోను కీర్తించకూడదు. ప్రతి విదేశీ జాతి తన ప్రత్యేక అస్తిత్వాన్ని త్యజించి హిందూ జాతిలో సంలీనమవ్వాలి. హిందూ మతస్తులకు విధేయంగా ఉండి తీరాలి. దేనిపైన ఎలాంటి హక్కులు కోరకూడదు. విదేశీ జాతులవారు ఈ దేశంలో ప్రత్యేక అధికారాలు, సదుపాయాలకు అనర్హులు. పౌర హక్కులతో సహా ఏ విషయంలోనూ ప్రాధాన్యాన్ని ఆశించకూడదు, ఇవ్వడం జరగదు’.

సంఘీయులకు గోల్వాల్కర్‌ పరమ పూజనీయుడు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆలోచనా స్రవంతికి ఆయనే గంగోత్రి. హిందూ రాష్ట్ర విషయమై ఆరెస్సెస్‌ తన భావాలు, దృక్పథాన్ని మార్చుకున్నదని అనేందుకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ‘జాతీయ పౌర పట్టిక’ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆప్‌ సిటిజెన్స్‌ – ఎన్‌ఆర్‌సీ), ‘పౌరసత్వ (సవరణ) చట్టం’ (సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ ఆక్ట్‌ – సీఏఏ)ను సంఘ్‌ ఘంటాపథంగా సమర్థించింది, సంపూర్ణ మద్దతునిచ్చింది. ‘చట్టవిరుద్ధ’ వలసకారులను (ముఖ్యంగా బంగ్లాదేశీయులు, రోహింజ్యాలు) దేశం నుంచి బహిష్కరించేందుకు లేదా బలవంతంగా వారి వారి స్వదేశాలకు పంపించివేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆరెస్సెస్‌ మద్దతునిస్తోంది (జాతీయ పౌర పట్టిక అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ఆ చట్టం ఉద్దేశించని ఫలితాలకు – వేలాది హిందువులను పౌరులు కానివారుగా గుర్తింపవలసిరావడం– కారణమవడంతో ఆ ప్రక్రియను ఆపివేసింది).

2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెన్వెంటనే జమ్మూ–కశ్మీర్‌ రాష్ట్రానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. ఆ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370ను ఉపసంహరించేందుకు అదే అధికరణలోని 370(1), (d), (3) సెక్షన్లను ఉపయోగించుకున్నారు. మృదువుగా చెప్పాలంటే ఇది చాలా విడ్డూరమైన విషయం, విపరీతమైన చర్య. దీని రాజ్యాంగబద్ధత సందేహాస్పదమైనది. రాజ్యాంగ సవరణకు అధికరణ 368 నిర్దేశించిన పద్ధతిని అనుసరించకుండా చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అధికరణ 370(1), (d) కింద రాజ్యాంగ నిబంధనలు అన్నిటినీ జమ్మూ –కశ్మీర్‌కు వర్తింపచేసేందుకు రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించడం అధికరణ 370 రద్దుతో సమానమని సుప్రీంకోర్టు సమర్థించింది. తద్వారా మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా సర్వోన్నత న్యాయస్థానం నివారించగలిగింది. అయితే అనేక ముఖ్య ప్రశ్నలకు సుప్రీంకోర్టు తీర్పులో సమాధానాలు లేవు. దీంతో అధికరణ 370 రద్దుకు సంబంధించిన చట్టపరమైన సమస్యలో ఓడిపోయినప్పటికీ కశ్మీర్ విషయంలో ఏ ప్రభుత్వమూ తీసుకోలేకపోయిన సాహసోపేత నిర్ణయం తాము విజయవంతంగా తీసుకోగలిగామని మోదీ ప్రభుత్వం చెప్పుకోగలిగింది.

తన పదేళ్ల పాలన దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధిపరిచిందని, అమృత్‌ కాల్‌ (స్వర్ణయుగం)లోకి దేశం ప్రవేశించిందనే నిండు విశ్వాసంతో 2024 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 400 స్థానాలను గెలుచుకోవడాన్ని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను 400 స్థానాలను గెలుచుకుంటామని ఆయన స్పష్టంగా పదే పదే ప్రకటించారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీలు మొక్కవోని దీక్షతో ‘రాజ్యాంగాన్ని సంరక్షించాలి’ అన్న నినాదంతో ఆ ఎన్నికల పోరులో మోదీ పార్టీని ఢీ కొన్నాయి. ‘ఇండియా’ కూటమి నినాదం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఓటు వేస్తున్న ఓటర్లను కూడా బాగా ప్రభావితం చేసింది. ఫలితంగా ఆ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ‘ఇండియా’ కూటమికి ఓటు వేశారు. దీంతో భారతీయ జనతా పార్టీకి లభించిన సీట్ల సంఖ్య 240కి పరిమితమయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని మోదీ సాధించలేక పోయారు. దీంతో రాజ్యాంగానికి తాము సంకల్పించిన రీతిలో సవరణలు చేసేందుకు మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన అవరోధాలు నెలకొన్నాయి. మోదీ సర్కార్‌ ఇప్పటివరకు ఆ అవరోధాలను అధిగమించలేకపోయింది. ఈ ప్రతికూల పరిస్థితులు ఏవీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను నిరుత్సాహపరచలేదు. తన లక్ష్య సాధనకు అది తనదైన రీతిలో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కుహనా ప్రజాస్వామిక భావన అయిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ (వన్‌ నేషన్‌–వన్‌ ఎలెక్షన్‌–ఓఎన్‌ఓఈ)ను అమలుపరిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఒక నివేదికను సంసిద్ధపరిచారు. దానిపై దేశ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేందుకు ఒక సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) నేర్పాటు చేశారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందగలిగే దాకా ఆ జేపీసీ దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూనే ఉంటుంది.

హిందూరాష్ట్ర లక్ష్య సాధనకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ మరో అస్త్ర్ాన్ని ప్రయోగించింది. రాజ్యాంగపీఠికలో ఎమర్జెన్సీ కాలంలో అదనంగా చేర్చిన ‘సెక్యులర్‌’, ‘సోషలిస్ట్‌’ అనే పదాలు రాజ్యాంగ విరుద్ధమైనవని, వాటిని రాజ్యాంగ ప్రవేశిక నుంచి తొలగించాలని సంఘ్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఈ డిమాండ్‌ను తీవ్రంగా ఖండించాయి. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆ రెండు పదాలు ‘నొప్పి సలుపుతున్న గాయాలు’గా వ్యాఖ్యానించడం ద్వారా హోసబలె డిమాండ్‌కు ఒక మద్దతు కల్పించారు. సంఘ్‌ ప్రధాన కార్యదర్శి డిమాండ్‌ తీవ్ర చర్చకు దారితీయగా రాజ్యాంగ పదవిలో ఉన్న జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆ చర్చలో పాల్గొనడం పలువురిని విస్మయపరిచింది. అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చింది.

రాజ్యాంగ మున్నుడిలో ‘సెక్యులర్‌’ అనే పదం ఉండడం చాలా అసంగత విషయంగా హిందూరాష్ట్ర మద్దతుదారులు భావిస్తున్నారు. అయితే అనేక భాషలతో, బహు మతాలతో, వైవిధ్య సంపన్న సంస్కృతులతో వర్ధిల్లుతున్న ఒక ప్రజాస్వామిక దేశం ‘సెక్యులర్‌’ సమాజం కాకుండా మరేమవుతుంది? ఫ్రెంచ్‌ పౌరులలో అత్యధికులు కేథలిక్‌ క్రైస్తవులు. అయినప్పటికీ వారు ‘సెక్యులర్‌’ ఆదర్శాలకు సంపూర్ణంగా నిబద్ధులు. సంఘ్‌కు ఆక్షేపణీయంగా ఉన్న మరో పదం ‘సోషలిస్ట్‌’కు ఒక స్థిరమైన అర్థం లేదు. సంక్షేమ రాజ్య భావనను అభివర్ణించేందుకు ఆ పదాన్ని తరచు ఉపయోగిస్తుంటారు. భారత్‌ ఒక సంక్షేమ రాజ్యం అన్న సత్యాన్ని భారతీయ జనతా పార్టీ నిరాకరించలేదు. రాజ్యాంగ మున్నుడిలో ‘సెక్యులర్‌’, ‘సోషలిస్ట్‌’ అనే పదాలను అదనంగా చేర్చడం వల్ల రాజ్యాంగ మౌలిక నిర్మాణ ప్రాతిపదికను మార్చివేయలేదు. నిజానికి ‘లౌకికవాదం’ అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణమని 1973లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో స్పష్టం చేసింది ‘సోషలిజం’ ఆదర్శాలు ఆదేశిక సూత్రాల (అధికరణలు 36, 51)లో పరిపూర్ణంగా ప్రతిఫలించి ఉన్నాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం 1980లో వెలువరించిన మరో తీర్పులో పేర్కొంది.

సంఘ్‌ ప్రధాన కార్యదర్శి హోసబలె డిమాండ్‌కు ఆధారమేమిటి? ఎలాంటి రాజ్యాంగ సూత్రంకాని, సామాజిక అవసరం కానీ కానేకాదు. మతతత్వశక్తులు రగిలించిన మంటలకు ఆజ్యం పోయడమే ఆ డిమాండ్‌ లక్ష్యం. తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌(యు), అన్నా డీఎంకే, ఎల్‌జేపీ, జనతాదళ్‌(ఎస్‌) మొదలైన రాజకీయ పక్షాలు ఆరెస్సెస్‌ / బీజేపీకి మద్దతునివ్వడం తమ ప్రధాన ఆశయాలకు నమ్మకద్రోహం చేయడమే అవుతుంది. ‘ఇండియా’ కూటమి పక్షాలు ఒక పెద్ద పోరాటానికి సంసిద్ధమవ్వాలి. ఆ పోరులో అవి తప్పక విజయం సాధిస్తాయి.

-(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jul 05 , 2025 | 01:20 AM