నిధులు అక్కర్లేని హామీలైనా అమలు చేయరేం?
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:00 AM
మార్చి 19న ఈ ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత దశాబ్ద కాలంగా పాలన పేరుతో ఇప్పటి వరకూ నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే...
మార్చి 12 నుండీ 2025-26 సంవత్సరానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మార్చి 19న ఈ ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత దశాబ్ద కాలంగా పాలన పేరుతో ఇప్పటి వరకూ నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మనసులో ఏ అంశాలకు ప్రాధాన్యత ఉందో అవే ప్రభుత్వ పాలనా ఎజెండాగా మారతాయి. ప్రభుత్వంపై రాజకీయ పట్టు కలిగిన కొందరు క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు కూడా ప్రభుత్వ ఎజెండాలో ప్రవేశించవచ్చు. అంతే తప్ప పేద ప్రజల తక్షణ అవసరాలు, ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రజల ముందు పెట్టిన మేనిఫెస్టో అంశాలు ప్రభుత్వ ఎజెండాలోకి రావు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ పేరుతో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో అంశాల అమలుకు పెద్దగా బడ్జెట్ కేటాయింపులు కూడా అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు దాటినా అవి ఇప్పటివరకూ చర్చకు కూడా రాలేదు. పౌర సమాజ ప్రతినిధులు కొన్ని అంశాలను చర్చకు పెట్టినా, అవి ఇంకా ఆచరణకు నోచుకోలేదు. మేనిఫెస్టో మొదటి అధ్యాయంలో ఇచ్చిన హామీ ఒకటి: ‘‘పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్‌ను ఏర్పాటు చేసి, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం. ప్రజా ఫిర్యాదుల కొరకు ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం’’.
ఈ హామీ ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. రాష్ట్ర రాజధానిలో ‘ప్రజావాణి’ పేరుతో ఒక ప్రక్రియ నడుస్తున్నా, అది ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా రూపొందలేదు. గ్రామ, మండల స్థాయిలో ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారం అంశంలో ఇప్పుడే పైలట్ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో మొదలైంది. అనేక మంది పౌర సమాజ కార్యకర్తలు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ జిల్లాలో వచ్చిన అనుభవాల నుండీ రాష్ట్ర స్థాయిలో ‘ప్రజావాణి’ వ్యవస్థను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రక్రియ ఎంత సజావుగా ముందుకు వెళుతుందో ఇప్పుడే చెప్పలేం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తేవడం వల్ల ప్రజలు తమ బాధలు, సమస్యలు చెప్పుకునేందుకు ఒక వెసులుబాటు వస్తుంది. ప్రభుత్వం ఈ వైపు త్వరగా దృష్టి సారించాలి. దీనికి బడ్జెట్‌లో నిధుల ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఆరు గ్యారంటీలలో మరో అంశం బడ్జెట్‌లో నిధుల కేటాయింపుతో సంబంధం లేకుండా అమలు చేయవచ్చు. వివిధ జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో వేలాది పేద కుటుంబాలు కనీస ఇంటి స్థలం లేక ఇబ్బంది పడుతున్నాయి. ఆయా జిల్లాలలో పేదలు ఇంటి స్థలాల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇంటి స్థలం ఉంటే కానీ, ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద ఇల్లు మంజూరు చేయదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే పూనుకుని, ఆయా జిల్లాలలో ఉన్న ప్రభుత్వ భూముల నుండీ కొంత భాగాన్ని, ముందుగా స్థానికంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలంగా కేటాయించాలి.
రెవెన్యూ, గ్రామ పంచాయితీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో ఈ పని పూర్తిచేయవచ్చు. ప్రస్తుతం దీనికి బడ్జెట్ నుండీ నిధుల కేటాయింపు అవసరం లేదు. స్థలాల కేటాయింపు పూర్తయ్యాక అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించవచ్చు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో రైతుల నుండీ వందల ఎకరాల భూమి లాక్కుని పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడానికి పరుగులు పెడుతున్న ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇళ్ల స్థలం ఇవ్వడానికి కూడా అదే వేగంతో పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చినట్లుగా– లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా, నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక వెంటనే తయారు చేయవచ్చు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖలకు, రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీలకు ఉమ్మడిగా ఈ బాధ్యత అప్పగించవచ్చు. అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇందుకు నోడల్ ఏజెన్సీగా పెట్టవచ్చు. ఈ సంస్థలు, రైతు సంఘాలు, రైతు సహకార సంఘాల భాగస్వామ్యంతో రూపొందించే నివేదికలను వచ్చే ఖరీఫ్ నుండీ అమలు చేయవచ్చు. దీనికి బడ్జెట్‌లో తక్షణమే నిధుల కేటాయింపు అవసరం లేదు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో నిరుద్యోగ నిర్మూలన అంశం క్రింద ‘‘ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75శాతం రిజర్వేషన్ కల్పన’’ అనే హామీ ఉంది. ఇది మంచి హామీ. కానీ ఆచరణలోకి రాలేదు. గత ఏడాదిగా రాష్ట్రంలోకి తరలివస్తున్న పరిశ్రమల గురించి రోజూ ముఖ్యమంత్రి, మంత్రులు అట్టహాసంగా ప్రకటిస్తున్నారు కానీ, వస్తున్న ప్రైవేట్ పెట్టుబడిదారులు స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా అనేది చూడడం లేదు. చేవెళ్ళ ఎస్.సి. ఎస్.టి డిక్లరేషన్‌లో 5వ అంశంగా ఒక హామీ ఉంది: ‘‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరిస్తాం. ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం అందిస్తాం’’. నిజానికి ఇవి విప్లవాత్మక హామీలు. గత ఏడాదిగా వీటిని అమలు చేసి ఉంటే గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభించేది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను ఆయా కుటుంబాలకు వెనక్కు ఇవ్వడం అద్భుతమైన ప్రతిపాదన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. ఈ అంశంలో ఇచ్చిన రెండవ హామీ కూడా ముఖ్యమైనదే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని మర్చిపోయి, 2013 చట్టం ప్రకారం కాకుండా, కేసీఆర్ తెచ్చిన అన్యాయమైన 2017 భూసేకరణ చట్టం ప్రకారం ఆయా జిల్లాలలో భూములను సేకరించడానికి నోటిఫికేషన్లు ఇస్తున్నది.
అవసరమైన, అనివార్య స్థితిలో మాత్రమే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌లు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. మేనిఫెస్టోలో మద్యపాన విధానం అంశం క్రింద ‘‘బెల్టు షాపులను రద్దు చేస్తాం. మత్తు బానిసలకు ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం మర్చిపోయింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ హామీలను అమలు చేస్తే బెల్టు షాపులు నాశనమై మద్యం అమ్మకాలు తగ్గి ప్రభుత్వానికి కొంత ఎక్సైజ్ పన్ను ఆదాయం తగ్గవచ్చు. కానీ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా కోలుకుంటాయి. నిజానికి ఈ హామీలను అమలు చేయడానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం లేదు.
కన్నెగంటి రవి
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
ఇవి కూడా చదవండి:
BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Updated Date - Mar 19 , 2025 | 01:01 AM